ముద్ర వేస్తేనే ముద్ద! 

6 Jan, 2018 11:05 IST|Sakshi

 ఎరువు కావాలంటే 

ఆధార్‌ కార్డు తీసుకువెళ్లాల్సిందే.. 

జిల్లాలో వ్యాపారులకు 173 పీఓఎస్‌ యంత్రాలు 

పంపిణీని సమీక్షిస్తున్న అధికారులు 

సబ్సిడీ పక్కదారి పట్టకుండా   ఎప్పటికప్పుడు సమీక్ష 

ప్రస్తుతం నగదు ద్వారా అమ్మకాలు.. 

త్వరలోనే కార్డులు ఉపయోగించేలా  యంత్రాల్లో మార్పు 

సాక్షి, మహబూబ్‌నగర్‌: పంటల సాగుతో రైతులకు అవసరమయ్యే రసాయన ఎరువుల విషయంలో పక్కదారి పట్టకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు చేపడుతున్నాయి. అయినా తరచుగా అక్రమాలు బయటపడుతున్నట్లు ప్రభుత్వాలు గుర్తించాయి. గతంలో పలు సీజన్లలో కొందరు వ్యాపారులు ఎరువులను మిక్సింగ్‌ ప్లాంట్లకు అమ్ముకోవడంతో కృత్రిమ కొరతను ఏర్పడడమే కాకుండా రాయితీ ఎరువులు పక్కదారి పట్టాయి. ఈమేరకు ఈనెల 1నుంచి బయోమెట్రిక్‌ విధానాన్ని అమలులోకి తె చ్చాయి. రైతు ఆధార్‌ కార్డుతో వస్తే నంబ ర్‌ నమోదు చేశాక, వేలిముద్రతో సరిచూసుకున్నాకే ఎరువులు అందజేసే విధానం ప్రస్తుతం జిల్లాలో ప్రారంభమైంది. ఈ విధానం ద్వారా ఎరువులపై కేంద్రప్రభు త్వం ఇచ్చే సబ్సిడీ దుర్వినియోగం కాకుం డా ఉంటుందన్నది ప్రభుత్వ ఆలోచన.  

జిల్లాలో 192 దుకాణాలు 
జిల్లావ్యాప్తంగా ఎరువులు, పురుగు మందులు అమ్మే ప్రైవేట్‌ ఫర్టిలైజర్‌ షాపులు 192 ఉన్నాయి. ఆయా షాపుల యజమాన్యాలకు నూతన విధానాన్ని అమలు చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో ఆధార్‌ నంబర్, వేలిముద్రల నమోదుకు అవసరమైన పీఓఎస్‌(పాయింట్‌ ఆఫ్‌ సేల్‌) యంత్రాలను 173 షాపులకు వ్యవసాయ శాఖ పంపిణీ చేసింది. అలాగే, ఈ విధానంలో ఎరువుల విక్రయాలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సాంకేతిక సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

కట్టు తప్పితే లైసెన్స్‌ రద్దు 
బయోమెట్రిక్‌ విధానాన్ని పాటించకుండా ఏ వ్యాపారి కూడా ఎరువులను విక్రయించొద్దని అధికారులు ఆదేశించారు. ఒకవేళ ఎవరైనా అలా చేస్తే లైసెన్సు రద్దు చేయమని కలెక్టర్‌ రొనాల్డ్‌రాస్‌ ఇటీవల జరిగిన సమీక్షలో వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం వ్యాపారులకు అందజేసిన ఈ–పోస్‌ యంత్రాల్లో ఆధార్‌ నంబర్‌ నమోదు చేయడంతో పాటు రైతు వేలిముద్ర వేశాక సరిపోలితేనే వారికి కావాల్సిన ఎరువులు అందజేస్తారు. దీనికోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో కూడిన యంత్రాలను అందజేశారు. ప్రస్తుతానికి రైతులు నగదు ద్వారానే కొనేలా పీఓఎస్‌ యంత్రాల సాప్ట్‌వేర్‌ ఉందని.. త్వరలోనే డెబిట్, క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనేందుకు యంత్రాల్లో మార్పులు చేస్తారని డీఏఓ సుచరిత ‘సాక్షి’కి తెలిపారు. 

ఈ సీజన్‌కు 30 వేల మెట్రిక్‌ టన్నులు 
జిల్లాలో వర్షాకాలం చివర్లో భారీగా వర్షా లు కురవడంతో చెరువులు, కుంటల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో భూగ ర్భ జలాల మట్టం పెరగడంతో బోరుబావుల్లోనూ నీరు లభ్యత ఉంది. అలాగే ప్రభుత్వం వ్యవసాయ రంగానికి 24గంట ల పాటు విద్యుత్‌ను సరఫరా చేస్తుండడం తో ఈసారి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత యాసంగి సీజన్‌లో వరి 30 వేల హెక్టార్లు, వేరుశనగ 30వేల హె క్టార్ల విస్లీర్ణం సాగయ్యే అవకాశం ఉన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. అందుకు అనుగుణంగా 30 వేల మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమవుతాయని భావించి అందుబాటులో ఉంచారు.  

ఆధార్‌ కార్డు ఉంటేనే ఎరువులు 
రైతులకు ఎరువులు కొనాలంటే దుకాణానికి అధార్‌కార్డును తప్పనిసరిగా తీసుకువెళ్లాలి. ఈ విధానంలో రైతులకు ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడితే మండల వ్యవసాయధికారి లేదా విస్తరణ అధికారులను సంప్రదించాలి. బయోమెట్రిక్‌ ద్వారా విజయవంతంగా రైతులకు ఎరువులను అమ్మేలా చర్యలు తీసుకోవడమే కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ఎక్కడైనా సాంకేతిక సమస్య ఎదురైతే వెంటనే అధిగమించేలా చర్యలు తీసుకుంటున్నాం. అదే విధంగా వ్యాపారులు రైతులను ఇబ్బందులకు గురిచేసినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. 
                                                                                                                                                                             – సుచరిత, జిల్లా వ్యవసాయ అధికారి 

మరిన్ని వార్తలు