నిసర్గ: ముంబైకి భారీ ఊరట!

3 Jun, 2020 19:38 IST|Sakshi

సాక్షి, ముంబై: కరోనా వైరస్‌ విజృంభణతో అల్లాడుతున్న ముంబై నగరంపై నిసర్గ తుపాను కరుణ చూపింది. భారీ విధ్వంసానికి కారణమవుతుందని భావించిన నిసర్గ తీరందాటే క్రమంలో ముంబై నగరంపై తక్కువ ప్రభావాన్నే చూపింది. గాలి వేగం, వర్షం తగ్గుముఖం పట్టినట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇప్పటివరకు నిసర్గ వల్ల ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని వెల్లడించారు. ఒకవైపు లాక్‌డౌన్‌, మరోవైపు నిసర్గ బారినపడకుండా ప్రభుత్వ హెచ్చరికలతో జనమంతా ఇళ్లకే పరిమితమయ్యారు. బీచ్‌లు, పార్కులు, బహిరంగ ప్రదేశాలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. 

అరేబియా సముద్రంలోని తూర్పు మధ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుఫాను (నిసర్గ)గా మారిన సంగతి తెలిసిందే. ముంబైకి వంద కిలోమీటర్ల దూరంలోని అలీబాగ్ వ‌ద్ద నిసర్గ తుఫాను బుధవారం మధ్యాహ్నం 1 గంటకు తీరం దాటే సమయంలో సుమారు 120 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. పెద్ద ఎత్తున చెట్లు నేలకూలాయి. వాహనాలు ధ్వంసమయ్యాయి. అయితే, ఆరు గంటల వ్యవధిలోనే (రాత్రి ఏడు గంటల ప్రాంతంలో) నీరస పడింది. ఇక తుపాను ప్రభావం తగ్గడంతో ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలను పునరుద్ధరించారు. ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్‌, డామన్‌ డయ్యూ, దాద్రానగర్‌ హవేళీల్లో హై అలర్ట్‌లో ఉన్నాయి. 
(చదవండి: తుపానుల వలయంలో ముంబై)

మరిన్ని వార్తలు