టాయ్‌‘లేట్‌’

11 Jan, 2018 08:18 IST|Sakshi

ప్రజలు ముందుకొచ్చాక ఆగిన మరుగుదొడ్ల నిర్మాణాలు

ఎప్పటికప్పుడు బిల్లులు అందక నిరుత్సాహం

ఇంకా రావాల్సిన బిల్లులు రూ.70 కోట్లపైనే..

ఆలస్యం కావడంతో లబ్ధిదారుల అనాసక్తి

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌: స్వచ్ఛ భారత్‌ మిషన్‌ లక్ష్యసాధనలో నిధుల కొరత వెంటాడుతోంది. లక్ష్యాన్ని చేరుకునేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకున్న అధికారులను నిధుల విడుదలలో జాప్యం వెనక్‌ కలాగుతోంది. అధికారుల ప్రోత్సాహం, కళాజాతాల ద్వారా అవగాహన ఇతరత్రా కార్యక్రమాలతో ప్రజలు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ముందుకొస్తుండగా.. నెల రోజులుగా నిధులు నిలిచిపోవడం వారిలో నిరుత్సాహాన్ని నింపింది. తద్వారా లక్ష్యాన్ని చేరుకుంటామా, లేదా అని అధికారుల్లో ఆవేదన నెలకొంది.

అక్టోబర్‌ 2 నాటికి ఓడీఎఫ్‌ జిల్లా
జిల్లాలో ఈ ఏడాది అక్టోబర్‌ 2వ తేదీ గాంధీ జయంతి నాటికి వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసి ఓడీఎఫ్‌ జిల్లాగా ప్రకటించాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందులో భాగంగా హన్వాడ మండలంలోని సల్లోనిపల్లి గ్రామాన్ని మాడల్‌గా ఎంపిక చేసి 24 గంటల్లో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేసి రాష్ట్రంలోనే చరి త్ర సృష్టించారు. అనంతరం మొదటి విడతగా 84 గ్రామాలను ఎంపిక చేయగా, గత ఏడాది అక్టోబర్‌లో 48 గ్రామాలను ఓడీఎఫ్‌గా ప్రకటించారు. ఇలా ప్రారంభమైన మరుగుదొడ్ల నిర్మాణ ఉద్యమం జిల్లాలో ఉధృతమైంది. ఈ మేరకు రెండో విడతలో జిల్లాలోని అన్ని గ్రామాలను ఓడీఎఫ్‌ గ్రామాలుగా తీర్చిదిద్దాలని సంకల్పించి అధికారులు ముందుకు సాగారు. మొదటి విడతలో పూర్తయిన మరుగుదొడ్ల నిర్మాణాలు పోను ఇంకా జిల్లాలో అవసరమైన 1,67,033 మరుగుదొడ్ల నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. వీటి నిర్మాణానికి సిద్ధం కాగా.. ప్రభుత్వం నుండి నిధులు విడుదల కాకపోవడం అధికారులు, లబ్ధిదారుల్లో నిరుత్సాన్ని నింపుతోంది

రెండు విడతలుగా నిధుల విడుదల...
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛ భారత్‌ మిషన్‌లో  నిర్మించే మరుగుదొడ్లకు రూ.12వేల చొప్పున చెల్లిస్తారు. ప్రభుత్వం అనుమతించిన మరుగుదొడ్డి నిర్మాణానికి మార్కింగ్, జియో ట్యాగింగ్, అప్‌లోడ్‌ పూర్తయ్యాక రూ.6వేల మొదటి విడతగా వస్తాయి. నిర్మాణం పూర్తయ్యాక రెండో ఫొటో అప్‌లోడ్‌ చేయగానే మిగతా రూ.6వేలు అం దాలి. కానీ అలా జరగకపోవడంతో లక్ష్యాన్ని చేరతామా, లేదా అనే మీమాంసలో అధికారులు కొట్టుమిట్టాడుతున్నారు. ఇక బయట అప్పు లు ఎలా తీర్చాలా అని అధికారులు ఆందోళన చెందుతున్నారు. రెండో విడత నిధులు వస్తాయి కదా అనే ధీమాతో వారు బయట రింగ్‌లు, తలుపులు, సిమెంట్‌ తెప్పించారు. కానీ నిధులు రాకపోవడంతో పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఇది పక్కన పెడితే బిల్లులు రావడం తెలి యడంతో కొత్త నిర్మాణాలపై లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు.

నిధుల విడుదలలో జాప్యం నిజమే...
స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కార్యక్రమంలో భాగంగా నిర్మిస్తున్న మరుగుదొడ్లకు బిల్లుల విడుదలలో కాస్త జాప్యం జరుగుతున్న మాట వాస్తమే. వారం క్రితం రూ.1.20కోట్లు విడుదలయ్యాయి. ఇంకా రూ.70 కోట్ల వరకు బిల్లులు రావాల్సి ఉంది. ఆలస్యమైనా నిధులు విడుదలవుతాయనే నమ్మకం ఉంది. ఈ విషయమై లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తూ పనులు నిలిపివేయకుండా చూస్తున్నాం. ఏది ఏమైనా నిర్దేశిత గడువులోగా లక్ష్యాన్ని చేరుకుంటామనే నమ్మకం ఉంది. – ఉదిత్, జిల్లా మేనేజర్, స్వచ్ఛ భారత్‌ మిషన్‌

మరిన్ని వార్తలు