అందంగా లేనా...అసలేంబాలేనా!

3 Mar, 2018 08:18 IST|Sakshi

కాస్మొటిక్‌ సర్జరీలపై యువతలో పెరుగుతున్న మోజు

దేశంలో నాలుగో స్థానంలో హైదరాబాద్‌

ముక్కు, నడుము, ఛాతి, సొట్టబుగ్గల సర్జరీలపై అమ్మాయిల ఆసక్తి

మ్యాన్‌బూబ్స్, ముక్కు, బట్టతల,పొట్టను సరి చేసుకుంటున్న అబ్బాయిలు

ఇంటర్నేషనల్‌ సంస్థ సర్వేలో వెల్లడి

హైదరాబాద్‌ నగరం చారిత్రక కట్టడాలకే కాదు...‘అందమైన’ సర్జరీలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఒకప్పుడు సినీతారలు, ధనవంతుల పిల్లలు మాత్రమే చేయించుకున్న కాస్మొటిక్‌ సర్జరీలకు ఇటీవల మధ్య తరగతి యువతీ యువకులు ఆసక్తి చూపిస్తుండటమే ఇందుకు కారణం. ‘ఇంటర్నేషనల్‌ సొసైటీ ఆఫ్‌ ఈస్థటిక్‌ ప్లాస్టిక్‌ సర్జరీ’ సర్వే ప్రకారం కాస్మొటిక్‌ సర్జరీల్లో ప్రపంచంలో మన దేశం ఏడో స్థానంలో ఉంది. దేశంలో ముంబై మొదటి స్థానంలో ఉండగా, బెంగళూరు ద్వితీయ, ఢిల్లీ తృతీయ, హైదరాబాద్‌ నాలుగో స్థానంలో నిలిచింది. ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ సర్జరీ ఖర్చులు మూడు నుంచి ఐదు శాతం తక్కువగా ఉండటం, అన్నిరంగాల నిపుణులు, వైద్యులు ఎక్కువ మంది ఉండటంతో విదేశీయులు సైతం అందమైన చికిత్సల కోసం భాగ్యనగరానికే వస్తున్నారు. ఇక ముక్కు, నడుము, ఛాతి, సొట్టబుగ్గల సర్జరీలపై అమ్మాయిలు ఆసక్తి చూపుతుండగా..ముక్కు, బట్టతల, పొట్టను సరి చేసుకునేందుకు అబ్బాయిలు కాస్మొటిక్‌ సర్జరీల బాటపడుతున్నారు.

సాక్షి, సిటీబ్యూరో: అందం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మన శరీరంలో కళ్లు, ముక్కు, పెదాలు, సొట్ట బుగ్గలు, ఛాతి, నడుము కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలో ఏ ఒక్కటి సరిగా లేకున్నా మనసుకు బాధ..సొసైటీలో సరిగా మసలలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో కాస్మొటిక్‌ సర్జరీలకు ఆదరణ పెరుగుతోంది. శరీరంలోని లోపాలను సరిదిద్దుకునేందుకు మధ్యతరగతి సైతం ఆసక్తి చూపుతోంది. ఒకప్పుడు సెలబ్రిటీలకు మాత్రమే పరిచయం ఉన్న ఈ కాస్మొటిక్‌ సర్జరీలు నేడు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఇంటర్నేషనల్‌ సొసైటీ ఆఫ్‌ ఈస్థటిక్‌ ప్లాసిక్ట్‌ సర్జరీ సర్వే ప్రకారం కాస్మొటిక్‌ సర్జరీల్లో మన దేశానిది ఏడో స్థానం. అమెరికా, బ్రెజిల్, జపాన్, ఇటలీ, మెక్సికో, రష్యా వరుస స్థానాల్లో ఉన్నాయి. 50 శాతం సర్జరీలు ఈ దేశాల్లోనే జరుగుతున్నాయి.

మనదేశంలో 3.7 శాతం సర్జరీలు జరుగుతున్నాయి. కాస్మొటిక్‌ సర్జరీల విషయంలో ముంబై మొదటి స్థానంలో ఉండగా, బెంగళూరు, ఢిల్లీ, తర్వాత హైదరాబాద్‌ నాలుగో స్థానంలో నిలిచింది. గైనకోమాస్టియా(మ్యాన్‌బూబ్స్‌), రైనో ప్లాస్టీ(కొటేరు ముక్కు), లైపోసక్షన్‌ (కొవ్వు తొలగింపు), హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ (బట్టతలపై జుట్టు మొలిపించడం) వంటి సర్జరీలను పురుషులు ఎక్కువగా చేయించుకుంటుంటే, బ్రెస్ట్‌ అగ్మెంటేషన్, లైపోసక్షన్‌(నడుము, పొట్ట భాగంలో పేరుకు పోయిన కొవ్వు తొలగింపు చికిత్స ), ఐలైడ్‌ (కనురెప్పలు సరిచేసుకోవడం) రైనోప్లాస్టి(వంకర తిరిగిన, లావుగా ఉన్న ముక్కును కొటేరుగా తయారు చేయడం, సొట్టబుగ్గల సర్జరీలతో పాటు హెయిర్‌ రిమూవల్‌ ప్రొసీజర్లు అధికంగా మహిళలు చేయించుకుంటున్నారు. 

ఐటీ సంస్థల రాకతో పెరిగిన ఆదాయం
ఐటీ సంస్థల రాకతో నగరంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. యువతీ యువకుల ఆదాయం బాగా పెరిగింది. ముఖ్యంగా 35 ఏళ్ల లోపు అమ్మాయిలు, అబ్బాలు వయసు బయటికి కన్పించకుండా ఉండేందుకు శతవిధాలుగా ప్రయతిస్తున్నారు. కాస్మొటిక్‌ సర్జరీలు, ప్రొసిజర్లు భారీ ఖర్చుతో కూడినప్పటికీ..వారు చికిత్సలకు వెనుకాడటం లేదు.  అందానికే ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఏ చికిత్సకు ఎంత ఖర్చు?  
రైనోప్లాస్టీ సర్జరీకి సగటున రూ.50 వేల నుంచి 80 వేల వరకు ఖర్చు అవుతుండగా, లైపోసక్షన్‌కు రూ.2 లక్షల నుంచి మూడు లక్షల వరకు వసూలు చేస్తున్నారు. డింపుల్స్‌ క్రియేషన్స్‌కు రూ.20 వేల నుంచి 40 వేల వరకు వసూలు చేస్తున్నారు. హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు రూ.50 వేల నుంచి 1.50 లక్షలు వసూలు చేస్తుండగా, చీక్‌ అగ్మంటేషన్‌(ఆకట్టుకునే ముఖాకృతి)కి రూ.50 వేల నుంచి లక్ష వరకు, గైనకోమాస్టియాకు రూ.45 వేల నుంచి 60 వేలు ఖర్చు అవుతుంది. చెవి కమ్మల రంద్రాలు పెద్దగా ఉంటే వాటిని సరి చేసే చికిత్సకు రూ.10వేలు ఖర్చు అవుతుండగా, బైఫరోప్లాస్టీ(నాజుకైన కంటిరెప్పలు)కి రూ.15 వేల నుంచి 20 వేల వరకు వసూలు చేస్తున్నారు.

ఎదుటివారి దృష్టిని ఆకర్షించేందుకే...
నాజూకైన శరీర ఆకృతి, కొటేరులాంటి ముక్కు, పెదాలు, సొట్టబుగ్గలు, కనుబొమ్మలు, తలపై జుట్టు మనిషి అందాన్ని నిర్ణయిస్తాయి. పెళ్లికి ముందు యువతీ యువకులు ఒకరినొకరు ఆకర్షించుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తుంటారు. ఇందుకోసం కాస్మొటిక్‌ సర్జరీలు చేయించుకుంటున్నారు. చికిత్సలకు వచ్చేవారిలో 60 శాతం అమ్మాయిలు ఉంటే, 50 శాతం అబ్బాయిలు ఉంటున్నారు.  
– డాక్టర్‌ సుధాకర్‌ ప్రసాద్,ప్లాస్టిక్‌ అండ్‌ కాస్మొటిక్‌ సర్జన్, అపోలో ఆస్పత్రి

బరువు తగ్గడం కోసం...
శరీరంలో ఉండాల్సిన బరువు కన్నా 20 శాతం ఎక్కువ ఉంటే ‘అధిక బరువుగా’భావిస్తారు. ఇది ఒక జబ్బు కాక పోవచ్చు కానీ, అనేక ఇతర జబ్బులకు కారణం అవుతోంది. మధ్యతరగతి మగవాళ్లలో మూడో వంతు, ఆడవాళ్లలో సగానికిపైగా అధిక బరువుతో బాధ పడుతున్నట్లు ఓ అంచనా. శరీరంలో పేరుక పోయిన కొవ్వును ‘లైపోసక్షన్, బెరియాట్రిక్‌’ పద్ధతుల్లో తొలగిస్తారు. సినీ తారలు ఎక్కువగా లైపోసక్షన్‌ను ఆశ్రయిస్తుంటే...మధ్య తరగతి వాళ్లు ల్యాప్రోస్కోపిక్‌ సహాయంతో చేసే బెరియాట్రిక్‌ సర్జరీలను ఆశ్రయిస్తున్నారు.  – డాక్టర్‌ లక్ష్మీ, బెరియాట్రిక్‌ సర్జన్, గ్లోబల్‌ ఆస్పత్రి

35 ఏళ్లలోపు వారే అధికం..
పెరుగుతున్న వాతావరణ కాలుష్యానికి తోడు తలకు రకరకాల షాంపూలు వాడటం వల్ల పాతికేళ్లకే తలపై జుట్టంతా ఊడిపోతోంది. పెళ్లికి ముందే జుట్టంతా ఊడిపోతుండటంతో అమ్మాయిలు వీరిని పెళ్లిచూపుల్లో నిరాకరిస్తున్నారు. దీంతో చాలా మంది అబ్బాయిలు పెళ్లికి ముందే హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ సర్జరీలు చేయించుకుంటున్నారు. సర్జరీలు చేయించుకుంటున్న బాధితుల్లో 90 శాతం మంది 25 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులే ఉంటున్నారు.– డాక్టర్‌ వెంకటరమణ,హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ సర్జన్‌

140 కేజీల నుంచి 78 కేజీలకు తగ్గాను  
ఉన్నట్టుండి శరీరం బరువు భారీగా పెరిగింది. చాలా ఆందోళనకు గురయ్యాను. సొంతపనులు కూడా చేసుకోలేని దుస్థితి. నాలుగేళ్లక్రితం గ్లోబల్‌ ఆస్పత్రిలో బెరియాట్రిక్‌ సర్జరీ చేయించుకున్నా. 140 కేజీల నుంచి 78 కేజీలకు తగ్గాను. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాను.  – పెసల శ్రీకాంత్,వ్యాపారి, నంద్యాల

మరిన్ని వార్తలు