ప్రేమ ముందా ? పెళ్లి ముందా!?

17 Dec, 2019 10:20 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ : దీనిపై తరాలు మారుతున్న తరగని చర్చ ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రేమించి పెళ్లి చేసుకోవడం గొప్పనా ? పెళ్లి చేసుకొని ప్రేమించడం గొప్పనా? కొందరు మొదటి దానితో ఏకీభవిస్తే మరికొందరు రెండో దానితో ఏకీభవిస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకోవడమే కాదు, పెళ్లి చేసుకున్నాక కూడా ప్రేమించడం గొప్పని ఇంకొందరు వాదిస్తున్నారు. ఈ వాదనల్లో ఏది వాస్తం, ఏది కాదు? అందుకు కారణాలు ఏమిటీ ? ప్రేమించి పెళ్లి చేసుకోవడం గొప్పనే వాదనను తీసుకుంటే...దేశంలో నేటికి ప్రేమించి పెళ్లి చేసుకునేవారి సంఖ్య పది శాతానికి మించలేదు. మిగతా 90 శాతం మంది ‘అరేంజ్డ్‌ లేదా సెమీ అరేంజ్డ్‌ మ్యారేజెస్‌’ చేసుకుంటున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న వారిలో కూడా 90 శాతం మంది పెళ్లి తర్వాత వారి మధ్య ప్రేమ మాయమవుతోంది. కొన్ని జంటలు విడాకులు తీసుకొని విడిపోతున్నాయి కూడా.

ఎందుకు ? ఇక పెళ్లి చేసుకున్నాక ప్రేమించుకోవడం అన్నది చాలా అరదు. పెళ్లయిన కొత్తలో ఒకరి పట్ల ఒకరు ఆకర్షణతో మెలగవచ్చు. వారి మధ్య ప్రేమ అంకురించడం మాత్రం చాలా అరుదు. ఎందుకు ?అరేంజ్డ్‌ మ్యారేజెస్‌ లేదా సెమీ అరేంజ్డ్‌ మ్యారేజెస్‌ పెద్దలు, మిత్రులు, మధ్యవర్తులు కుదిర్చిన పెళ్లిళ్లు అవడం వల్ల యువతీ యువకులు ఒకరికొకరు పెద్దగా తెలియదు. అభిరుచులు భిన్నంగా ఉండవచ్చు. కుటుంబం, సమాజం పట్ల దృక్పథాలు కూడా వేరుగా ఉండొచ్చు. నేరుగా సంసార జీవితంలోకి అడుగు పెట్టాల్సి వస్తోంది. బాధ్యతలను పంచుకోవాల్సి వస్తోంది. ఈ కారణంగా మనస్పర్థలు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఒకే రకమైన మనస్తత్వం కలిగి పరస్పర ప్రేమాభిమానాలతో పెళ్లయ్యాక కలిసి ఉండే జంటలు బహు అరుదుగా కనిపిస్తాయి. పెళ్లికి ముందు ప్రేమలో ప్రేమాభిమానాలకన్నా పరస్పర ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది.

సంసార బరువు, బాధ్యతలు తెలియవు కనుక ఊహా లోకాల్లో ఎక్కువగా విహరిస్తుంటారు. ఒకరి నొకరు ఆకర్షించడం కోసం ‘ఆత్మవంచన’కు ఎక్కువగా పాల్పడతారు. ‘అంటే నీవు ఇలా ఉంటే అందంగా ఉంటావు, ఈ డ్రెస్‌లో ఇంకా అందంగా ఉంటావు’ ముఖ స్తుతి పొగడ్తలతోపాటు పరస్పరం నచ్చని విషయాలను కూడా నచ్చినట్లుగా ప్రవర్తిస్తారు. లేని గొప్పతనాలను ఆపాదించుకుంటారు. శారీరకంగా కాకపోయినా  మానసికంగా ఒకరికొకరు లోబర్చుకునేందుకు ఆత్మవంచనతో ప్రవర్తిస్తారు. ఒక చూరు కింద ఎక్కువ కాలం కలిసి ఉండే అవకాశం ఉండదు కనుక ఇద్దరి మధ్య మొహం మొత్తే అవకాశం కూడా తక్కువ. పెళ్లి తర్వాత వారి మధ్య ‘ప్రాక్టికల్‌’ జీవితం మొదలవుతుంది కనుక ప్రేమించుకున్న నాటి కలలు క్రమంగా కరగి పోతాయి. మనస్పర్ధలు మొదలవుతాయి.

ఎవరిలో ఒకరిలో సర్దుకుపోయే గుణం ఉంటే వారి సంసారాలు ఒడిదుడుకులతోనైనా ముందుకు సాగుతాయి. లేదా విసుగులు, విరామాలతో కలతల కాపురంగా కొనసాగుతాయి. మరీ పరస్పర భిన్న స్వభావులయితే విడాకుల వరకు వెళ్లవచ్చు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని పరిశీలిస్తే ‘ప్రేమించి పెళ్లి చేసుకోవడమే మంచిది’ అనిపించక మానదు. ఎందుకుంటే పెళ్లి చేసుకున్నాక ప్రేమ ఉంటుందో, లేదో గ్యారెంటీ లేదు. కనీసం పెళ్లికి ముందున్న ప్రేమయినా మిగులుతుంది కదా! ఇక్కడ ఏది మంచి అన్న విషయాన్నే చెప్పాం. కానీ వాస్తవానికి ఏది గొప్పన్నది మన ప్రశ్న. పెళ్లి చేసుకున్నాక ప్రేమించడమే గొప్ప. అది బాధ్యతలతో కూడి బాధ్యాయుతమైన ప్రేమవుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకొని ఆ తర్వాత అంతే ప్రేమగా కలసి మెలసి జీవించడం అన్నింటికన్నా గొప్ప. ఇది చాలా అరుదు. అత్మవంచన, అభూత కల్పనలు అసలేలేకుండా వాస్తవ పరిస్థితుల పునాదులపై యువతీ యువకులు ప్రేమించుకున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. 
                                                       –––––ప్రేమ తాత్వికవేత్త

చదవండి : ఆ యాప్‌ ద్వారా రెండు కోట్ల పెళ్లిళ్లు జరిగాయి!


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

మరిన్ని వార్తలు