కాలేజ్‌ బ్రేకప్‌ నేర్పేదేమిటి?

9 Dec, 2019 11:44 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఇష్టపడ్డవారితో బ్రేకప్‌ చేసుకోవటం మాటల్లో చెప్పినంత తేలికైన పనికాదు. అదీ ముఖ్యంగా కాలేజీ రోజుల్లో అయితే మరీ కష్టం. బ్రేకప్‌ తర్వాత రోజులు ఎంత స్తబ్దుగా.. బాధతో గడపాల్సివస్తుందో వర్ణనాతీతం. బంధానికి వీడ్కోలు పలకడం అంటే ప్రేమకు దూరమవుతున్నట్లు కాదు. ఓ కొత్త బంధానికి తలుపులు తెరుస్తున్నట్లు. కాలేజీ టైంలో అయిన బ్రేకప్‌ మనకు ఎన్నో విషయాలను నేర్పిస్తుంది. కొత్త అనుభవాలను రుచిచూపిస్తుంది. ఇక గతం తాలూకూ అనుభవాలతో భవిష్యత్తుకు బాటలు వేసుకోవటమే మన జీవితం.

కాలేజ్‌ బ్రేకప్‌ మనకు ఏం నేర్పిస్తుంది..

1)  ఎదుటి వ్యక్తి భావాలను ప్రభావితం చేయలేం
మనం ప్రాణంగా ప్రేమించినంత మాత్రాన ఎదుటి వ్యక్తి మనల్ని ప్రేమించాలన్న రూలేమీ లేదు. మనపై ఫీలింగ్స్‌లేని వారిని ప్రేమించమని బలవంతపెట్టడం కూడా దండగే. ఎదుటి వ్యక్తి శ్రద్ధను తమపైకి మరల్చుకోవటానికి నానాతంటాలు పడేవారు లేకపోలేదు. మన చేష్టలు ఎదుటి వ్యక్తి భావాలను ఏవిధంగానూ ప్రభావితం చేయలేవని గుర్తించాలి. సంతోషాన్ని ఎదుటి వ్యక్తి ప్రేమలో కాకుండా మనలో వెతుక్కోవటం ఉత్తమం.

2) చదువులు అటకెక్కుతాయి
ఓ వయసుకు.. ముఖ్యంగా కాలేజీ వయసు​కు రాగానే ప్రేమలో పడటం మామూలే. ప్రేమ రెండు మనసులకు సంబంధించింది కాబట్టి దానితో ఎన్నో భావోద్వేగాలు ముడిపడి ఉంటాయి. అందుకే ప్రేమలో ఉ‍న్న చాలా మంది చదువును సక్రమంగా సాగించలేక చతికిలబడిపోతుంటారు. ఎదుటి వ్యక్తులు అర్థం చేసుకునేవారైతే ఇటు బంధం, అటు చదువులు ఎలాంటి గొడవలేకుండా సాగిపోతాయి. అలా కాకపోతే నిత్యం గొడవలు పడుతూ బ్రేకప్‌కు దారితీస్తుంది. 

3) అంగీకారమే తుది 
బంధాని బ్రేక్‌ పడగానే మనలో కొత్త ఆలోచనలు మొదలవుతాయి. తప్పు ఎక్కడ జరిగిందా అన్న ఆలోచనతో సతమతమవుతాము. ఆ సమయంలో మనల్ని మనం దోషులుగా చిత్రీకరించుకోవటమో లేదా ఎదుటి వ్యక్తిని దోషిని చేయటమో జరుగుతుంది. అయినా ఏం లాభం ఉండదని తెలుసు. ఆ జ్ఞాపకాలతో, కొత్తకొత్త భయాలతో రోజులు గడిపేస్తుంటాము. ఇలాంటప్పుడు జరిగింది ఏదో మన మంచి కోసమేనని, జరగబోయేదేదో కూడా మన మంచికేనని అంగీకరించటం ముఖ్యం. 

4) కొత్త ప్రారంభాలు 
బ్రేకప్‌తో మన జీవితమేమీ ఆగిపోదు. మొదట్లో కొద్దిగా కష్టంగా ఉంటుంది. మరో సారి ప్రేమలో పడకూదదు.. ఎవర్నీ నమ్మకూడదురా భగవంతుడా అనుకుంటాము. కాలం బ్రేకప్‌ చేసిన గాయాన్ని మాన్పగానే కొత్త ఆశలు చిగురిస్తాయి. మళ్లీ ప్రేమలో పడతాం. గతాన్ని దృష్టిలో ఉంచుకుని ముందకు సాగుతాం.

5) బంధంలో మనకేం కావాలి!
బ్రేకప్‌ తర్వాత మనలో చాలా మార్పులు వస్తాయి. ఆ మార్పులు గతాన్ని ఓ గుణపాఠంగా మనసులో వల్లెవేసుకుంటాయి. ఇకపై అడుగుపెట్టబోయే బంధంలో మనకేం కావాలో సుత్తిలేకుండా సూటిగా తెలుసుకోగలుగుతాం.

6) కమ్యూనికేషన్‌  
బంధం కలతలులేకుండా సాగిపోవాలంటే కమ్యూనికేషన్‌ అవసరం చాలా ఉంది. చక్కటి కమ్యూనికేషన్‌ కారణంగానే బంధం దృఢంగా ఉంటుంది. మన భావాలను ఎదుటి వ్యక్తితో చక్కగా కమ్యూనికేట్‌ చేస్తూ బంధాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి.


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

మరిన్ని వార్తలు