హైదరాబాద్‌లోని 10 రొమాంటిక్‌ ప్రదేశాలు ఇవే!

18 Oct, 2019 19:25 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్‌ : సెలవు రోజుల్లో తమ ప్రియమైన వారితో సరదాగా అలా బయట గడపాలనుకునే వారు చాలామంది ఉంటారు. ముఖ్యంగా అప్పుడే ప్రేమలో పడ్డ జంట.. ఓ మంచి ప్రదేశంలో ఊసులాడుకోవాలని తహతహలాడుతుంటుంది. ఏదైనా ప్రత్యేక అకేషన్‌కు భాగస్వామిని ఓ మంచి ప్రదేశానికి తీసుకెళుదామకుంటారు. కానీ, ఎక్కడికి వెళ్లాలో తెలియక ఆగిపోతుంటారు. హైదరాబాద్‌ నగరంలో ప్రేమజంటలు విహరించటానికి అనువైన రొమాంటిక్‌ ప్రదేశాలకు కొదువలేదు. ఈ ప్రదేశాలు సరదాలనే కాదు అద్భుతమైన జ్ఞాపకాలను మీ ప్రేమకు తోడు చేస్తాయి. 


1) వాటర్‌ ఫ్రంట్‌

హైదరాబాద్‌లో ఉన్న ప్రముఖ రెస్టారెంట్లలో ఇది ఒకటి. హుస్సెన్‌ సాగర్‌కు సమీపంలో ఉన్న ఈ రెస్టారెంట్‌ పర్యటకులను ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. చక్కటి భోజనంతో పాటు వినసొంపైన సంగీతం వింటూ సాగర్‌ అందాలను చూస్తూ ఆనందించవచ్చు. 


2) నెక్లెస్‌ రోడ్‌ 
రాత్రి వేళ నెక్లెస్‌ రోడ్‌ అందాలు చూడటంలో మజానే వేరు. ఇక్కడి రోడ్డు ట్యాంక్‌బండ్‌ చుట్టూ నెక్లస్‌ ఆకారంలో ఒంపు తిరిగి ఉన్న కారణంగా ఈ ప్రదేశానికి నెక్లెస్ రోడ్‌ అని పేరు. ఇక్కడికి దగ్గరలో ఉన్న పురాతన రెస్టారెంట్లు, హోటళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. 


3) ట్యాంక్‌ బండ్‌ 
ప్రేమపక్షులు నిత్యం సేదతీరే ప్రదేశాలలో ట్యాంక్‌బండ్‌ ఒకటి. ట్యాంక్‌బండ్‌ అందచందాలు మనల్ని ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి. సాయం సంధ్యలలో ట్యాంక్‌బండ్‌ ప్రత్యేక శోభను సంతరించుకుంటుంది. సాగర్‌లో బోటింగ్‌ చేస్తూ నీటి మధ్యలో ఉన్న ఎత్తైన బుద్ధున్ని చూస్తూ సంతోషంగా గడపొచ్చు. 


4) లుంబినీ పార్క్‌
ఈ లుంబినీ పార్క్‌ హుస్సేన్‌ సాగర్‌కు సమీపంలో ఉంది. ఇది సంతవ్సరం పొడవునా పర్యటకులతో రద్దీగా ఉంటుంది. లేజర్‌ షో, సంగీత ఫౌంటెన్‌లు ఈ ప్రదేశానికి ప్రత్యేక ఆకర్షణ. 


5) ఎన్టీఆర్‌ గార్డెన్‌ 
హుస్సేన్‌ సాగర్‌కు సమీపంలో ఉన్న మరో అద్భుతం అని చెప్పొచ్చు. 36 ఎకరాల్లో ఉన్న ఈ పార్కు నగరం మధ్యలో బిర్లామందిర్‌, నెక్లస్‌ రోడ్డులకు దగ్గరగా ఉంది. ఇక్కడ ఉన్న స్వర్గీయ నందమూరి తారకరామారావు మ్యూజియం ఓ ప్రత్యేక ఆకర్షణ. 



6) గోల్కొండ ఫోర్ట్‌ 
వందల ఏళ్లనాటి ఈ కట్టడం పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధి. దేశం నలువైపుల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా పర్యటకులు దీన్ని చూడటానికి వస్తుంటారు. చెదిరినప్పటికి కోట అందాలు మనల్ని ముగ్ధుల్ని చేస్తాయి. 


7) దుర్గం చెరువు
ప్రకృతిలో గడపాలనుకునే జంటలకు ఇదో చక్కటి ప్రదేశం. ఇ‍క్కడి ప్రకృతి అందాలు మనల్ని ఆకట్టుకుంటాయని చెప్పటంలో అతిశయోక్తిలేదు. ప్రశాంతమైన వాతావరణంలో బోటింగ్ చేస్తూ గడపొచ్చు. లేదా, కొండలు, గుట్టలు మధ్య ఉన్న చెరువును చూస్తూ కూడా ఎంజాయ్‌ చేయొచ్చు.  రాక్‌ క్లైంబింగ్‌, ట్రెక్కింగ్‌ వంటి వాటికి అవకాశం ఉంది. 


8) లియోనియా రిసార్ట్‌
ఇది శామీర్‌ పేటలో ఉన్న ఓ ప్రముఖ రిసార్ట్‌. ప్రియమైన వారితో వీకెండ్‌ను ఎంజాయ్‌ చేయటానికి అనువైన ప్రదేశం. సకల హంగులతో కూడిన హోటళ్ల సముదాయాలు దీని ప్రత్యేకత. మెడి స్పా, సినిమా థియోటర్లు, లైవ్‌ ఫర్‌ఫార్మ్‌మెన్స్‌, సర్ఫింగ్‌ రిడ్జ్‌, వాటర్‌ పార్క్‌ మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. 


9) అనంతగిరి హిల్స్‌
 
హైదరబాద్‌లో ఉన్న అత్యంత సుందరమైన ప్రదేశాలలో ఇది ఒకటి. పచ్చదనం పరుచుకున్న ప్రదేశాలు మనల్ని ముగ్ధుల్ని చేస్తాయి. 3763 ఎకరాల విస్తిర్ణంలో ఉన్న కొండలు, పచ్చని చెట్లు మనసుకు ఆహ్లాదాన్ని ఆనందాన్ని ఇస్తాయి. మూసీ నది జన్మస్థానమైన అనంతగిరి కొండలు సినిమ షూటింగులకు ప్రసిద్ధి. 


10) రామోజీ ఫిల్మ్‌ సిటీ 
ప్రపంచంలోనే అతి పెద్దదైన ఫిల్మ్‌ సిటీగా పేరుగాంచిన రామోజీ ఫిల్మ్‌ సిటీ మీ జంటకు ఓ కొత్త అనుభవాన్ని, అనుభూతిని ఇస్తుంది. ఓ అధ్బుత లోకంలోకి అడుగుపెట్టినట్లుగా భ్రాంతి కలిగిస్తుంది. సరదాగా గడపాలనుకునే ప్రేమ జంటలకు ఇది అనువైన ప్రదేశం. 

మరిన్ని వార్తలు