యథేచ్ఛగా ఇటుక బట్టీలు

2 Feb, 2018 20:01 IST|Sakshi

అసైన్డ్‌ భూముల్లోనే ఇటుక బట్టీలు ఏర్పాటు చేస్తున్న వ్యాపారులు

రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్‌ వినిగించుకుంటున్న వైనం

అన్ని తెలిసినా పట్టించుకోని రెవెన్యూ, ట్రాన్స్‌కో అధికారులు

మేడ్చల్‌ : రైతుల బలహీనతలు, ఆర్థిక సంపాదనలు అంతంత మాత్రంగా ఉండటంతో వాటిని ఆసరా చేసుకున్న ఇటుక బట్టీల వ్యాపారులు మేడ్చల్‌ డివిజన్‌లోని మేడ్చల్, కీసర, శామీర్‌పేట్, మేడ్చల్‌ శివారు మండలం కుత్బుల్లాపూర్‌ మండలాల్లో వివిధ గ్రామాల్లో పేదలకు కేటాయించిన అసైన్డ్‌ భూముల్లోనే ఇటుక బట్టీలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం రైతుల పంట సాగుకు ఉచిత కరెంట్‌ సరఫరా చేస్తుండగా వ్యాపారులు ఇటుకల తయారీకి ఉచిత విద్యుత్‌ను అక్రమంగా వాడుతున్నారు. డివిజన్‌ మండలాల్లో ఇటుక బట్టీల వ్యాపారం యథేచ్చగా కొనసాగుతున్నా రెవెన్యూ, ట్రాన్స్‌కో శాఖ అధికారులు మామూళ్ల మాయలో కళ్లకు గంతలు కట్టుకున్నారు. ప్రభుత్వం పేదల బతుకుదెరువు కోసం ఇచ్చిన అసైన్డ్‌ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా కొందరు వ్యాపారులు వీటిని ఏర్పాటు చేసి లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు.  

వంద ఎకరాల అసైన్డ్‌ భూముల్లో....  
మేడ్చల్‌ మండలంలోని గౌడవెళ్లి, శ్రీరంగవరం, బండమాదారం, రాయిలాపూర్, గుండ్లపోచంపల్లి, నియోజకవర్గంలోని కీసరతో పాటు యాద్గార్‌పల్లి, తిమ్మాయిపల్లి, కరీంగూడ,భోగారం, శామీర్‌పేట మండలం ఉద్దెమర్రి, అలియాబాద్, జవహర్‌నగర్, కుత్బుల్లాపూర్‌ మండలం నాగులూర్, దుండిగల్‌ గ్రామాల పరిధిలో దాదాపు 300 ఎకరాల భూములను ఇటుక బట్టీల కోసం వినియోగిస్తున్నారు. ఇందులో 100 ఎకరాల వరకు అసైన్డ్‌ భూముల్లో ఇటుక బట్టీలు ఉన్నాయి. ప్రస్తుత నిర్మాణ రంగం పెరగడంతో పాటు హైదరాబాద్‌ నగర శివారు ప్రాంతాలైన మేడ్చల్, కీసర, శామీర్‌పేట్‌ మండలాల్లో ఇటుకల వ్యాపారానికి డిమాండ్‌ పెరిగింది. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు ప్రైవేట్, ప్రభుత్వ అసైన్డ్‌ పొలాల్లో బట్టీలను ఏర్పాటు చేస్తున్నారు.

దుర్వినియోగం అవుతున్న ఉచిత విద్యుత్‌
ఇటుక బట్టీల నిర్వాహకులు వ్యవసాయ బోర్ల నీటినే వాడుతున్నారు. దీంతో ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అందిస్తున్న ఉచిత విద్యుత్‌ దుర్వినియోగమవుతుంది. డివిజన్‌లో సుమారు 300 వరకు ఇలా ఇటుక బట్టీలను నిర్వహిస్తున్నారు. ఇందులో 90 శాతం వరకు అక్రమంగా విద్యుత్‌ను వాడుతున్నారు. ఇటుకల తయారీకి పొలాల్లో ఉండే బోర్ల నుంచి బట్టీల వరకు పైప్‌లైన్‌ల వేసుకుంటున్నారు. కొందరైతే బట్టీల వద్ద ఎకంగా కాలువలు తవ్వేస్తున్నారు. ప్రభుత్వ ఆధాయానికి గండీ కొడుతున్నా అధికారులు మాత్రం ఏమీ ఎరగనట్లు వ్యవహరించడం గమనార్హం.

అక్రమార్కులకు అధికారుల అండదండలు  
ఇటుక బట్టీల వ్యాపారంలో అక్రమార్కులకు గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు ఉన్న కొంతమంది అధికారులు అక్రమ వ్యాపారాన్ని పెంచి ప్రోత్సహిస్తున్నారు. గ్రామాల్లో ఉండే రెవెన్యూ అధికారులకు ఏవి అసైన్డ్‌ భూములో ఏవి పట్టా భూములో ఖచ్చితంగా తెలుసు. కానీ అసైన్డ్‌ భూముల్లో ఇటుక బట్టీలు నడుస్తున్నా పట్టించుకోరు. గ్రామాల రెవెన్యూ అధికారులు బట్టీల వ్యాపారులతో నెలకు కొంత అమౌంట్‌ ఇవ్వాలని వ్యాపారం ప్రారంభంకాక ముందే మాట్లాడుకుంటున్నారని పలువురు బహీరంగంగానే అంటున్నారు.

ట్రాన్స్‌కో వారికి కాసుల పంట  
ఇటుక బట్టీల వ్యాపారం ట్రాన్స్‌కో అధికారులకు కాసుల పంటగా మారింది. గ్రామాల్లో ఉచిత కరెంట్‌ బోరు నుంచి నీరు అందెలా చూసేది కరెంటోళ్లే. పేరుకు ఒక చోట కమర్షియల్‌ మీటర్‌ పెట్టి మిగతాదంతా ఉచిత కరెంటును వాడుకుంటున్నారు. విద్యుత్‌ సిబ్బందికి అన్ని తెలిసినా వారికి ముట్టాల్సింది ముట్టడంతో అక్రమ వ్యాపారులకు అండగా నిలబడుతున్నారని స్థానికులు అనుకుంటున్నారు. తాము ఉన్నామని చెప్పుకునేందుకు అప్పుడప్పుడు విజిలెన్స్‌ అధికారులతో కలిసి దాడులు చేసి నామమాత్రపు అపరాధ రుసుములు విధిస్తున్నారు. 

మరిన్ని వార్తలు