కరపత్ర యుద్ధం

22 Jan, 2018 09:03 IST|Sakshi

టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌

అభివృద్ధి నిరోధకులు మీరంటే మీరంటూ పరస్పర ఆరోపణలు

ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు జోరుగా కరపత్రాల పంపిణీ

పోటాపోటీగా ఊరేగింపులు, నిరసన కార్యక్రమాలు

జోగిపేటలో వేడెక్కుతున్న రాజకీయం

స్థానికంగా చర్చనీయాంశం

జోగిపేట(అందోల్‌): జోగిపేట నగర పంచాయతీలో కరపత్ర యుద్ధం మొదలైంది. ‘‘అవినీతికి మీరంటే మీరే బాధ్యులని.. అభివృద్ధిని మీరు అడ్డుకుంటున్నారంటే మీరే అడ్డుకుంటున్నారంటూ’’ టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ వర్గాలు కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ ఏకంగా కరపత్రాలు అచ్చువేయించి పంచడం వరకు వెళ్లింది పరిస్థితి. దీంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. 2012–13లో ఏర్పడిన నగర పంచాయతీకి 2014లో పాలకవర్గ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 13, టీఆర్‌ఎస్‌ 4, బీజేపీ 1, టీడీపీ 2 కౌన్సిలర్‌ స్థానాలను దక్కించుకున్నాయి. మెజార్టీ సీట్లు సాధించిన కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కవితా సురేందర్‌గౌడ్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. టీడీపీ సభ్యులు టీఆర్‌ఎస్‌లో చేరడంతో వారి బలం ఆరుకు చేరింది. టీఆర్‌ఎస్‌ తరఫున గెలుపొందిన ఇద్దరు కౌన్సిలర్లు మూడేళ్లుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. నగర పంచాయతీలో అభివృద్ధి పనులు జరగనీయకుండా ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని, కమిషనర్‌లు, ఏఈలను బదిలీ చేయిస్తున్నారని ఆరోపిస్తూ ఈనెల 17న నగర పంచాయతీ పాలకవర్గం కరపత్రంతో పాటు పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించింది. అదేరోజున జాయింట్‌ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.  

న్యాయం మీరే చెప్పండి..
తాను వేసవిలో ప్రజల దాహార్తి తీర్చేం దుకు పెండింగ్‌ అప్రూవల్‌ కింద 20 వార్డుల్లో 40 బోర్లు, 12 వార్డుల్లో పైప్‌లైన్లు వేసానని.., అల్లె చిన్నమల్లయ్య బావి నుంచి 20 లక్షల లీటర్ల నీటిని తరలించేందుకు పైప్‌లైన్‌ వేసానని.., తనకు రూ.కోటికి పైగా రావాల్సి ఉందని.., ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని.. మీరే న్యాయం చెప్పాలంటూ కాంట్రాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ కరపత్రాలు అచ్చువేయించి పట్టణంలో పంపిణీ చేశారు.

పోటీపోటీగా టీఆర్‌ఎస్‌..
కాంగ్రెస్‌ పాలకవర్గం, కాంట్రాక్టర్‌ కరపత్రాలకు పోటీగా టీఆర్‌ఎస్‌కు చెందిన కౌన్సిలర్లు సైతం ఆదివారం కరపత్రాలు పంపిణీ చేశారు. నాయకులంతా పార్టీ కండువాలు ధరించి చైర్‌పర్సన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. కాంట్రాక్టర్‌ అక్రమంగా టెండర్‌ దక్కించుకునేందుకు చైర్‌పర్సన్‌తో కుమ్మక్కయ్యాడని..,  కమిషనర్‌లను ఎమ్మెల్యే బదిలీ చేయించలేదని.., కౌన్సిల్‌ ఒత్తిళ్ల మేరకే వారు బదిలీ అయి వెళ్లారని.., జోగిపేటలో ఎనిమిదేళ్లుగా నిలిచిపోయిన ఉన్నత పాఠశాలకు ఎమ్మెల్యే రూ.1.70 లక్షలు మంజూరు చేయించారని.., పట్టణంలో ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేయించారని.., మిషన్‌ భగీరథ కారణంగా సీసీ రోడ్లు చేపట్టవద్దని ప్రభుత్వమే ఆదేశించిందని.., సింగూరు నీటిని సేద్యానికి అందించింది తమ ప్రభుత్వమేనంటూ.. కరపత్రాల్లో పేర్కొన్నారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ డీబీ నాగభూషణం, కౌన్సిలర్లు లక్ష్మణ్, భవానీ నాగరత్నంగౌడ్, ఏ.శ్రీకాంత్, సీడీసీ డైరెక్టర్‌ జైపాల్‌నాయక్, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు సీహెచ్‌.వెంకటేశం, మైనార్టీ మాజీ అధ్యక్షుడు నిజామొద్దీన్‌తో పాటు అందోలు, చౌటకూరు గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ఊరేగింపులో పాల్గొన్నారు.

కరపత్రపోరుపై సర్వత్రా ఆసక్తి..
కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ వర్గాల కరపత్రాల పంపిణీ స్థానికంగా చర్చనీయాంశమైంది. ఒకరు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, మరొకరు అభివృద్ధి పనులు జరగడం లేదంటూ కరపత్రాలు వేయడంపై ప్రజలు చర్చించుకుంటున్నారు. కరపత్రాల్లో ఎవరేం ముద్రించారో తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడే బాగుం డే అంటూ పలువురు చర్చించుకోవడం విశేషం. మొత్తానికి ఎన్నికలకు ముందే రాజకీయం రసవత్తరంగా మారింది.

మరిన్ని వార్తలు