సంక్షోభం ఏదైనా.. ఆగకూడదు ప్రణాళిక

13 Apr, 2020 04:52 IST|Sakshi

పెట్టుబడుల విషయంలో ప్రణాళికే మీకు మార్గదర్శి

ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ దానికి కట్టుబడాలి

మార్కెట్లు అన్నవి పడి లేచే కెరటాల్లాంటివి

వాటి తీరుకు తగ్గట్టు మార్పులు చేసుకోవాలి

బుల్‌ తర్వాత బేర్‌.. బేర్‌ తర్వాత మళ్లీ బుల్‌ మార్కెట్‌

మీ రిస్క్‌ సామర్థ్యానికి అనుగుణంగా అడుగులు

చరిత్రలో ఎన్నో సంక్షోభాలు తలెత్తాయి. ఆర్థిక మాంద్యాలు, ఆరోగ్యపరమైన సంక్షోభాలను ప్రపంచం విజయవంతంగా అధిగమించి ప్రగతి దిశగా అడుగులు వేస్తూనే ఉంది. ఈ క్రమంలో 2020లో కరోనా వైరస్‌ (కోవిడ్‌–19) ప్రపంచ దేశాలకు సవాల్‌గా మారింది. గతంలో పడి లేచిన కెరటాల్లాంటి ఎన్నో అనుభవాలు ఉన్నప్పటికీ.. ఇటీవలి కరోనా వైరస్‌ ఆధారిత మార్కెట్‌ పతనం.. ఇన్వెస్టర్లలో తమ పెట్టుబడులకు దీర్ఘకాల భద్రత ఏంటన్న ఆందోళనకు దారితీసింది. ఎంతో మంది ఇన్వెస్టర్లు నిపుణులు, బ్రోకరేజీలు, ఫండ్స్‌ హౌస్‌లకు తమ ఆందోళనలను ప్రశ్నల రూపంలో సంధిస్తున్నారు.

పెట్టుబడులకు సంబంధించి, మార్కెట్ల పతనంలో అవకాశాలు, తదితర విషయాలపై అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌కు చెందిన పరిశోధక బృందం తరచుగా ఇన్వెస్టర్ల నుంచి తమకు ఎదురైన ప్రశ్నలు, వాటికి నిపుణుల సమాధానాలు, సూచనలను విడుదల చేసింది. కరోనా సంక్షోభం అనంతరం ఈక్విటీ, మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడుల విషయమై ఏ విధంగా వ్యవహరించాలన్నది వీటి ఆధారంగా ఇన్వెస్టర్లు ఓ నిర్ణయానికి వచ్చేందుకు వీలుంటుంది. ఇందుకు సంబంధించి  హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ టీమ్‌ విడుదల చేసిన ప్రశ్నలు, జవాబుల జాబితా ఇది...

కొనుగోళ్లకు ఇది సరైన తరుణమేనా..?
నిర్దేశిత పరిమాణం కంటే ఈక్విటీల్లో తక్కువ ఇన్వెస్ట్‌ చేసి ఉన్నట్టయితే..  ఫండ్స్‌ పథకాల్లో సిప్‌ రూపంలో పెట్టుబడులను ప్రారంభించుకోవచ్చు. ఎక్సే్ఛంజ్‌ ట్రేడెడ్‌ ఫం డ్స్‌ లేదా నేరుగా స్టాక్స్‌లోనూ  ఇన్వెస్ట్‌ చేయవచ్చు. రిస్క్‌ తీసుకునే వారు 100 నుంచి తమ వయసును తీసివేయగా మిగిలిన శాతం పెట్టుబడులను ఈక్విటీలకు (ఫండ్స్‌ లేదా స్టాక్స్‌) కేటాయించుకోవచ్చు. ఒకవేళ రిస్క్‌ ఎక్కువగా తీసుకోలేని వారు 100కు బదులు 70 నుంచి తమ వయసును తీసివేసి, మిగిలిన శాతాన్ని ఈక్విటీలకు కేటాయించుకోవాలి. మిగిలిన పెట్టుబడులను స్థిరాదాయ పథకాలైన ఎఫ్‌డీలు, బాండ్‌ ఫండ్స్‌ లేదా చిన్న మొత్తాల పొదు పు పథకాలు, బంగారానికి కేటాయించుకోవచ్చు.

