ఎన్టీఆర్‌ ప్రభంజనానికి ఎదురొడ్డి.. పై చేయి...

8 Nov, 2018 17:07 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఏడో శాసనసభ (1983-85)

మెదక్‌ నారాయణఖేడ్‌కే ‘దేశం’ పరిమితం

మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్‌ విజయకేతనంసిద్దిపేట నుంచి ఆరంగేట్రంలో కేసీఆర్‌కు ఓటమిడబుల్‌ హ్యాట్రిక్‌ సాధించిన బాగారెడ్డిశాసనసభాపక్ష నేతగా మదన్‌మోహన్‌

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : కాంగ్రెస్‌ (ఐ)లో అంతర్గత విభేదాలతో 1978-83 మధ్య కాలంలో ఏకంగా నలుగురు ముఖ్యమంత్రులు మారడంతో రాష్ట్రంలో రాజకీయ అస్థిరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో సినీ హీరో నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్‌) తెలుగుదేశం పార్టీని ప్రారంభించారు. పార్టీని ప్రారంభించిన ఎనిమిది నెలల్లోనే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూలు వెలువడింది. ఈ ఎన్నికల్లో రాష్ట్రమంతటా తెలుగుదేశం  పార్టీ ప్రభంజనం వీచింది. అయితే రాష్ట్ర ఆవిర్భావం నుంచి మెదక్‌ జిల్లాలో పట్టు నిలుపుకుంటూ వచ్చిన కాంగ్రెస్‌ ఎన్టీఆర్‌ ప్రభంజనానికి ఎదురొడ్డి మెజారిటీ అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది.

జిల్లాలోని అన్నీ అసెంబ్లీ స్థానాలకు తెలుగుదేశం పోటీ చేసినా కేవలం మెదక్‌, నారాయనఖేడ్‌ నియోజకవర్గాల్లో మాత్రమే పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. గజ్వేల్‌, సంగారెడ్డిలో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. ఆరు స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు విజయం ​సాధించారు. దొమ్మాట, సిద్దిపేట, జహీరాబాద్‌ నియోజకవర్గాల్లో మాత్రమే తెలుగుదేశం బలమైన పోటీ ఇచ్చి రెండో స్థానానికి పరిమితమైంది. 

కేసీఆర్‌ అరంగేట్రం...
తెలంగాణ ఉద్యమనేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఏడో శాశనసభ ఎన్నికల్లో తొలిసారిగా రంగంలోకి దిగారు. యువజన కాంగ్రెస్‌ నేతగా ఉన్న కేసీఆర్‌ సిద్దిపేట అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. 1970లో జరిగిన ఉప ఎన్నిక మొదలుకొని 1978 వరకు వరుస విజయాలు సాధించి, కీలకమైన శాఖలకు మంత్రిగా వ్యవహరించిన ఎ. మదన్‌మోహన్‌ నాలుగో పర్యాయం కాంగ్రెస్‌ నుంచి సిద్దిపేట ఎన్నికల బరిలో నిలిచారు.

తన రాజకీయ గురువుగా చెప్పుకొనే మదన్‌మోహన్‌పై పోటీ చేసిన కేసీఆర్‌ కేవలం 887 ఓట్ల తేడాతో పరాజయం పొందాడు. రాష్ట్రంలో 234 అసెంబ్లీ స్థానాలకుగాను 201 స్థానాలు సాధించిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగా, ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ కేవలం 60 స్థానాలకు పరిమితం కాగా, సిద్దిపేట నుంచి వరుసగా నాలుగో పర్యాయం గెలుపొందిన మదన్‌మోహన్‌ అసెంబ్లీలో శాసనసభాపక్ష నేతగా వ్యవహరించారు. 1984 ఆగస్టులో తెలుగుదేశం పార్టీలో నెలకొన్న అంతర్గత సంక్షోభంలో తెలుగుదేశం పార్టీ పక్షాన గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఎన్టీఆర్‌ వైపే ఉన్నారు. నెల రోజుల తర్వాత తిరిగి ఎన్టీఆర్‌ సీఎం పదవి చేపట్టగా మదన్‌మోహన్‌ స్థానంలో జహీరాబాద్‌ ఎమ్మెల్యే బాగారెడ్డిని కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేతగా నియమించారు. 

  • తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో  రాష్ట్రవ్యాప్తంగా కొత్త ముఖాలు రాజకీయ తెర మీదకు రాగా, మెదక్‌ జిల్లాలో మాత్రం ఒకరిద్దరు మినహా అన్నీ నియోజకవర్గాల్లో కాపులే తలపడ్డారు.
  • 1972లో ఇండిపెండెంట్‌గా, 1978లో కాంగ్రెస్‌ (యు) అభ్యర్థిగా మెదక్ నుంచి పోటీ చేసిన కరణం రామచంద్రరావు టీడీపీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే శేరి లక్ష్మారెడ్డిపై విజయం సాధించారు. 
  • 1981 ఉపఎన్నికలో రామాయంపేట నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య 1983లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా రెండో పర్యాయం విజయం సాధించారు. 
     
  • దొమ్మాట నుంచి ఐరేని లింగయ్య వరుసగా రెండోసారి విజయం సాధించగా, ఉపాధ్యాయ వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన దొమ్మాట రామచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తలపడ్డారు. 
     
  • 1970లో జరిగిన ఉప ఎన్నిక నుం‍చి వరుస విజయాలు సాధిస్తూ వస్తున్న ఎ. మదన్‌మోహన్‌ సిద్దిపేటలో వరుసగా నాలుగో పర్యాయం గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రసమితి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తొలిసారిగా 1983 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.  1972లో ఇండిపెండెంట్‌గా, 1978లో జనతా పార్టీ అభ్యర్థిగా గజ్వేల్‌ నుంచి పోటీ చేసి వరుస ఓటమి చవిచూసిన అల్లం సాయిలు మరోమారు ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. వరుసగా నాలుగు పర్యాయాలు కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయం సాధిస్తూ వస్తున్న గజ్వెల్లి సైదయ్య విజయ పరంపరకు చెక్‌ పెట్టారు. 
     
  • నర్సాపూర్‌లో తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి చిలుముల విఠల్‌రెడ్డి (సీపీఐ)పై సీ.జగన్నాధరావు గెలుపొందారు.
     
  • సంగారెడ్డిలో 1962 నుంచి వరుస ఎన్నికల్లో పోటీ చేస్తూ గెలుపోటములను చవిచూసిన పీ. రామచంద్రారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. 
     
  • 1972లో ఇండిపెండెంట్‌తగా విజయం సాధించి, 1978లో కాంగ్రెస్‌ (యు) అభ్యర్థిగా ఓటమి చవిచూసిన ఎం. వెంకటరెడ్డి 1983 ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి బరిలో నిలిచి గెలుపొందారు. 
     
  • 1957లో జహీరాబాద్‌ నుంచి విజయాల పరంపర ప్రారంభించిన ఎం. బాగారెడ్డి వరుసగా ఆరో పర్యాయం (డబుల్‌ హ్యాట్రిక్‌) జహీరాబాద్‌ నుంచి విజయకేతనం ఎగురవేశారు. 
మరిన్ని వార్తలు