మిగిలింది ఒకరిద్దరు నేతలే!

18 Feb, 2018 10:23 IST|Sakshi

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో టీడీపీ కనుమరుగు!

ఇతర పార్టీల్లోకి వరుస వలసలతో పార్టీ కుదేలు

నాలుగు నియోజకవర్గాల్లో లీడర్, కేడర్‌ కరువు

మిగిలిన ఒకరిద్దరూ కొనసాగేది అనుమానమే

సొంత శక్తితో టికెట్‌ను ఆశిస్తున్న కీలక నేతలు

జిల్లాలో సుమారు రెండు దశాబ్దాల పాటు బలమైన రాజకీయ శక్తి. సర్పంచ్‌లు, ఎంపీపీలు మొదలుకుని ఎమ్మెల్యే, ఎంపీ దాకా ఆ పార్టీ నేతలే రాజ్యమేలారు. 2004, 2009 సాధారణ ఎన్నికల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ వ్యూహంతో చావు దెబ్బ తగిలింది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నేపథ్యంలో క్రమంగా ప్రాభవాన్ని కోల్పోయి కనుమరుగైంది. ఇప్పుడా పార్టీకి లీడర్‌ లేడు.. కేడరూ లేదు.. మిగిలిందల్లా ఒకరిద్దరు సొంత బలం కలిగిన నేతలు. వచ్చే ఏడాది జరిగే సాధారణ ఎన్నికల నాటికి.. మిగిలిన ఆ ఒకరిద్దరూ పార్టీలో ఉంటారా..? వేరే దారి చూసుకుంటారా..? ఇదీ ఉమ్మడి మెదక్‌ జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి. – సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పార్టీ ఆవిర్భావం నుంచి సుమారు రెండు దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మెదక్‌ జిల్లా రాజకీయాల్లో బలీయమైన శక్తిగా నిలిచింది. ప్రస్తుత సీఎం కేసీఆర్‌తో పాటు అనేక మందికి రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది. ఎంతో మంది నేతలు, కార్యకర్తలు గ్రామస్థాయి నుంచి పార్లమెంటు స్థాయి వరకు అనేక పదవులు దక్కించుకున్నారు. 2004 సాధారణ ఎన్నికల్లో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వ్యూహంతో అసెంబ్లీ, పార్లమెంటులో జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ పక్షాన ఒక్కరికీ ప్రాతినిధ్యం దక్కలేదు. 

క్షేత్ర స్థాయిలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఉన్నా తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేపథ్యంలో చాలా మంది టీఆర్‌ఎస్‌ గూటికి చేరుకున్నారు. 2009 సాధారణ ఎన్నికల్లో మెదక్‌ అసెంబ్లీ స్థానం మినహా ఎక్కడా టీడీపీ విజయం సాధించలేదు. 2014లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నేపథ్యంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలో నలుగురు జెడ్పీటీసీ సభ్యులు, 102 మంది ఎంపీటీసీ సభ్యులు ఎన్నికయ్యారు. 

ఆ తర్వాత అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలోకి వలసలు ఊపందుకోవడంతో ప్రస్తుతం కేవలం పటాన్‌చెరు జెడ్పీటీసీ సభ్యుడు శ్రీకాంత్‌గౌడ్‌ మాత్రమే పార్టీలో మిగిలారు. జహీరాబాద్, నారాయణఖేడ్, గజ్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకరిద్దరు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు పార్టీలో కొనసాగుతున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో టీటీడీపీ కార్య నిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచి బట్టి జగపతి, శశికళ యాదవరెడ్డి తదితరులు కాంగ్రెస్‌లో చేరారు.

మిగిలింది ఒకరిద్దరు నేతలే!
ప్రస్తుతం ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలో సొంత శక్తి కలిగిన ఒకరిద్దరు నేతలే మిగిలారు. దశాబ్దకాలంగా పార్టీ నుంచి టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లోకి వలసలు సాగుతున్న నేపథ్యంలో.. సాధారణ ఎన్నికల నాటికి వీరిలో ఎవరు పార్టీలో ఉంటారో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. దుబ్బాక, నర్సాపూర్, సంగారెడ్డి, అందోలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో చెప్పుకోదగిన నాయకులు లేకపోవడం పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది. 
 సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా గుండు భూపేశ్‌ వ్యవహరిస్తుండగా, మాజీ కౌన్సిలర్‌ దరిపల్లి చంద్రం వంటి ఒకరిద్దరు మాత్రమే ప్రస్తుతం పార్టీలో కొనసాగుతున్నారు. పార్టీ పరంగా క్షేత్రస్థాయిలో కార్యక్రమాలేవీ నిర్వహించే పరిస్థితి లేదు.

