స్త్రీపెన్నిధి

17 Jan, 2018 10:37 IST|Sakshi

తక్కువ వడ్డీతో రుణాలు

ఆర్థిక స్వావలంబన దిశగా మహిళలు

రుణాల పంపిణీ.. రికవరీలో జిల్లా టాప్‌

రాష్ట్రంలో మూడో స్థానం

సంగారెడ్డిజోన్‌ : పేద, నిరుపేదలకు స్వల్పకాలంలో అతి తక్కువ వడ్డీతో అవసరానికి అప్పు అందించడానికి మహిళలకు పెన్నిధిలా స్త్రీనిధి చేయూతనిస్తోంది. దీన్ని మహిళా సంఘాల సభ్యుల కోసం 2011 సెప్టెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. గ్రామీణ ప్రజలు వివిధ ఆర్థిక అవసరాలు, పెట్టుబడుల కోసం మైక్రో ఫైనాన్స్‌లను ఆశ్రయించి అధిక వడ్డీతో పాటు విలువైన ప్రాణాలను సైతం కోల్పోయిన ఘటనలు గతంలో అనేకం ఉన్నాయి. మైక్రో ఫైనాన్స్‌లను అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి నియంత్రించి మహిళలకు ఊరట కలిగించారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 2011లో ఏడాదికి 12.5శాతం వడ్డీతో ఎలాంటి డాక్యుమెంట్లు, ఇతర ఖర్చులు లేకుండా రుణాలు నేరుగా సభ్యుల ఖాతాల్లో జమ అయ్యేలా స్త్రీ నిధి పథకం రూపొందించారు.  సంఘంలోని సభ్యులు స్త్రీనిధి రుణం కోసం ఐవీఆర్‌ఎస్‌ పద్ధతిలో ఫోన్‌ ద్వారా నేరుగా సమాచారం అందించిన 48 గంటల్లోగా వారి ఖాతాల్లో రుణం సొమ్ములు జమ అవుతాయి. ఈ వ్యవస్థలో నగదు లావాదేవీలు ఉండకపోవడం వల్ల అవినీతికి చోటులేకుండా నేరుగా వారి ఖాతాల్లోనే జమ అవుతున్నాయి.

ఈ ఏడాది స్త్రీ నిధి రుణాలు 60 నుంచి 70శాతం ఆదాయం ఉత్పత్తికి వాడాల్సిందిగా లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. రూ. 25 వేల వరకు ఫోన్‌ ద్వారా ఆపైన రూ. లక్ష వరకు ఎన్‌ఆర్‌ఎల్‌ఎం ద్వారా దరఖాస్తు చేసిన వారంలోగా రుణాలు అందిస్తారు. మన రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం ఇటీవల 4వ సర్వసభ్య సమావేశం నిర్వహించి రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచిన సంగారెడ్డి జిల్లాకు మంత్రి జూపల్లి కృష్ణారావు చేతులమీదుగా అవార్డు అందజేశారు. జిల్లాలోని 26 మండలాల్లో, మూడు మున్సిపాలిటీల (సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్‌) పరిధిలో 21,309 ఎస్‌ఎన్‌జీ సంఘాలు నమోదు కాగా 2,32,115 మంది సభ్యులు ఉన్నారు. మొదటి ఏడాది స్త్రీ నిధి కింద సభ్యులకు రూ. లక్ష 50 వేల వరకు రుణం మంజూరు చేయగా వారు తిరిగి 24 నెలల గడువులో చెల్లించాల్సి ఉంటుంది. జీవనోపాధి పెంపుకోసం, వ్యాపారాల విస్తరణ కోసం సంఘంలోని మరో ఇద్దరు సభ్యులకు రూ.50 వేల వరకు రుణం ఇచ్చే అవకాశం ఉంది. జిల్లాలో 2017 మార్చి 31 నాటికి రూ. 67.62 కోట్ల  రుణాల వితరణ ప్రణాళిక లక్ష్యం కాగా రూ. 64.21 కోట్లను సంఘ సభ్యులకు పంపిణీ చేశారు. వీటి వల్ల 6వేల 6 సంఘాలకు లబ్ది చేకూరింది. అత్యధికంగా నారాయణఖేడ్, హత్నూర, గుమ్మడిదల, కొండాపూర్‌ మండలాల పరిధిలోని ఎస్‌హెచ్‌జీ సంఘాలు స్త్రీ నిధి రుణాలు లక్ష్యాన్ని అధిగమించి  పొందగా అత్యల్పంగా మొగుడంపల్లి, కల్హెర్, నాగల్‌గిద్ద మండలాలు నిర్ణయించుకున్న లక్ష్యాన్ని కూడా చేరుకోలేకపోయాయి.  

మూడో స్థానంతో సరి..
జిల్లా గతంలో రుణాల పంపిణీ, రికవరీలో ప్రథమ, ద్వితీయస్థానంలో ఉండేది. కానీ వెనుకబడిన ప్రాంతాల్లో సకాలంలో రుణాల రికవరీని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయలేకపోయారు. దీంతో నిర్ధేశించిన సమయానికి రికవరీలో వెనుకబడడం వల్ల సాంకేతికంగా జిల్లా రాష్ట్రస్థాయిలో మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

సమన్వయంతో సాధించాం
కలెక్టర్, డీఆర్‌డీఓ, క్షేత్రస్థాయి సిబ్బందితో ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ సమీక్షలు నిర్వహించాం. క్లస్టర్లవారీగా డీపీఎంలతో కలిసి  సమావేశాలు, ఆర్‌ఎం అనంతకిశోర్‌ ప్రోత్సాహం వల్ల రుణాల పంపిణీ,  రికవరీలోనూ మెరుగైన ఫలితాలను సాధించాం. గతంలో ఉన్న నంబర్‌ వన్‌ స్థానానికి చేరుకునేలా మరింత కృషి చేస్తాం.  – ఏపీడీ సిద్ధారెడ్డి

ఆర్థిక పురోభివృద్ధికి తోడ్పడతాయి
స్త్రీనిధి రుణాలు సకాలంలో అందించడంతోపాటు తిరిగి రికవరీ చేయడంలో సిబ్బంది, సభ్యుల పాత్ర చాలా కీలకమైంది. ఈ రుణాలను ఆదాయ ఉత్పత్తికి వినియోగిస్తే  కుటుంబాలు పురోభివృద్ధి సాధిస్తాయి. నిరుపేదలు, పేదలు, గేదెలు, పశువులు, మేకల కొనుగోలుకు వీటిని సద్వినియోగం చేసుకుంటున్నారు.   – చంద్రకళ, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు

>
మరిన్ని వార్తలు