ఎంబీఎంసీ కమిషనర్‌ బదిలీ

7 Feb, 2018 17:45 IST|Sakshi

ఏడేళ్లలో ఐదుగురు కమిషనర్లు ట్రాన్స్‌ఫర్‌

ప్రజాప్రతినిధులతో పడకపోవడంతోనే చర్యలు!

సాక్షి, ముంబై : మీరా–భయందర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎంబీఎంసీ)లో కమిషనర్ల బదిలీల పరంపర కొనసాగుతూనే ఉంది.  అధికార బీజేపీ, ఎంబీఎంసీ కమిషనర్‌ నరేశ్‌ గీతే మధ్య కొనసాగుతున్న వివాదం తారస్థాయికి చేరడంతో బదిలీ చేశారు. నరేశ్‌ గీతే కేవలం సంవత్సరన్నర కాలం మాత్రమే ఎంబీఎంసీలో విధులు నిర్వహించారు. వివిధ కారణాల వల్ల 2011 తరువాత ఒక్కరు కూడా పూర్తికాలం విధులు నిర్వహించలేకపోవడం గమనార్హం. దీంతో కమిషనర్ల బదిలీల సంఖ్య ఐదుకు చేరింది.  

ఒత్తిళ్లకు లొంగబోనని..
ఎంబీఎంసీలో బీజేపీ అధికారంలో ఉంది. కొద్ది రోజులుగా ఎంబీఎంసీ కమిషనర్‌ నరేశ్‌ గీతే, ఇతర ప్రజాప్రతినిధుల మధ్య వాగ్వాదం జరుగుతోంది. దీనికి తోడు స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర మెహతా మధ్య రాజీ కుదరలేదు. గీతే నియమ, నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారని మెహతా ఆరోపించారు. పరిపాలన విభాగం విధించిన నియమాలకు లోబడి పనిచేస్తానని, మీ ఒత్తిళ్లకు, బెదిరింపులకు తను భయపడడని కమిషనర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టినప్పుడే గీతే అధికార పార్టీ నాయకులకు స్పష్టం చేశారు. అప్పటి నుంచి ఈ వివాదం జరుగుతూనే ఉంది. ఫలితంగా అభివృద్ధి పనులు కుంటుపడ్డాయి. దీంతో వచ్చే ఆర్థిక బడ్జెట్‌ సమావేశంలో దీని ప్రభావం కచ్చితంగా చూపనుంది. వీరి మధ్య జరుగుతున్న వివాదం రోజురోజుకు తారస్థాయికి చేరుకుంది. పరిష్కారమయ్యే మార్గం కనిపించకపోవడంతో, అధికార పార్టీ కార్పొరేటర్లు నేరుగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు. అందులో గీతే బదిలీ విషయంపై చర్చించి, ఆయన్ని బదిలీ చేశారు.

కమిషనర్లపై బదిలీ వేటు..
2011లో కమిషనర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్‌ అధికారి విజయ్‌కుమార్‌పై కేవలం సంవత్సరన్నర కాలంలోనే బదిలీ వేటు పడింది. ఆ తరువాత వచ్చిన సురేశ్‌ కాకాణీ, సుభాష్‌ లాఖే, అచ్యుత్‌ హాంగే లపై కూడా సంవత్సరన్నర పదవీ కాలం పూర్తిచేయకుండానే బదిలీ చేశారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్‌ అధికారులకు కార్పొరేషన్‌ పనితీరును తెలుసుకునేందుకు కొంత సమయం పడుతుంది. ఆ తరువాత ఈ అధికారులు తమ పనిలో స్థిరపడతారు. కానీ, ప్రజా ప్రతినిధులతో ఎలా మసులుకోవాలి, వారితో కలిసి ఎలా పనిచేయాలో అప్పటికీ ఇంకా వీరికి తెలియదు. ఇది తెలుసుకునే లోపు వారి మధ్య విభేదాలు పొడచూపడం, వివాదానికి దారి తీయడం, బదిలీ వేటు పడటం లాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.  

మరిన్ని వార్తలు