మంజీరా కాలుష్య ధార

12 Jan, 2018 11:27 IST|Sakshi

విష రసాయనాలు మోసుకొస్తున్న నక్కవాగు

సింగూరు ఎగువనా వచ్చి చేరుతున్న వ్యర్థాలు

పీఈటీఎల్‌ ఉన్నా శుద్ధీకరణ నామమాత్రమే

పరిసర గ్రామాల్లో భూగర్భ జలాలు కలుషితం

కాలుష్య భూతం బారిన పచ్చని పొలాలు

ఆరోగ్య సమస్యలతో జనం సతమతం  

కాలుష్య నియంత్రణమండలికి ఫిర్యాదుల వెల్లువ

పారిశ్రామిక జలాలను శుద్ధి చేయకుండానే విడుదల చేస్తుండడంతో మంజీర నది కాలుష్య కాసారంగా మారుతోంది. మంజీర పరీవాహక ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం, వాటి నుంచి వెలువడే కాలుష్యాన్ని మాత్రం అరికట్టలేక పోతోంది. తరచూ తనిఖీలు నిర్వహిస్తూ, నీటి నమూనాలను సేకరించి విశ్లేషిస్తున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చెబుతున్నారు. మంజీర పరిసర గ్రామాల్లో మాత్రం పశు, మత్స్య సంపదతో పాటు పచ్చని పొలాలు కాలుష్య భూతం బారిన పడుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి.  -- సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి

మహారాష్ట్రలోని బాలాఘాట్‌ కొండల్లో పుడుతున్న మంజీర కర్ణాటక మీదుగా సంగారెడ్డి జిల్లా మనూరు మండలం గౌడ్‌గావ్‌ వద్ద రాష్ట్రంలోకి ప్రవేశిస్తోంది. మంజీర ప్రవహించే మార్గంలో కాలుష్య వ్యర్థాలు వచ్చి చేరుతుండడంతో నదీ జలాలు హానికరంగా మారుతున్నాయి. మహారాష్ట్రలో థేర్నా వాగు ద్వారా ఉస్మానాబాద్, లాతూరు ప్రాంతాల పారిశ్రామిక వ్యర్థాలు మంజీరాలోకి చేరుతున్నాయి. కర్ణాటకలోని బీదర్‌ పరిసరాల్లోని చక్కెర కర్మాగారాలు సైతం మంజీరలోకి వ్యర్థాలను విడుదల చేస్తున్నాయి. రాష్ట్రంలోకి ప్రవేశించిన తర్వాత హుగెల్లి చక్కెర కర్మాగారాం, దిగ్వాల్‌ ఔషధ కంపెనీల రసాయన వ్యర్థాలు చిల్కపల్లి చెరువు మీదుగా సింగూరు ఎగువన మంజీరలోకి చేరుతున్నాయి. గంగకత్వ పరీవాహక ప్రాంతంలో ఉన్న పలు రసాయన కంపెనీల ద్వారా కూడా నది కలుషితమవుతోంది. మంజీర బ్యారేజీ దిగువన చక్కెర, బీరు కర్మాగారం నుంచి వెలువడే కాలుష్య జలాలు నిశ్శబ్దంగా మంజీరా ప్రవాహంలో కలిసిపోతున్నాయి. వందల సంఖ్యలో రసాయన, బల్క్‌డ్రగ్‌ పరిశ్రమలు కలిగిన పటాన్‌చెరు, పాశమైలారం, గడ్డపోతారం పారిశ్రామిక వాడల నుంచి విడుదలవుతున్న విషపూరిత రసాయనలు నక్కవాగు ద్వారా మంజీరలో కలుస్తున్నాయి. ఫార్మా, పెట్రో కెమికల్, రంగులు, అద్దకం, రసాయన పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం నేరుగా భూ గర్భంలోకి వెళ్లి స్థానికంగా పశు, మత్స్య సంపదతో పాటు పచ్చని పొలాలు, మనుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మిషన్‌ భగీరథ పథకంతో పాటు సింగూరు, ఘణపురం, నిజాంసాగర్‌ తదితర ప్రాజెక్టుల ద్వారా సాగునీరు కూడా ఇస్తుండడంతో కాలుష్య ప్రభావం విస్తరించే అవకాశం ఉంది.

