నాకు పెళ్లయ్యింది..పర్లేదు వచ్చెయ్‌

13 Jan, 2020 17:58 IST|Sakshi

డిగ్రీ అయిపోయాక గవర్నమెంట్‌ జాబ్స్‌కి ప్రిపేర్‌ అవుతున్న సమయంలో ఆర్‌ఆర్‌బీ పోస్టులు పడటంతో ఓ కోచింగ్‌ సెంటర్లో జాయిన్‌ అయ్యాను. చదువు, ఇళ్లు తప్పా ఇంకేమీ తెలియదు. ఇన్‌స్టిట్యూట్‌లో నాకు చాలా మంది ప్రపోజ్‌ చేశారు. కానీ నేను అవన్నీ పట్టించుకునేదాన్ని కాదు. ఒకరోజు లంచ్‌ టైంలో నాతో మాట్లాడటానికి ట్రై చేశాడు. ఏదో బుక్‌ కావాలనే సాకుతో మాట్లాడుతున్నాడు. లైట్‌ తీసుకున్నా. తర్వాత అప్పుడప్పుడు హాయ్‌, హలో చెప్పుకునేవాళ్లం. ఒకరోజు వచ్చి నా ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఐడీ అడిగాడు. ఫ్రెండ్లీగానే అనుకొని నేను చెప్పా. తర్వాత ఫేస్‌బుక్‌లో మెసేజ్‌లు చేసేవాడు. చాలా క్యాజువల్‌గా మాట్లాడుకునేవాళ్లం. ఒకరోజు ప్రపోజ్‌ చేశాడు. తను చాలా మంచివాడు. ఎలాంటి బ్యాడ్‌ హ్యాబిట్స్‌ లేవు, నేనంటే చాలా ఇష్టం. ఇంకేముంది..తను వద్దని చెప్పడానికి నా దగ్గర ఒక్క కారణం కూడా లేదు. అలా తన ప్రపోజల్‌కి కొన్ని నెలల తర్వాత గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చా. 

కానీ మేం పెద్దగా మాట్లాడుకునేవాళ్లం కాదు. అప్పుడప్పుడు చాటింగ్‌, లేదా కాల్స్‌. ఒక్కసారి కూడా బయటికి వెళ్లలేదు. ఈ గ్యాప్‌లోనే తనకు మంచి జాబ్‌ వచ్చి చెన్నై వెళ్లిపోయాడు. అందరిలాగే మా రిలేషన్‌లోనూ చిన్నచిన్న గొడవలు అయ్యేవి. కొన్నిసార్లు రోజుల పాటు మాట్లాడకుండా ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇంతలో మావాళ్లు నాకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. విషయం తనకు చెప్పా. పెద్దగా రెస్పాన్స్‌ ఏమీ లేదు. అసలు పట్టించుకునేవాడు కాదు. పైగా ఇలాంటి అనవసరమైన విషయాలు చెప్పి నా టైం వేస్ట్‌ చేయకు అని కసిరేవాడు. చాలా బాధేసేది. ఎవరికి చెప్పాలో అర్థమయ్యేది కాదు.

రెండు నెలల తర్వాత నాకు ఓ సంబంధం ఫిక్స్‌ చేశారు మా పేరేంట్స్‌. విషయం చెప్పా. మళ్లీ అదే వెటకారం. కంగ్రాట్స్‌, హ్యాపీగా పెళ్లి చేసుకో అన్నాడు. నా గుండె పగిలినంత బాధ. ప్రేమించే వ్యక్తితో..నాకు వేరే వాళ్లతో పెళ్లి ఫిక్స్‌ అయ్యింది అని చెబితే కూడా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన తనని ఏం అనాలి? నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ పెళ్లి నాకు వద్దు అని గట్టిగా అరవాలనిపించేది. ఏమీ చేయలేని నిస్సహాయత. పెళ్లికి మావాళ్లు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలో తన నుంచి కాల్‌ వచ్చింది. ఈ పెళ్లి క్యాన్సిల్‌ చేసుకో. నాకు నువ్వు కావాలి అని. ఈ విషయం నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడూ రియాక్ట్‌ అయ్యుంటే పరిస్థితి వేరేలా ఉండేది. పెళ్లికి ఇంకా కొన్ని రోజులుండగా ఇలా చెబితే నేనేం చేయాలి?అప్పటికే పెళ్లి ఏర్పాట్లన్నీ అయిపోయాయి. ఇరు కుటుంబాల్లో నెలకొన్న సంతోషాన్ని, పరువును దూరం చేయడం ఇష్టంలేక..పెళ్లికి సిద్ధపడ్డాను. నా మ్యారేజ్‌ అయ్యాక తనే నన్ను మర్చిపోతాడులే అనుకున్నా. ఎందుకంటే తను అన్నింటినీ లైట్‌ తీసుకుంటాడు అనుకున్నా. 

పరిస్థితులు మారాయి. నా పెళ్లి జరిగి మూడు నెలలైనా నన్ను మర్చిపోలేదు. నా కోసం పిచ్చివాడిలా మారాడని ఫ్రెండ్స్‌ ద్వారా తెలిసి..ఏడ్వటం తప్పా ఇంకేమీ చేయలేను. మా ఊర్లో తెలిసిన బందువుల ఇంట్లో ఫంక్షన్‌ ఉంటే వెళ్లాను. తను అక్కడికి వచ్చాడు. నీతో మాట్లాడాలి. బైక్‌ ఎక్కు అన్నాడు. తనకి నశ్చచెప్పడానికి ట్రై చేశా. తను నా మాట వినలేదు. నేనే అక్కడ్నుంచి వెళ్లిపోయా. తర్వాత తెలిసిందేమంటే తను ఆ రోజంతా అక్కడే నాకోసం వెయిట్‌ చేశాడని. చాలా సార్లు తనని కన్విన్స్‌ చేయడానికి ట్రై చేశా. తను మాత్రం అస్సలు వినట్లేదు. నా భర్తతో కలిసి దిగిన ఫోటోలు సోషల్‌ మీడియాలో పెడితే చాలు..తన కోపం కట్టలు తెచ్చుకుంటుంది. కోపంతో పిచ్చోడిలా బిహేవ్‌ చేస్తూ సూసైడ్‌కి కూడా ప్రయత్నించాడు. తను ఇలా చేస్తాడని అస్సలు ఊహించలేదు. ఇప్పటికీ నాతో వచ్చెచ్‌ పెళ్లిచేసుకుందాం అంటాడు.

ప్రేమ మా జీవితాలతో ఎలా చెలగాటం ఆడుతుందో చూడండి. తన కోసం ఆరోజు నేనెంత ప్రాధేయపడ్డా, బతిమిలాడా...కానీ తను మాత్రం ఎంతో నిర్లక్ష్యంగా మాట్లాడాడు. ఇప్పడు నాకు వేరే అబ్బాయితో పెళ్లయ్యింది. విలువలు, కట్టుబాట్లను తెంచుకొని నీకోసం నేను రాలేనురా నన్ను క్షమించి. నా నిస్సహాయతను అర్థం చేసుకో. నా మీద ప్రేమ చంపేసుకో. నీకు నా కన్నా మంచి అమ్మాయి భార్యగా రావాలని కోరుకుంటున్నా. దయచేసి  నీ జీవితంలో ఇంకో అమ్మాయికి చోటివ్వు. 

--- ఇట్లు నీ స్వీటి 

మరిన్ని వార్తలు