‘24 గంటలు ప్రయాణించి మరీ ముంబై వెళ్తున్నాం’

6 Jun, 2020 18:47 IST|Sakshi

ముంబై: పెరుగుతున్న కోవిడ్‌ కేసులకు అనుగుణంగా వైద్య సిబ్బందిని ఏర్పాటుచేసుకునే దిశగా ముంబై ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలోని గ్రీన్ జోన్‌‌ కరోనా జిల్లాల్లో ఉన్న వైద్య సిబ్బందిని ముంబైకి రప్పిస్తోంది. ఈ క్రమంలో వైరస్‌ ప్రభావం తక్కువగా  వార్ధా జిల్లా నుంచి ఇప్పటికే 45 మంది డాక్టర్లు ముంబై వెళ్లి సేవలందిస్తున్నారు. అంధేరీలోని సెవన్‌ హిల్స్‌ ఆస్పత్రిలో వారు విధుల్లో ఉన్నారు. వైద్యుల రవాణాకు బస్సు ఏర్పాట్లు చేశామని బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు తెలిపారు. 24 గంటల బస్సు ప్రయాణం చేసి మరీ ముంబై వెళ్తున్నామని వార్ధాలోని మహాత్మా గాంధీ మెడికల్‌ సైన్సెస్‌ డాక్టర్‌ శివకుమార్‌ తెలిపారు. కేసుల తీవ్రత అధికంగా ఉండటంతో ఒకింత భయంగా ఉందని, అయినా స్వచ్ఛందంగా ఈ సేవలకు ముందుకొచ్చినట్టు తెలిపారు. 
(చదవండి: టిక్‌టాక్‌ స్టార్ ‌పై కేసు నమోదు)

కోవిడ్‌ బాధితులకు చికిత్స విషయంలో తమకు అవగాహన కల్పించారని  వార్ధాకు చెందిన మరో డాక్టర్‌ నీరజ్‌ పెథె చెప్పారు. వార్ధా, ముంబై పరిస్థితులు వేరువేరని అన్నారు. అయినప్పటికీ ఆపత్కాలంలో తమ సేవలు ఉపయోగపడుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఇక వార్ధా డాక్టర్ల సేవలతో ముంబైలోని రెండు నెలలుగా విధుల్లో ఉన్న డాక్టర్లకు కొంత విశ్రాంతినివ్వొచ్చని వైద్యాధికారులు వెల్లడించారు. బీడ్‌, లాతూర్‌ జిల్లాల్లోని మెడికల్ కాలేజీ విద్యార్థులను సేవలను కూడా వినియోగించుకుంటామని బీఎంసీ అధికారులు తెలిపారు. వీళ్లందరి సేవలతో కరోనా బాధితులకు సేవలందించిన వైద్య సిబ్బంది 15 రోజులపాటు స్వీయ నిర్బంధంలో గడిపే అవకాశం ఉంటుందని తెలిపారు. కాగా, మహారాష్ట్రలో 17,337 హెల్త్‌ కేర్‌ సిబ్బంది ఖాళీలు ఉన్నాయని రాష్ట్ర వైద్య మంత్రి రాజేష్‌ తోపే ఇటీవల వెల్లడించడం గమనార్హం. వైద్య విద్యలోనూ 10 వేల ఖాళీ ఉన్నట్టు తెలిసింది. ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చర్యలు చేపట్టింది. 
(చదవండి: షోలాపూర్‌ మేయర్‌ దంపతులకు కరోనా పాజిటివ్‌)

>
మరిన్ని వార్తలు