అప్పుడు మోసం చేసా.. ఇప్పుడు అనుభవిస్తున్నా

28 Nov, 2019 14:42 IST|Sakshi

నా పేరు వరుణ్‌. నా ప్రాణ స్నేహితుడు సత్యనారాయణ. చిన్నపుడు నుంచి వాడే నాకు అన్నీ.  ఎమ్మెస్సీ మొదటి సంవత్సరం సరదా సరదాగా గడిచింది.  మా కాలేజీ ఫంక‌్షన్‌లో చూశా తనని. తను మా జూనియరే. తొలిచూపులోనే ఇష్టపడ్డా. తన పేరు ఫాతిమా. చాలా మంచి అమ్మాయి. తను నవ్వుతుంటే నన్ను నేనే మర్చిపోయేవాడిని. క్రమంగా మా స్నేహం కాస్తా ప్రేమగా మారింది. నేను ప్రపోజ్ చేయటం, ఆమె ఒప్పుకోవటం చకచకా గడిచిపోయింది. ఫైనల్‌ ఇయర్‌ అయ్యాక ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న నాకు హఠాట్టుగా ఫాతిమా నుంచి ఫోన్ వచ్చింది. తనకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని చెప్పి చాలా బాధపడింది.  

ఏం చేయాలో తెలియలేదు. చేతిలో జాబ్‌ లేదు. నా ఫ్రెండ్‌ సత్యనారాయణ అప్పడే ఉద్యోగంలో స్థిరపడ్డాడు. నాక్కూడా ఏదైనా జాబ్‌ చూడమని చెప్పి తనను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అలాగే ఒక మధ్య తరగతి యువకుడిగా, నిరుద్యోగిగా ఫాతిమా వాళ్ళ ఇంటికి వెళ్లి మా పెళ్లి గురించి మాట్లాడి వాళ్ళ అమ్మానాన్నని అడిగే అర్హత లేదు. పారిపోయి పెళ్లి చేసుకొనే ధైర్యం లేదు. ఆలా చేసి అందర్నీ బాధ పెట్టడం ఇష్టం లేదు. ఒక సినిమాలో చెప్పినట్లుగా ప్రేమించే సమయంలో డబ్బులుండవు, డబ్బులున్నపుడు ప్రేమ దొరకదు. బాగా అలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. 

ఫాతిమాకి అన్నీ వివరించి విడిపోయాను. నిజం చెప్పాలంటే ఓడిపోయాను. కొన్ని సంవత్సరాలు అయ్యాక స్నేహితుని సహాయంతో జాబ్ సంపాదించాను. ప్రస్తుతం ఆర్ధికంగా నిలబడ్డాను. అమ్మనాన్నల్ని హైదరాబాద్ తెచ్చుకున్నాను. అక్క పెళ్లి కూడా బాగా చేశాను. కానీ నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఎక్కడో తనని మోసం చేసానని బాధగా ఉంది. ఎంతైనా తోలి ప్రేమ మధురమైనది. దానిని ఎప్పుడూ మరువలేము. ఇప్పుడు నా దగ్గర అన్ని ఉన్నా తను లేని బాధ ఆలానే ఉంది. అది తీరేది కాదని నాకు తెలుసు. కానీ నా స్నేహితుడు ఇచ్చిన నమ్మకం, ధైర్యమే ఇప్పుడు నన్ను నడిపిస్తుంది.

- వరుణ్‌

మరిన్ని వార్తలు