విషం చిమ్ముతున్న నక్కవాగు..
పటాన్‌చెరు, గడ్డపోతారం, పాశమైలారం పారిశ్రామిక వాడల నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాలు ఉసికెవాగు నుంచి నక్కవాగులోకి చేరుతున్నాయి. అక్కడి నుంచి సంగారెడ్డి మండలం ఇస్మాయిల్‌ఖాన్‌పేట శివారు గౌడిచర్ల వద్ద మంజీరలోకి వ్యర్థాలు చేరుతున్నాయి. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలను శుద్ధి చేసి వదిలేందుకు పటాన్‌చెరు ఎన్విరోటెక్‌ లిమిటెడ్‌ (పీఈటీఎల్‌) ఆధ్వర్యంలో కాలుష్య వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంటు ఏర్పాటు చేశారు. పీఈటీఎల్‌ పనితీరుపై విమర్శలు రావడంతో 2009లో పటాన్‌చెరు నుంచి మూసీ ఒడ్డున ఉన్న అంబర్‌పేట ట్రీట్‌మెంట్‌ ప్లాంటు వరకు పైప్‌లైన్‌ వేసి, రసాయన వ్యర్థాలను తరలిస్తున్నారు. పరిశ్రమల యాజమాన్యాలు మాత్రం పీఈటీఎల్‌కు వ్యర్థాలను నామమాత్రంగా తరలిస్తూ.. అవకాశం చిక్కినప్పుడల్లా వివిధ చెరువుల ద్వారా  నక్కవాగులోకి విడుదల చేస్తున్నాయి. ట్యాంకర్ల ద్వారా అక్రమంగా నక్కవాగు, మంజీరలో రసాయన వ్యర్థాలు డంప్‌ చేస్తున్న ఘటనలు పలుమార్లు వెలుగు చూశాయి. వర్షాకాలంలో విడుదలైన వ్యర్థాలతో గండిగూడెం, గడ్డపోతారం చెరువుల్లో చేపలు మృత్యువాత పడగా, పరిశ్రమల నుంచి రూ.1.30 కోట్ల పరిహారం మత్స్యకారులకు చెల్లించారు. నక్కవాగులో చేరుతున్న వ్యర్థాలతో పరిసర గ్రామాల్లో భూగర్భ జలం కలుషితమవుతోంది. పరిసర గ్రామాలవాసులు తీవ్ర దుర్గంధం పీల్చుకుంటుండగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.


భూగర్భ జలాలు పూర్తిగా కలుషితం
మంజీర పరీవాహక ప్రాంతంలో ఉన్న హత్నూర మండలం గుండ్ల మాచునూరులో రసాయన పరిశ్రమలు ప్రత్యేక ఔట్‌లెట్లు ఏర్పాటు చేసి రసాయన వ్యర్థాలను వదులుతున్నాయి. ఇవి భూగర్భంలోకి చేరుకుని తాగు, సాగునీటిని కాలుష్యం చేస్తున్నాయి. దిగువన ఉన్న మంజీరలోకి కాలుష్య జలాలు చేరుకుంటుండడంతో పరిసర గ్రా మాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట పొ లా లను నష్టపోతున్నా పరిహారం అందించడంలో అటు అధికారులు, ఇటు పరిశ్రమల యాజమాన్యాలు ముందుకు రావడం లేదు. – కే.భద్రేశ్, వ్యవస్థాపకుడు, మెదక్‌ పర్యావరణ పరిరక్షణ సమితి


నమూనాలు సేకరిస్తున్నాం
నక్కవాగు మంజీరలో కలిసే చోట గౌడిచర్ల, బచ్చుగూడెం తదితర గ్రామాల్లో తరచూ నీటి నమూనాలు సేకరిస్తున్నాం. పుల్కల్‌ మండలం శివ్వంపేటలోని ఓ బ్రూవరేజెస్‌ ఫ్యాక్టరీ నదిలోకి కాలుష్య జలాలను వదులుతుందనే ఫిర్యాదులు రావడంతో గతంలో మూసివేతకు నోటీసులు కూడా జారీ చేశాం. దిద్దుబాటు చర్యలు తీసుకోవడంతో తిరిగి తెరిచేందుకు అనుమతులు ఇచ్చాం. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల మేరకు ఎప్పటికప్పుడు నీటి పరీక్షలు నిర్వహిస్తూ.. కాలుష్యాన్ని కట్టడి చేస్తున్నాం. – భద్రగిరీష్, ఈఈ, టీఎస్‌పీసీబీ, సంగారెడ్డి జిల్లా


జన్మస్థానం         : బాలాఘాట్‌ కొండలు (మహారాష్ట్ర)
ప్రవహించే మార్గం     : మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ
మంజీర నది పొడవు     : 724 కి.మీ
పరివాహక ప్రాంతం      : 30,844 చ.కి.మీ
ప్రధాన ప్రాజెక్టులు     : సింగూరు, ఘణపురం, నిజాంసాగర్‌
గోదావరిలో కలిసే చోటు     : కందకుర్తి (నిజామాబాద్‌ జిల్లా)

మరిన్ని వార్తలు