ఎదురుచూపులు ఎన్నాళ్లు..!

9 Feb, 2018 15:05 IST|Sakshi
రాయపల్లిలో పింఛన్ల కోసం వేచిచూస్తున్న వృద్ధులు

మూడు నెలలుగా అందని ఆసరా పింఛన్లు 

బయోమెట్రిక్‌ మిషన్లకు అందని సిగ్నల్స్‌

ఉమ్మడి మండలంలో 7,464 మంది లబ్ధిదారుల ఇక్కట్లు

రాజాపూర్‌ : రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ప్రతినెలా అందించే ఆసరా పింఛన్లు మండలంలోని కొన్ని గ్రామాల్లో మూడు నెలలుగా అందడంలేదు. బయోమెట్రిక్‌ విధానంలో కొన్ని సాంకేతిక లోపాలు, మిషన్లకు సరిగ్గా సిగ్నల్స్‌ అందక లబ్ధిదారులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుంది.  పింఛన్‌ వస్తుందన్న నమ్మకంతో తెలిసిన వారితో అప్పు సప్పు చేసి కాలం నెట్టుకొస్తుండగా.. నెలల తరబడి పింఛన్‌ అందకపోవడంతో లబ్ధిదారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

 పింఛన్లు అందక ఆందోళన 
ఆసరా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1500 అందజేస్తుంది. రాజాపూర్, బాలానగర్‌ ఉమ్మడి మండలాల్లో మొత్తం 7,464 మందికి ఆసరా పింఛన్ల లబ్ధిధారులు ఉన్నారు. అందులో వయోవృద్ధులు 2,459మంది, వితంతువులు3,611 మంది, వికలాంగులు914, గీతా కార్మికులు 118, నేత కార్మికులు111, ఒంటరి మహిళలు, 250 మంది ఉన్నారు. వీరందరికి ప్రతి నెలా ప్రభుత్వం నుంచి రూ.95,48,500 పంపిణీ జరుగుతోంది. కానీ, గత మూడునెలలుగా అధికారుల అలసత్వమో, ప్రభుత్వ నిర్లక్షమోకాని ప్రతి నెల అందాల్సిన ఆసరా పింక్షన్లు మూడునెలలు అయినా అందడంలేదని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 సిగ్నల్స్‌ లేక..
ఇదిలాఉండగా, గతంలో గ్రామాల్లో గ్రామపంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లోనే ఆసరా పింఛన్లు నేరుగా అందజేసేవాళ్లు. అయితే గత కొన్ని నెలలుగా పోస్టాఫీస్‌ల ద్వారా లబ్ధిదారులకు అకౌంట్లు తెరిపించి, ఎలాంటి అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకోకూడదనే ఉద్దేశ్యంతో బయోమెట్రిక్‌ ద్వారా అందజేస్తున్నారు. అయితే, గ్రామాల్లో బయోమెట్రిక్‌ మిషన్లకు సిగ్నల్స్‌ సరిగ్గా అందకపోవడంతో గంటల తరబడి వేచి చూస్తున్నారు.  అన్ని గ్రామాల్లో పోస్టాఫీస్‌లు లేకపోవడంతో ఉన్న ఒక్క పోస్ట్‌మన్‌కు రెండు మూడు గ్రామాల పింఛన్ల పంపిణీ బాధ్యతలు అప్పజెప్పడంతో ఆలస్యమవుతుందని ఆరోపిస్తున్నారు. వరుసగా మూడు నెలలు పింఛన్లు తీసుకోకపోతే లబ్ధిదారుడి పేరు తొలగిస్తారని, మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలో తెలియడంలేదని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మూడు నెలలుగా పింఛన్‌ అందలే.. 
ఆసరా పింఛన్‌ అందక మూడునెలలు అయ్యింది. ప్రతి నెలా పింఛన్‌ వస్తే కాస్త ఆసరాగా ఉండేది. మూడు నెలలుగా ఎ ప్పుడిస్తారో అంటూ ఎదురుచూస్తున్నా ం. గతంలోలాగా మా ఊర్లో పింఛన్లు అందిస్తలేరు. మా ఊళ్లో పోస్టాఫీస్‌ లేదు. కుచ్చర్‌కల్‌ పోయి తెచ్చుకోవాలే.     

– మహ్మద్‌జాఫర్, దివ్యాంగుడు

వీలైనంత త్వరగా పరిష్కరిస్తాం 
మూడు నెలలుగా కొన్ని గ్రామాల్లో ఆసరా పింఛన్లు అందడంలేదని ఇటీవల తెలిసింది. ఆ గ్రామాల్లో నెట్‌వర్క్‌ సమస్య ఉంది.  వీలైన ంత త్వరగా సమస్యను పరిష్కరిస్తాం. లబ్ధిదా రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పింఛన్‌ నుంచి పేర్లు తొలగించం. ఈ నెల పింఛన్‌ అందిస్తాం.

 – ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎంపీడీఓ, రాజాపూర్‌   
 

మరిన్ని వార్తలు