నిధుల వరద

24 Jan, 2018 17:15 IST|Sakshi

పీహెచ్‌సీలకు రూ.1.75కోట్ల మంజూరు

క్వాలిటీ అస్యూరెన్స్‌ ప్రమాణాలు  పెంచేందుకే..

అయిజ పట్టణంలో 30పడకల ఏర్పాటు

మూడు నెలల నుంచే చర్యలు షురూ

గద్వాల న్యూటౌన్‌ : ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేసే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. అన్ని వసతులు ఉండి, ఉన్నతమైన ప్రమాణాలు పాటిస్తూ.. పరిసరాలు అత్యంత పరిశుభ్రంగా ఉంచుకునే ఆస్పత్రులకు క్వాలిటీ అస్యూరెన్స్‌ అక్రిడేషన్‌ (ఉత్తమమైందిగా గుర్తింపు) తోపాటు కాయ కల్ప పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఈ ఆస్పత్రులకు ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. దీనిని జిల్లాలోని అన్ని ఆస్పత్రులకు దశలవారీగా సాధించేందుకు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు మూడు నెలల క్రితం నుంచి కసరత్తు ప్రారంభించారు. అధికారుల కృషి కొంతమేర సఫలమైంది. క్వాలిటీ అస్యూరెన్స్‌ సాధించడంలో భాగంగా పీహెచ్‌సీల్లో వసతుల కల్పనకు అవసరమైన నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.

దీంతో వాటి అభివృద్ధికిగాను తాజాగా రూ.1,75,76,000 మంజూరు చేసింది. జాతీయ క్వాలిటీ అస్యూరెన్స్‌ అక్రిడేషన్‌ కలెక్టర్‌ చైర్మన్‌గా డీఎంహెచ్‌ఓ, కోకన్వీనర్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ సభ్యుడిగా జాతీయ క్వాలిటీ అస్యూరెన్స్‌ కమిటీ ఉంటుంది. వీరితోపాటు జిల్లా క్వాలిటీ అస్యూరెన్స్‌ మేనేజర్‌ ఉంటారు. ఈయన పీహెచ్‌సీల్లో అన్ని విషయాలు అధ్యయనం చేసి ప్రమాణాలు పెంచేందుకుగాను అవసరమైన ప్రణాళికను రూపొందిస్తారు. దీనికి అనుగుణంంగా కమిటీ చర్యలు తీసుకుంటుంది. పీహెచ్‌సీల్లో ప్రమాణాలు పెంచిన అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారు. రాష్ట్రస్థాయి బృందం ఈ ఆస్పత్రులను పరిశీలిస్తుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీసం 70శాతం ఉన్నతమైన ప్రమాణాలు ఉండటంతోపాటు స్వచ్ఛతలో 80శాతం స్కోర్‌ చేయగలిగితే...æ బృందం సభ్యులు (గుర్తింపు) అక్రిడేషన్‌ కార్డు జారీ చేస్తారు. ఇది పొందిన పీహెచ్‌సీలకు ఏడాదికి రూ.మూడు లక్షలు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అందించడమేగాక అదనంగా ఒక్కో పడకకు రూ.పది వేలు చొప్పున ఇస్తుంది.

ప్రమాణాలు ఇలా ఉండాలి
ప్రభుత్వ ఆస్పత్రికి రాకపోకలు సాగించే రోడ్డుమార్గం సరిగ్గా ఉండి, అంబులెన్స్‌ రావడానికి, వెళ్లడానికి ఇబ్బందులు లేకుండా మార్గం ఉండాలి. భవనం చుట్టూ విద్యుద్దీపాలు, ప్రహరీ ఉండాలి. ఆస్పత్రికి బోర్డుతోపాటు లోపల వివిధ విభాగాలకు సూచికల బోర్డులుండాలి. పీహెచ్‌సీ స్థాయికి కావాల్సిన వైద్య పరికరాలు, నీటి వసతి ఉండాలి. వైద్యులు, ఇతర సిబ్బంది చచ్చితంగా డ్రెస్‌కోడ్‌ పాటిస్తూ ఐడీలు ధరించాలి. వైద్యులు, ఇతర సిబ్బంది అన్ని ఆరోగ్య కార్యక్రమాలపై శిక్షణ పొంది ఉండాలి. తగినన్ని మూత్రశాలలు, మరుగుదొడ్లు ఉండాలి. పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండటంతోపాటు బయోమెడికల్‌ వేస్టేజీని వేయడానికి కంపోస్ట్‌ పిట్‌ ఉండాలి. ఇలా అన్నీ ఉంటే అక్రిడేషన్‌ జారీ చేస్తారు.

3నెలల నుంచి చర్యలు
క్వాలిటీ అస్యూరెన్స్‌ కమిటీ సూచన మేరకు జిల్లా క్వాలిటీ మేనేజర్‌ వంశీ తొమ్మిది పీహెచ్‌సీలను పరిశీలించారు. కేసీఆర్‌ కిట్‌ అమలైన నాటి నుంచి అయిజ పీహెచ్‌సీలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో ప్రస్తుతమున్న భవనం ఏ మాత్రం సరిపోవడంలేదని 30పడకలకు సరిపడేలా భవనం విస్తరించాలని గుర్తించారు. ఇంకా ప్రహరీలు, కంపోస్ట్‌ పిట్‌ లేని వాటిని, తగినన్ని మూత్రశాలలు, మరుగుదొడ్లు లేని వాటిని, వైద్య పరికరాలు ఎక్కడెక్కడ అవసరమో ఇలా విభాగాల వారీగా గుర్తించారు. వీటి ఆధారంగా ఆయా పీహెచ్‌సీల్లో ప్రమాణాలు పెంచేందుకుగాను అవసతరమైన వసతుల కల్పనకు ప్రణాళికను రూపొందించారు. అన్ని పీహెచ్‌సీలకు స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్, పాలసీలతో కూడిన వివరాలను అందించారు. వసతుల కల్పనకు రూపొందించిన నివేదికను ఈపాటికే కలెక్టర్‌ రజత్‌కుమార్‌సైనికి అందించారు. ఆయన అనుమతితో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి తగిన ప్రతిపాదనలు పంపించగా ఈ నిధులను మంజూరు చేసింది. 

>
మరిన్ని వార్తలు