రచ్చ

20 Jan, 2018 08:35 IST|Sakshi

సింగూరు నీటిపై గరంగరం చర్చ

శ్రీరాంసాగర్‌కు తరలింపుపై పరస్పర విమర్శలు

నల్లవాగు క్రాప్‌ హాలీడేపై వాగ్వాదం

డీఈఓ విజయకుమారి వైఖరిపై ఆగ్రహం

వాడివేడిగా ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిషత్‌ సమావేశం

జిల్లా పరిషత్‌ సాధారణ సర్వసభ్య సమావేశం శుక్రవారం ఆద్యంతం వాడివేడిగా సాగింది. సింగూరు ప్రాజెక్టు నుంచి శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టుకు నీటి తరలింపుపై అధికార టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ సభ్యులు పరస్పరం విమర్శలకు దిగారు. నల్లవాగు ప్రాజెక్టు పరిధిలో క్రాప్‌ హాలీడేపై మొదలైన చర్చ వాగ్వాదానికి దారి తీసింది. డీఈఓ వ్యవహారశైలిని సభ్యులు సభ దృష్టికి తెచ్చారు. ఫోన్‌ చేసినా కనీస స్పందన ఉండడం లేదని మండిపడ్డారు. గొర్రెల ఇన్సూరెన్స్‌ అమలుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ రాజమణి మురళీయాదవ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశానికి డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి, మెదక్, జహీరాబాద్‌ ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పా టిల్, ఎమ్మెల్సీలు భూపాల్‌రెడ్డి, రాములు నాయక్, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, బాబూమోహన్, మదన్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ టి.రవి హాజరయ్యారు. –సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి

నీటి పారుదల శాఖపై జరిగిన చర్చ సందర్భంగా నల్లవాగు ప్రాజెక్టు పరిధిలో క్రాప్‌ హాలీడే ఇవ్వడాన్ని నారాయణఖేడ్‌ ఎంపీపీ సంజీవరెడ్డి ప్రశ్నించారు. క్రాప్‌ హాలీడే తీర్మానాలపై ఓ రాజకీయ పార్టీ కార్యకర్తలే సంతకాలు చేశారని ఆరోపించారు. సింగూరు ప్రాజెక్టు పరిధిలో 8వేల ఎకరాలకు మాత్రమే సాగు నీరు ఇస్తున్నారని, నీటిని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టుకు తరలించడాన్ని  ప్రశ్నించారు. నీళ్ల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్‌ పార్టీకి లేదని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, అందోలు ఎమ్మెల్యే బాబూమోహన్‌ విమర్శించారు. సింగూరు పరిధిలో 50 వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నామని బాబూమోహన్‌ ప్రకటించారు. ఈ దశలో జోక్యం చేసుకున్న డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి జిల్లా అవసరాలకు అవసరమైన నీటిని నిల్వ చేస్తూనే.. ఇతర ప్రాంత రైతులను ఆదుకునేందుకు సింగూరు నీటిని విడుదల చేశామన్నారు. కాంగ్రెస్‌ హయాంలో సింగూరు నీటి విడుదలకు ఘణపూర్‌ ప్రాజెక్టు రైతులు మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించిన విషయాన్ని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా భవిష్యత్తులో సింగూరుకు నీటిని తరలిస్తామన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ జెడ్పీటీసీ సభ్యులు ప్రభాకర్, శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ సభ్యులు వాగ్వాదానికి దిగారు.

