ధైర్యం చేసి చెప్పలేకపోయా.. దూరమైంది

4 Dec, 2019 16:38 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అది 2003! అప్పుడప్పుడే ఇండియా క్రికెట్ వరల్డ్ కప్ ఓటమి బాధలోనుంచి బయటకొస్తున్న రోజులు. నేను ఆరవ తరగతి వరకు ఒక స్కూల్లో చదువుకుని ఏడవ తరగతికి వేరే స్కూల్లో చేరుదామని వెళ్లాను. అప్పుడు లంచ్ టైం! స్కూల్లో అందరు స్టూడెంట్స్ హడావుడిగా పరిగెత్తుతున్నారు. అందులో ఓ అమ్మాయి మీదకు నా చూపు వెళ్లింది. అప్పుడే నాకు జీవితంలో తొలిసారి ప్రేమంటే ఏంటో తెలిసింది(ఆ ఏజ్‌లో దాని ప్రేమ అంటారు అని కూడా సరిగ్గా తెలియదు). ఆ క్షణానే నా గుండెల్లో తన గుర్తు పడిపోయింది. తరువాతి రోజు నుంచి కొత్త స్కూల్కి వెళ్తుంటే చాలా సంతోషించా. ఎందుకంటే మళ్లీ ఆ అమ్మాయిని చూడొచ్చు కదా అని. కానీ, నాకు ఆ అమ్మాయి క్లాస్ ఏంటి, పేరేంటి అని ఎలాంటి వివరాలు తెలియవు. మొత్తానికి తరువాతి రోజు కొత్త స్కూలుకి వెళ్లాను. నన్ను మా మేడం క్లాస్‌కు పరిచయం చేసి, వెళ్లి అక్కడ కూర్చో అని ప్లేస్ చూపించింది. వెళ్లి కూర్చున్నాను. పక్కన చూస్తే అదే అమ్మాయి. వావ్ అనుకున్నా. దేవుడా! నువ్వు ఉన్నావు అనుకుని చాలా ఆనందపడ్డ మనసులో.

ఆ రోజు మొత్తం అలా ఆ అమ్మాయినే చూస్తుండిపోయా. అలా అలా టెన్త్‌ క్లాస్ కూడా అయిపొయింది, ఈ నాలుగేళ్లు అమ్మాయితో బాగానే మాట్లాడేవాడిని కానీ, ఎప్పుడూ దైర్యం చేసి ‘నువ్వంటే ఇష్టం, పేమిస్తున్నాను’ అని చెప్పలేకపోయాను. అప్పట్లో నేను చాలా భయస్తుడిని అందుకే చెప్పలేకపోయా. ఇంటర్‌కు వచ్చాము! తాను వేరే కాలేజీ, నేను వేరే కాలేజీ. రెండేళ్లు మళ్లీ మాట్లాడటానికి కుదరలేదు. సరిగ్గా ఇంటర్ అయిపోయాక ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి హైదరాబాద్ బయలుదేరాను. బస్సులో వెళ్లడానికి బస్టాపుకి వెళ్లాను. అక్కడ తను కనిపించింది. తను కూడా ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి హైదరాబాద్ వెళుతోంది.

ఇద్దరం ఒకే బస్సులో వెళ్లాము. రెండేళ్ల తరువాత మాట్లాడాను. మళ్లీ కాంటాక్ట్ నెంబర్‌ తీసుకోకుండానే మిస్ అయిపోయాను. తను గ్రాడ్యుయేషన్‌కు వేరే కాలేజీ, నేను వేరే కాలేజీ. ఆర్కుట్ రోజులు అవి. ఆర్కుట్లో తన కాంటాక్ట్ దొరికింది. ఇంకా అప్పుడప్పుడే ఎఫ్‌బీ వాడుతున్న రోజులు అవి. ఆర్కుట్లో, ఎఫ్‌బీలో చాట్ బాగానే చేసేవాడిని. కానీ, అప్పుడు కూడా దైర్యం చేసి చెప్పలేకపోయా. మొత్తానికి గ్రాడ్యుయేట్ అయిపోయింది. తను మాస్టర్స్ చదవడానికి ఫారిన్ వెళ్లింది. తన చదువు అయిపోయింది, పెళ్ళి కూడా అయిపోయింది. నేను కూడా ఇప్పుడు ఫారిన్లో జాబ్ చేస్తున్నా. ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఇప్పటికీ ప్రతిరోజూ బాధపడుతుంటా ఈ పదహారేళ్లలో ఒకసారైనా దైర్యం చేసి చెప్పి ఉండాల్సింది ‘నువ్వంటే నాకిష్టం’ అని.
- టింకు, భువనగిరి


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

మరిన్ని వార్తలు