ఫండ్స్‌ పెట్టుబడుల విలువ పడిపోతే?
ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు వాటి ఇటీవలి గరిష్టాల నుంచి రెండు నెలల వ్యవధిలోనే 40 శాతం పడిపోయాయి. ఫండ్స్‌ లేదా స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసిన వారు అందరూ ఈ నష్టాలను చూస్తున్నారు. గడిచిన 34 ఏళ్లలో (ఆరు భారీ బేర్‌ మార్కెట్లు (40% అంతకంటే ఎక్కువ నష్టపోవడం) ఎదురయ్యాయి. కానీ, ప్రతీ పతనం తర్వాతి రెండు మూడేళ్ల కాలంలో మార్కెట్లు కోలుకున్నాయి. ప్రస్తుత స్థాయిలో మార్కెట్లో కరెక్షన్‌ ముగి సిందని చెప్పలేం. వచ్చే కొన్నేళ్ల కాలానికి డబ్బు అవసరం లేని వారు తమ ఈక్విటీ పెట్టుబడులను కొనసాగించుకోవచ్చు. అయితే, ప్రస్తుతం, భవిష్యత్తులోనూ సమయానుకూలంగా తమ పెట్టుబడులను సమీక్షించుకోవడం మర్చిపోవద్దు.

సిప్‌ను కొనసాగించాలా..?
ప్రస్తుత మార్కెట్‌ కరెక్షన్‌ కారణంగా ఫండ్స్‌ పథకాల్లోని పెట్టుబడులు నష్టాలు చూపిస్తున్నాయని సిప్‌ను ఆపేద్దామని అనిపించొచ్చు. కానీ, అలా చేస్తే అది పెద్ద తప్పిదమే అవుతుంది. ఇటువంటి మార్కెట్ల దిద్దుబాట్లు ఫండ్స్‌ యూనిట్ల కొనుగోలు ఖర్చును తగ్గిస్తాయి. తక్కువ ధరల కారణంగా అధిక యూనిట్లను సమకూర్చుకునే అవకాశం ఇటువంటి సందర్భాల్లోనే లభిస్తుంది. కనుక వీలైనంత వరకు సిప్‌ను ఇప్పుడు కొనసాగించాలి. వీలుంటే సిప్‌ మొత్తాన్ని పెంచుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. అయితే, పనితీరు సజావుగా లేని పథకాల్లో సిప్‌ ఆపేసి, మంచి పథకాల్లో సిప్‌ కొనసాగించడం, పెంచుకోవడం చేయాలి.

ఎఫ్‌ అండ్‌ ఓ లతో రక్షణ ఎలా?
రిస్క్‌ నిర్వహణకు డెరివేటివ్స్‌ (ఎఫ్‌అండ్‌వో) చాలా ముఖ్యమైన సాధనం. హెడ్జింగ్‌ రూపంలో నష్టాల నుంచి రక్షణ కల్పించుకోవచ్చు. నిఫ్టీ పుట్‌ ఆప్షన్ల కొనుగోలు ద్వారా మీ పోర్ట్‌ఫోలియోకు సులభంగా హెడ్జ్‌ చేసుకోవచ్చు. అయితే, హెడ్జింగ్‌ అన్నది బీమా కవరేజీ వంటిది. ఒకవేళ మార్కెట్లు పడిపోకుండా పెరిగితే పుట్‌ ఆప్షన్ల కోసం చెల్లించిన ప్రీమియం నష్టపోవాల్సి వస్తుంది. కానీ, మీ పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో లాభపడింది కనుక దాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అయితే, అన్ని వేళలా హెడ్జింగ్‌ కాకుండా.. మార్కెట్లు పెద్ద కరెక్షన్లు లేకుండా దీర్ఘకాలం పాటు గణనీయంగా పెరిగిన సందర్భాల్లో హెడ్జ్‌ ఆప్షన్‌ను
వినియోగించుకోవాలి.  

దేశీయ స్టాక్‌ మార్కెట్ల చరిత్రలో బేర్‌ మార్కెట్లు ఎంత కాలం పాటు కొనసాగాయి?
1992, 2000, 2008 సందర్భాల్లో బేర్‌ మార్కెట్లను చవిచూశాం. 1992 కరెక్షన్‌ తర్వాత సెన్సెక్స్‌ తన పూర్వపు గరిష్టాలను అధిగమించేందుకు రెండున్నరరేళ్ల సమయం తీసుకుంది. 2000–2001 కరెక్షన్‌ తర్వాత సెన్సెక్స్‌ గరిష్టాలకు చేరుకునేందుకు నాలుగేళ్లు పట్టింది. 2008 తర్వాత పూర్వపు గరిష్టాలను దాటేందుకు సెన్సెక్స్‌కు ఆరేళ్లు పట్టింది.  
 

బంగారంలో ప్రాఫిట్‌ బుక్‌ చేయొచ్చా?
అంతర్జాతీయ సంక్షోభ సమయంలో బంగారం అన్నది విశ్వసనీయమైన పెట్టుబడి సాధనం. ఈక్విటీలకు బంగారం వ్యతిరేక దిశలో ఉంటుంది. కనుక ఈక్విటీ మార్కెట్ల పతనం సమయంలో బంగారం సురక్షిత సాధనం. ప్రస్తుత సమయాల్లో బంగారంలో పెట్టుబడులను కొనసాగించుకోవడమే సూచనీయం. ఈక్విటీ మార్కెట్లు కనిష్టాలకు చేరినట్టు ధ్రువీకరణ అయిన తర్వాత బంగారంలో కొంత లాభాలను స్వీకరించొచ్చు.  
 

మొదటి సారి ఇన్వెస్ట్‌ చేస్తే...?
మొదటి సారి పెట్టుబడులు పెట్టే వారికి ప్రస్తుత సమయం అనుకూలమైనది. మంచి నాణ్యమైన ఐపీవోలకు దరఖాస్తు చేసుకోవడంతోపాటు, మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లో సిప్‌ ద్వారా పెట్టుబడులు ప్రారంభించుకోవాలి. తగినంత అనుభవం, పరిజ్ఞానం సంపాదించిన తర్వాత నాణ్యమైన కంపెనీల షేర్లలో నేరుగానూ ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు.
 

లాక్‌డౌన్‌తో ప్రయోజనం పొందే రంగాలు?
ఫార్మాస్యూటికల్స్, హెల్త్‌కేర్, టెలికం, ఎంపిక చేసిన ఫైనాన్షియల్‌ రంగ కంపెనీలు, ఇంటర్నెట్‌ ఆధారిత వ్యాపారాలు లౌక్‌డౌన్‌ సమయంలో కొనసాగుతున్నాయి. ఇతర కంపెనీలతో పోలిస్తే ఇవి సంక్షోభాన్ని మెరుగ్గా అధిగమించగలవు. ఒక్కసారి లౌక్‌డౌన్‌ ముగిస్తే ఆకర్షణీయంగా ఉన్న ఇతర రంగాల వైపు మళ్లొచ్చు.  
 

నష్టాలను బుక్‌ చేసుకోవచ్చా..?
భవిష్యత్తు పరిస్థితుల గురించి అవగాహన లేకుండా చెప్పుడు మాటల ద్వారా, విన్న వార్తల ద్వారా ఏవైనా కొనుగోలు చేసి ఉంటే, ఈ సమయంలో ఆ కంపెనీల ఫండమెంటల్స్, ఇటీవలి పరిణామాలు, సూచీలతో పోలిస్తే స్టాక్‌ ధర పరంగా జరిగిన నస్టాన్ని సమీక్షించుకోవడం చేయాలి. ఈ అంశాల్లో బలహీనంగా కనిపిస్తే ఆ పెట్టుబడులను వెనక్కి తీసుకుని, దీర్ఘకాలంలో మెరుగైన అవకాశాలు ఉన్నాయని భావించే వాటిల్లో, నిపుణుల సూచనల మేరకు ఇన్వెస్ట్‌ చేసుకోవాలి.  

మరిన్ని వార్తలు