డీఈఓ తీరుపై సభ్యుల మండిపాటు..
జిన్నారం మండలం బొల్లారం పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఫిర్యాదు అందినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని జిన్నారం ఎంపీపీ కొలన్‌ రవీందర్‌రెడ్డి ప్రశ్నించారు. తాము ఫోన్‌ చేసినా డీఈఓ విజయకుమారి స్పందించడం లేదని మండిపడ్డారు. ఎంపీపీ ఫోన్‌ నంబరు తన వద్ద లేదని డీఈఓ వ్యాఖ్యానించడంతో సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిర్యాదు అందినా చర్యలు తీసుకోకపోవడంపై కలెక్టర్‌ ఎందుకు మౌనంగా ఉన్నారని ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి ప్రశ్నించారు. గతంలో జహీరాబాద్‌ మండలంలో కొందరు ఉపాధ్యాయుల వ్యవహారంపై ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ఎమ్మెల్సీ రాములు నాయక్‌ నిలదీశారు. ప్రజా ప్రతినిధులకు డీఈఓ విజయకుమారి కనీసం ఫోన్‌లో కూడా అందుబాటులో ఉండడం లేదని సభ్యులు సభ దృష్టికి తెచ్చారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాల కూల్చివేతపై కొల్చారం జెడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన డీఎస్సీ నిర్వహణపై నారాయణఖేడ్‌ ఎంపీపీ సంజీవరెడ్డి ప్రస్తావించారు.

సబ్సిడీ పథకం కింద పంపిణీ చేస్తున్న గొర్రెలు వేల సంఖ్యలో మృత్యువాత పడుతున్నా.. వందల సంఖ్యలో మాత్రమే ఇన్సూరెన్స్‌ క్లెయింలు ఇవ్వడంపై జరిగిన చర్చలో కాంగ్రెస్‌ జెడ్పీటీసీ సభ్యులు ప్రభాకర్, అంజయ్య, టీడీపీ సభ్యుడు శ్రీకాంత్‌గౌడ్‌ ప్రశ్నించారు. గొర్రెల రీ సైక్లింగ్, పశు వైద్య సేవలు తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. లక్ష్యం మేరకు గొర్రెల పంపిణీ జరగాలని డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గొర్రెల పథకం ప్రవేశ పెట్టిన సీఎంను అభినందిస్తూ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ తీర్మానం ప్రతిపాదించారు. సబ్సిడీ గొర్రెలు అమ్ముకునే లబ్ధిదారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని సంగారెడ్డి, మెదక్‌ జిల్లా కలెక్టర్‌ మాణిక్కరాజ్‌ కణ్ణన్‌ స్పష్టం చేశారు.

ఆర్‌సీపురం మండలంలో రెండు అదనపు పీహెచ్‌సీలు మంజూరు చేయాలని ఎంపీపీ యాదగిరి యాదవ్‌ కోరారు. వైద్యులు అందుబాటులో ఉండడం లేదని చేగుంట ఎంపీపీ అల్లి రమ వ్యాఖ్యానించారు. కానుకుంట పీహెచ్‌సీలో వైద్యులను నియమించాలని జిన్నారం ఎంపీపీ రవీందర్‌రెడ్డి కోరారు. ఇంటి వద్దే ప్రసవాలు జరగడాన్ని పటాన్‌చెరు జెడ్పీటీసీ సభ్యుడు శ్రీకాంత్‌గౌడ్‌ లేవనెత్తారు. వైద్య, ఆరోగ్య రంగంలో ప్రభుత్వ కృషిని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ ప్రశంసించారు. దశల వారీగా సంగారెడ్డి, నర్సాపూర్, జహీరాబాద్‌ ఆస్పత్రులకు అంబులెన్స్‌లు ఇచ్చేందుకు ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి అంగీకరించారు.


ఈ ఏడాది మార్చి 11న పట్టాదారు పాసుపుస్తకాలు అందజేస్తామని డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి ప్రకటించారు.

ట్రాక్టర్లు, వరికోత యంత్రాల పంపిణీలో ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీల సిఫారసులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి కోరగా, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

శివ్వంపేట మండలం నవాబుపేటలో 2 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్‌ నిర్మించాలని మెదక్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రాగౌడ్‌ కోరారు.

మిషన్‌ భగీరథ, విద్యుత్, పౌర సరఫరాల శాఖలకు సంబంధించిన అంశాలపై చర్చ జరిగింది. నిత్యావసరాల పంపిణీలో ఈ పాస్‌ వి ధానంలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించాల్సిందిగా డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మిషన్‌ భగీరథ, విద్యుత్‌ విభాగాలపై జరిగిన చర్చలో కొండాపూర్‌ ఎంపీపీ విఠల్, పటాన్‌చెరు జెడ్పీటీ సీ సభ్యుడు శ్రీకాంత్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు