ఆరుగాలం చెమటోడ్చిన వరి రైతు అతలాకుతలం..

6 Feb, 2018 17:11 IST|Sakshi

వరి పంటలను తొలుస్తున్న మొగిపురుగు

ఖరీఫ్‌లో అగ్గితెగులు దాడితో రైతన్న ఆగమాగం

ఎన్ని మందులు వాడినా ఫలితం శూన్యం

వరుస నష్టాలతో అన్నదాతల ఆందోళన 

ప్రభుత్వమే ఆదుకోవాలంటున్న కర్షకులు

ఆరుగాలం కష్టపడితే తప్ప నాలుగు మెతుకులు నోట్లోకి వెళ్లలేని పరిస్థితి అన్నదాతది. అతివృష్టి, అనావృష్టి అన్నింటినీ తట్టుకుని సాగు చేస్తుంటే రబీలో మొగిపురుగు రూపంలో శని దాపురించింది. ఖరీఫ్‌లో అగ్గి తెగులు, ఇప్పుడు మొగిపురుగు... ఇలా వరుస విపత్తులతో రైతన్న కోలుకోలేకపోతున్నాడు. ఏ మందులు పిచికారీ చేసినా ఫలితం శూన్యం. దీంతో వరిసాగు చేస్తున్న రైతన్న పరిస్థితి దయనీయంగా మారింది. ఎలాగైనా ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు, రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు.

మెదక్‌జోన్‌: అతివృష్టి.. అనావృష్టి.. విపత్తులు.. వాతావరణ మార్పులు..చీడపీడలు  వీటిన్నంటితో అన్నదాతలు ఎప్పుడికప్పుడు కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతూనే ఉన్నాడు. ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగుచేసిన పంటలకు అగ్గితెగులు సోకి 40 శాతం మేర వరి పంట చేతికందకుండా పోయింది. దీంతో కనీసం పెట్టుబడి కూడా చేతి కందని పరిస్థితి. కనీసం రబీలోనైనా సాగుచేసిన పంటలతో ఖరీఫ్‌లో జరిగిన నష్టాన్ని పూడ్చుకుందామంటే   మాయదారి మొగిపురుగు దాడితో పంటలన్ని సర్వనాశనం అవుతున్నాయి. పచ్చని  పైర్లతో కళకళలాడాల్సిన పంటపొలాలు పురుగు దాడితో వెలవెలబోతున్నాయి. ఈ పురుగు వరి కర్ర మొదళ్లనే కొరికి రైతన్నకు తీవ్ర నషాన్ని మిగిలిస్తుంది.

18 వేల హెక్టార్లు మాత్రమే..
జిల్లా వ్యాప్తంగా సాధారణంగా 20 వేల హెక్టార్లలో వరి  సాగు చేయాల్సి ఉండగా ఖరీఫ్‌లో సరైన వర్షాలు లేక  చెరువులు, కుంటల్లో నీరు లేకపోవడంతో బోరుబావుల్లో వచ్చే కొద్దిపాటి నీటితో  ఇప్పటి వరకు 18 వేల హెక్టార్లు మాత్రమే సాగుచేశారు.   దీనికి తోడు వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తుండంతో భూగర్భజలాలు  గణనీయంగా తగ్గిపోయాయి.   వేసిన పంటలైనా చేతికి వస్తాయని ఏదురు చూస్తున్న రైతన్నకు మొగిపురుగు రూపంలో ఎదురుదాడి జరుగుతోంది. దీంతో రైతులు వేలాది రైపాయల అప్పులు చేసి  ఎన్నో రకాల మందులను స్ప్రే చేస్తున్నా ఫలితం లేకుండా పోతుంది. దీంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రెండేళ్లుగా నష్టాలే...
గత రెండు  సంవత్సరాలుగా రైతులు తీవ్రంగా నష్టాల పాలవుతున్నారు. 2016లో ఖరీఫ్‌లో పంటలు చేతికందే సమయంలో భారీ వర్షాలతో పంటలన్ని నీటి పాలయ్యాయి. ఈ విపత్తు కారణంగా సుమారు  లక్షకు పైగా ఎకరాల్లో వరి పైరు  నీట మునిగింది. 2017లో సరైన వర్షాలు కురవక చెరువులు, కుంటలు నెర్రలు బారాయి. బోరుబావుల ఆధారంగా సాగుచేసిన పంటలు చేతికందే సమయంలో  అగ్గితెగులు సోకి  40 శాతం పంటలు  చేతికందకుండా పోయాయి.  ప్రస్తుత  రబీలోనైనా   పంటలను కాస్తరట లభిస్తుందేమోనని ఆశించిన రైతాంగానికి మొగిపురుగు రూపంలో మరో విపత్తు వచ్చిపడింది.  ప్రతి పొలంలోనూ ఈ మాయదారి తెగుళ్లు సోకి పంటను నాశనం చేస్తుంది.

రెండుసార్లు మందులు కొట్టిన..
నేను ఎకరన్నర పొలంలో వరి సాగు చేశాను. పంట సాగు చేసి నెలన్నర అవుతోంది. మొగిపురుగు తగిలి పంటనంతా మొదళ్లలో తినేస్తుంది. దీంతో విషగుళికలు చల్లాను.  ఏమాత్ర ఫలితం లేకపోవటంతో రెండు సార్లు పైమందులను సైతం పిచికారీ చేశాను. అయినా ఏమాత్రం తగ్గడం లేదు. ప్రభుత్వమే ఆదుకోవాలి.     –నర్సింలు, రైతు, జంగరాయి 

నివారణ కోసం..
మొగిపురుగు నివారణకోసం నాటు వేయగానే 20 నుంచి 25 రోజుల్లో ఎకర పొలంలో  4 నుంచి 5 కిలోల త్రీజీ లేదా 4జీ గులికలు చల్లాలి.  ఒకవేల చల్లకుంటే లీటర్‌ నీటిలో 2 గ్రాముల కార్బన్‌ హైడ్రోక్లోరైడ్‌ పౌడర్‌ను కలిపి పిచికారీ చేయాలి. లేదా క్లోరోపైరిఫాస్‌ 2ఎంఎల్‌ మందును 1లీటర్‌ నీటిచొప్పున కలిపి పిచికారీ చేయాలి. లేదా మొనోక్రోటోఫాస్‌  మందును  లీటర్‌కు 1.8 ఎంల్‌ చొప్పున కలిపి పిచికారీ చేయాలి.    
 –పరుశరాం, జిల్లా వ్యవసాయాధికారి
 

మరిన్ని వార్తలు