కోస్గిలో బస్‌ డిపో

17 Jan, 2018 09:42 IST|Sakshi

నేడు జారీకానున్న ఉత్తర్వులు

గతంలో 5 ఎకరాల భూమి కొనిచ్చిన ఎమ్మెల్యే రేవంత్‌  

నియోజకవర్గానికి సీఎం వరాల జల్లు

దౌల్తాబాద్, బొంరాస్‌పేటకు జూనియర్‌ కాలేజీలు  మంజూరు

కోస్గిలో సర్కిల్, ఫైర్‌స్టేషన్ల ఏర్పాటుకు హామీ

సాక్షి, ప్రతినిధి, మహబూబ్‌నగర్‌ : కొడంగల్‌ నియోజకవర్గ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఆశగా ఎదురు చూస్తున్న కోస్గి బస్‌డిపో విషయంలో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. దాదాపు ఆరేళ్లుగా ఊరిస్తున్న బస్‌డిపో అంశంపై ప్రభుత్వం ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. స్వయంగా సీఎం కేసీఆర్‌ బస్‌ డిపోకు పచ్చజెండా ఊపినట్లు సమాచారం. మంగళవారం సీఎం కేసీఆర్‌ను కొడంగల్‌ నియోజకవర్గానికి చెందిన ముఖ్యనేతలతోపాటు మాజీ ఎమ్మెల్యే గురున్నాథ్‌రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి తదితరులు కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన పలు అంశాలను ప్రస్తావించారు. అందులో భాగంగానే సీఎం కోస్గి పోలీస్‌ సర్కిల్, ఫైర్‌స్టేషన్, దౌల్తాబాద్, బొంరాస్‌పేటలకు జూనియర్‌ కాలేజీల ఏర్పాటుకు అంగీకారం తెలిపారని తెలిసింది. వాటికి సంబంధించిన ఉత్తర్వులు బుధవారం వెలువడనున్నట్లు సమాచారం.

కొన్నేళ్లుగా ఎదురుచూపు
కోస్గి బస్‌డిపో కోసం నియోజకవర్గ ప్రజలు కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్నారు. గత ఆరేళ్లుగా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒక విధంగా ప్రస్తుతం కూడా బస్‌డిపో చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయి. వాస్తవానికి కొడంగల్‌ నియోజకవర్గానికి కేంద్ర బిందువైన కోస్గిలో బస్‌డిపో ఏర్పాటు చేయాలనేది ఎంతో కాలంగా డిమాండ్‌ వినిపిస్తోంది. ప్రజల్లో ఉన్న డిమాండ్‌ మేరకు ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్‌రెడ్డి ఈ విషయాన్ని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. 2012లో ఉమ్మడి రాష్ట్రంలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ నిధుల నుంచి రూ.కోటి నిధులు కూడా మంజూరు చేయించారు. అలాగే ప్రభుత్వ స్థలం అందుబాటులో లేక 2013లో 5ఎకరాల స్థలాన్ని కొని ప్రభుత్వానికి అందజేశారు. అందుకు అనుగుణంగా అప్పట్లో ఆర్టీసీ చైర్మన్‌గా ఉన్న ఎం.సత్యనారాయణ శిలాఫలకం కూడా వేశారు. తదనంతర పరిణామాలలో బస్‌డిపో విషయం మరుగున పడిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కూడా ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి పలుమార్లు అసెంబ్లీతో పాటు పలు బహిరంగ వేధికల మీద ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావించారు.  

అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం..
కొడంగల్‌ నియోజకవర్గంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో భారీగా అభివృద్ధి కార్యక్రమాలు జరగనున్నాయి. ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి టీడీపీ నుంచి వీడి కాంగ్రెస్‌లో చేరిన నాటి నుంచి నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. ప్రభుత్వ పెద్దలు నియోజకవర్గంపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టడంతో ఎన్నడూలేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు వడివడిగా జరుగుతున్నాయి. అంతేకాదు తరచూ మంత్రులు పర్యటిస్తూ ప్రజల నుంచి వచ్చే డిమాండ్లకు ఎప్పటికప్పుడు పచ్చజెండా ఊపుతున్నారు. కేవలం 3నెలల వ్యవధిలో రూ.కోట్లాది విలువ చేసే అభివృద్ధి పనులను చేపట్టారు. అలాగే ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచని వాటికి కూడా మోక్షం లభిస్తోంది. దీంతో తాజాగా రెండు వర్గాలు కూడా ఆ క్రెడిట్‌ తమ వల్లే అంటూ ఒకరికొకరు ఆదిపత్యం ప్రదర్శిస్తున్నారు.

మరిన్ని వార్తలు