  • 2009 సాధారణ ఎన్నికల్లో గజ్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌పై పోటీ చేసిన ఒంటేరు ప్రతాప్‌రెడ్డి టీడీపీలోనే కొనసాగుతున్నారు. ప్రస్తుతం పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ప్రతాప్‌రెడ్డి భవిష్యత్తు రాజకీయ ప్రస్థానంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం సాగింది. ఇటీవల సుమారు నెల రోజుల పాటు జైలులో గడిపిన ప్రతాప్‌రెడ్డి విడుదల అనంతరం ఒకటి రెండు గ్రామాల్లో పర్యటించి.. ఆ తర్వాత స్తబ్దుగా ఉంటున్నారు.  
  • దుబ్బాక నియోజకవర్గంలో ఇల్లెందుల రమేశ్‌ మినహా.. పార్టీ పేరు చెప్పుకునే కార్యకర్తలు కూడా కనిపించడం లేదు. పార్టీ దాదాపు తుడిచి పెట్టుకుపోయిన పరిస్థితి నియోజకవర్గంలో కనిపిస్తోంది.
  • మెదక్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన మున్సిపల్‌ మాజీ  చైర్మన్‌ బట్టి జగపతి.. రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌ గూటికి చేరుకున్నారు. ప్రస్తుతం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన ఏకే గంగాధర్‌రావు పల్లెపల్లెకూ టీడీపీ పేరిట పార్టీ ఉనికిని చాటేందుకు ప్రయత్నిస్తున్నారు.
  • నర్సాపూర్‌ అసెంబ్లీ నియోజవర్గంలో హత్నూర మండలం దేవులపల్లికి చెందిన రఘువీరారెడ్డి టీడీపీ నేతగా చెలామని అవుతున్నా.. పార్టీ కార్యకలాపాలేవీ జరగడం లేదు.
  • పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గ అవిర్భావం నుంచి టీడీపీ బలమైన శక్తిగా ఉన్నా.. వలసల మూలంగా బలహీన పడింది. 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సపానదేవ్‌ టీఆర్‌ఎస్‌లో చేరగా, పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా పనిచేసిన శశికళ యాదవరెడ్డి.. రేవంత్‌తో పాటు కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిషత్‌లో టీడీపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక జెడ్పీటీసీ సభ్యుడు గడీల శ్రీకాంత్‌గౌడ్‌ జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా మారారు. పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్‌ ఆశిస్తున్న శ్రీకాంత్‌గౌడ్‌ త్వరలో పార్టీ జిల్లా అధ్యక్షుడిగానూ నియమితులయ్యే అవకాశం ఉంది. శ్రీకాంత్‌గౌడ్‌తో పాటు ఎడ్ల రమేశ్, మాణిక్యప్రభు వంటి ఒకరిద్దరు నేతలు పార్టీలో కొనసాగుతున్నారు.
  • సంగారెడ్డి నియోజకవర్గంలో టీడీపీ పూర్తి నిస్తేజంగా మారగా, జెడ్పీ మాజీ చైర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్, బందన్న గౌడ్‌ వంటి ఒకరిద్దరు నేతలు నామ్‌కే వాస్తేగా కొనసాగుతున్నారు.
  • అందోలు నియోజకవర్గానికి రాష్ట్ర స్థాయి నేత శ్రీశైలం ఇన్‌చార్జిగా కొనసాగుతున్నా పార్టీ కార్యకలాపాలేవీ సాగడం లేదు.
  • 2009, 2014 సాధారణ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నరోత్తమ్‌ పల్లెపల్లెకూ టీడీపీ పేరిట పార్టీ ఉనికిని చాటే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ నుంచి గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన గుండప్ప, దశరథరెడ్డి పార్టీలో ఉన్నా.. క్రియాశీల కార్యక్రమాల్లో అరుదుగా కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో జహీరాబాద్‌ లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసిన మదన్‌మోహన్‌ రావు పార్టీ పరంగా ఎక్కడా కనిపించడం లేదు.
  • మాజీ ఎమ్మెల్యే విజయపాల్‌రెడ్డి నారాయణఖేడ్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ ఉనికిని కాపాడే ప్రయత్నం చేస్తున్నా.. 2016లో జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా జరిగిన వలసలు పార్టీని పూర్తిగా బలహీన పరిచాయి. 
  • సిద్దిపేట జిల్లాలో అంతర్భాగంగా ఉన్న చేర్యాల, హుస్నాబాద్, బెజ్జంకి ప్రాంతాల్లోనూ టీడీపీ నామ మాత్ర ఉనికి కూడా కనిపించడం లేదు.   
మరిన్ని వార్తలు