‘25 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు’

9 Jun, 2019 09:59 IST|Sakshi

ముంబై : కాంగ్రెస్, ఎన్సీపీలకు చెందిన కనీసం 25 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని మహారాష్ట్ర జలవనరుల మంత్రి గిరీష్‌ మహాజన్‌ శనివారం ముంబైలో చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు విపక్షానికి భారీ ఎదురుదెబ్బ తగలనుందన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్‌లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కాంగ్రెస్, ఎన్సీపీ ఎమ్మెల్యేలు పలువురు తనతో టచ్‌లో ఉన్నారని, కొందరు తనను వ్యక్తిగతంగా కలిశారని, కొందరు ఫోన్‌ చేశారని వెల్లడించారు. మరికొందరు మూడో వ్యక్తి ద్వారా బీజేపీలో చేరేందుకు తమ ఆసక్తిని వ్యక్తం చేశారని చెప్పారు. తనచుట్టూ ఉన్నవారు త్వరలోనే ఏదో ఒక సమయంలో పార్టీ మారవచ్చనే సంగతి రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు అశోక్‌ చవాన్‌కు తెలియదన్నారు. 

ఎవరైనా బేషరతుగానే చేరాలి
స్వయంగా ముఖ్యమంత్రే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలను మహాజన్‌ ఖండించారు. పార్టీలో బేషరతుగానే చేరాలన్న విషయం కొత్తగా వచ్చేవారికి బీజేపీ స్పష్టం చేసిందన్నారు. సీనియర్‌ కాంగ్రెస్‌ నేత రాధాకృష్ణ విఖే తమ పార్టీలో చేరవచ్చని అన్నారు.

మరిన్ని వార్తలు