వరవరరావుకు అస్వస్థత!

29 May, 2020 21:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహారాష్ట్రలోని తలోజా జైలులో ఉన్న విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు (80) శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. ఆయనను నవీ ముంబైలోని జేజే ఆస్పత్రికి తరలించినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. వరవరరావు అనారోగ్య సమాచారాన్ని చిక్కపడపల్లి పోలీస్‌ స్టేషన్‌కు అందించినట్టు పుణె పోలీసులు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలు, ఎల్గార్‌ పరిషద్‌– మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో వరవరరావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

కాగా, వరవరరావును ఉంచిన జైల్లోని కొందరు ఖైదీలు కరోనా వైరస్ బారిన పడ్డారు. వారిలో ఒక ఖైదీ మరణించినట్టు కూడా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలో 80 ఏళ్ల వృద్ధుడైన తమ తండ్రిని వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని వరవరరావు ముగ్గురు కూతుర్లు పి.సహజ, పి.అనల, పి.పవన మహారాష్ట్ర గవర్నర్‌కు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, ముఖ్యమంత్రికి లేఖ రాశారు. తప్పుడు అభియోగాలతో తమ తండ్రిని జైల్లో వేశారని వాపోయారు. కొవిడ్-19 కారణంగా తలోజా జైలులో ఒక ఖైదీ మరణించాడన్న వార్త తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందని లేఖలో వారు పేర్కొన్నారు.
(చదవండి: జీవించే హక్కు వీరికి లేదా?)

మరిన్ని వార్తలు