పుణేలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

7 Feb, 2018 18:41 IST|Sakshi

పుణే సిటీ : పుణే ఘోర్పడి ప్రాంతంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి మందిరంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం నిర్వహించిన కల్యాణోత్సవంలో ఆలయ ప్రాంగణం కిక్కిరిసి పోయింది. వేద మంత్రాలు, మంగళవాయిద్యాల మధ్య శ్రీవారి కల్యాణోత్సవం వేడుకగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం గోవింద నామ స్మరణతో మారుమ్రోగి పోయింది. కల్యాణోత్సవంలో శ్రీవారికి పట్టువస్త్రాలను అందించారు. దాదాపు నాలుగు గంటల పాటు ఉత్సవం నిర్వహించారు. శ్రీవారికి  శ్రీదేవి, భూదేవిల అప్పగింతల కార్యక్రమం భక్తులను కనువిందు చేసింది. ఈ వేడుకలు చూసేందుకు పట్టణంలోని తెలుగువారితోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అదేవిధంగా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు శ్రీవారి ప్రసాదం లడ్డూను భక్తులకు అందజేశారు. కాగా, దాదాపు 30 వేల మందికి మహాప్రసాదం వితరణ చేశారు. ఈ కార్యక్రమాలలో ఆదివారం పుణే పార్లమెంట్‌ సభ్యులు అనిల్‌ శిరోలె పాల్గొనగా, సోమవారం స్థానిక కార్పొరేటర్లు మంగళా మంత్రి ఉమేష్‌ గైక్వాడ్, మాజీ డిప్యూటీ మేయర్‌ ప్రకాశ్‌ మంత్రి పాల్గొన్నారు. కాగా, సప్తగిరి శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్‌ అధ్యక్షులు దొంగరి సుబ్బారాయుడు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బొల్ల మాధవ రావు, రాజేంద్ర రావు, కల్లూరి భాస్కర్‌రెడ్డి, కె.బలరాం, కామనబోయిన చెంచయ్య, ఉపాధ్యక్షులు దుగ్గిరెడ్డి మాధవరెడ్డి, వి.ఎస్‌.చలసాని, పాలగిరి చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ అధ్యక్షులు సావ నారాయణ, శ్రీనివాస్‌ భండారి, బొర్రాజు తిరుపతయ్య, పాలగిరి భాస్కర్‌రెడ్డి, సురేశ్‌ నాగరాజ్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు