కాలుష్య కాసారాలు!

29 Jan, 2018 19:14 IST|Sakshi

దుర్గంధభరితంగాచెరువులు

కేసరి సముద్రం,నాగనూల్‌ చెరువుల్లోకి మురుగు

సుందరీకరణ చేపట్టాలని ప్రజల డిమాండ్‌

కందనూలు : జిల్లాకేంద్రంలోని కేసరి సముద్రం, నాగనూల్‌ చెరువులు కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి. పట్టణం నుంచి వెలువడే మురుగును మొత్తం ఈ చెరువుల్లోకి మళ్లించడంతో తమ అసలు స్వరూపాన్ని, వైభవాన్ని కోల్పోతున్నాయి. పట్టణం విస్తరించడం, జనావాసాలు పెరుగుదల నేపథ్యంలో నిత్యం వందల లీటర్ల మురుగు వెలువడుతోంది.

మినీ ట్యాంక్‌బండ్‌గా కేసరిసముద్రం
కేసరి సముద్రం చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చేందుకు స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్థన్‌రెడ్డి కృషితో ప్రభుత్వం రూ.8కోట్లు నిధులు కూడ మంజూరు చేసింది. దీనితో చెరువు కట్ట విస్తరణ, చెరువు మధ్యలో విగ్రహం, పచ్చిగడ్డి పరచడం వంటి పనులు జరుగుతున్నాయి. కాని పట్టణంలో నుండి చెరువులోకి వచ్చే మురుగు నీరుకు అడ్డుకట్ట వేసే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం వల్ల మురికి కుంపాలా తయారవుతోంది.

ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ పెట్టాలి..
ప్రసిద్ధిగాంచిన కేసరి సముంద్రం చెరువు మరో ట్యాంకు బండ్‌గా మారక ముందే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. చెరువులో కలుస్తున్న మురుగును శుద్ధి చేసేందుకు ప్లాంట్‌ పెట్టాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక నాగనూలు పంచాయతీ పరిధిలోని నాగనూలు చెరువు దుర్గంధభరితంగా మారింది. కాలకృత్యాలు తీర్చుకోవడం, జంతుకళేభరాలను పారవేయడం వల్ల మరీ అధ్వానంగా మారింది. పాలకులు తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు