యూఎస్‌కు వ్యాక్సిన్‌ అంచనాల జోష్‌

19 May, 2020 10:38 IST|Sakshi

4-2.5 శాతం జంప్‌చేసిన మార్కెట్లు-ఫెడ్‌ నుంచి మరో ప్యాకేజీపై ఆశలు-ట్రావెల్‌, ఎయిర్‌లైన్స్‌, ఆటో షేర్లు జోరు

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్‌-19 నివారణకు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌పై అంచనాలు సోమవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. దీనికితోడు ఆర్థిక వృద్ధికి అవసరమైతే మరో ప్యాకేజీ ఇచ్చేందుకు సిద్ధమంటూ ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమీ పావెల్‌ వారాంతాన ప్రకటించడం కూడా సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. వెరసి డోజోన్స్‌ 912 పాయింట్లు(3.9 శాతం) జంప్‌చేసి 24,597 వద్ద ముగిసింది. ఈ బాటలో ఎస్‌అండ్‌పీ 90 పాయింట్లు(3.2 శాతం) ఎగసి 2954 వద్ద నిలవగా.. నాస్‌డాక్‌ సైతం 220 పాయింట్లు(2.5 శాతం) పురోగమించి 9235 వద్ద స్థిరపడింది. ఆర్థిక రికవరీపై ఆశలతో మార్చిలో నమోదైన కనిష్టాల నుంచి ఎస్‌అండ్‌పీ 32 శాతం ర్యాలీ చేసినప్పటికీ.. కరోనా వైరస్‌ మరోసారి విస్తరించవచ్చన్న ఆందోళనలతో ఈ నెలలో అటూఇటుగా కదులుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.

మోడర్నా దూకుడు
కరోనా వైరస్‌కు ముక్కుతాడు వేసే బాటలో అభివృద్ధి చేస్తున్న ప్రయోగాత్మక ఔషధం తొలి దశ పరీక్షలలో సత్ఫలితాలు ఇచ్చినట్లు మోడర్నా ఇంక్‌ తాజాగా వెల్లడించింది.దీంతో ఈ కౌంటర్‌కు భారీ డిమాండ్‌ ఏర్పడింది. ఈ షేరు 20 శాతం దూసుకెళ్లింది. కాగా.. ఇటీవల పతన బాటలో సాగిన ట్రావెల్‌ సంబంధ కౌంటర్లు జోరందుకున్నాయి. క్రూయిజ్‌ లైన్‌ కార్యకలాపాల కంపెనీలు కార్నివాల్‌ కార్ప్‌, రాయల్‌ కరిబ్బియన్‌, నార్వేజియన్‌ క్రూయిజ్‌ 15 శాతం స్థాయిలో జంప్‌చేశాయి.ఇక ఎయిర్‌లైన్స్‌ స్టాక్స్‌ డెల్టా, ఎక్స్‌ఏఎల్‌ 14 శాతం చొప్పున ఎగశాయి. లాక్‌డవున్‌ ఎత్తివేస్తున్న నేపథ్యంలో ఆటో రంగ దిగ్గజాలు జనరల్‌ మోటార్స్‌ 10 శాతం, ఫోర్డ్‌ మోటార్‌ 8 శాతం చొప్పున దూసుకెళ్లాయి. 

మరిన్ని వార్తలు