మందలు మండికే!

18 Jan, 2018 11:10 IST|Sakshi

రీసైక్లింగ్‌ మాదిరి సబ్సిడీ జీవాల విక్రయం

ఇచ్చిన వారంలోపే అమ్మేస్తున్న గొల్లకురుమలు

ప్రభుత్వం పంపిణీ చేసిన వాటిలో సగానికిపైగా మాయం

బ్రోకర్ల అవతారమెత్తిన కర్ణాటకవాసులు

పరిగి : గొల్లకురుమలకు పంపిణీ చేస్తున్న గొర్రెల పంపిణీలో గోల్‌మాల్‌ జరుగుతోంది...తెచ్చిన జీవాలను పంపిణీ చేయడం.. ఆవెంటనే అమ్మటం.. మళ్లీ వాటినే పంపిణీ చేయడం.. తిరిగి మండికి తరలించడం.. ఇలా పంపిణీ ప్రక్రియ మొత్తం రీ సైక్లింగ్‌ రూపంలో జరుగుతుందే తప్ప..  ఏమాత్రం పారదర్శకంగా  లేదు..  గొల్లకుర్మలకు రాయితీపై గొర్రెల యూనిట్లు పంపిణీ చేయటం ద్వారా వారికి ఉపాధి కల్పించటంతో పాటు ఆర్థిక స్వావలంభన అందించాలనే ప్రభుత్వం లక్ష్యం పూర్తిగా నీరుగారి పోతోంది. కొన్ని గ్రామాల్లో పంపిణీ చేసిన జీవాల్లో ఒకటి రెండు యూనిట్లు మాత్రమే పోషించుకుంటుండగా .. మరి కొన్ని గ్రామాల్లో మొత్తం యూనిట్లను  కొన్న చోటæనుంచి పక్కకు రాగానే విక్రయించి చేతిలో డబ్బులు పట్టుకుని వస్తున్నారు.  జిల్లాలో 22,025 యూనిట్లు పంపిణీ చేయాలని పశు సంవర్ధక శాఖ అధికారులు గుర్తించగా  మొదటి విడతలో 10,954 యూనిట్లు, రెండో విడతలో 11,071 యూనిట్లు పంపిణీ  చేయాలి. కాగా ఇప్పటివరకు 4,053 యూనిట్ల గొర్రెలు జిల్లాలో పంపిణీ చేశారు. ఒక్కో యూనిట్‌కు రూ.1.10 లక్షల ధర నిర్ణయించిన ప్రభుత్వం రూ.30 వేలు రైతు వాటాగా చెల్లించాలి. మిగతా రూ.80 వేలు ప్రభుత్వం రాయితీపై అందిస్తోంది. ఈ డబ్బులతో ఒక్కో లబ్ధిదారుడికి 21 గొర్రెలు పంపిణీ చేస్తోంది. వీటికి బీమా కూడా ఈ డబ్బుల్లో నుంచే చేస్తారు.

కొంటే రూ.1.10లక్షలు.. విక్రయిస్తే రూ.70 వేలు
ప్రభుత్వం రూపొందించిన నిబంధనల ప్రకారం పంపిణీ చేసిన యూనిట్‌ గొర్రెలు కనీసం ఓ ఏడాది వరకైనా షోషించాలి. వాటిని పునరుత్పత్తి చేసి వాటికి పుట్టిన పిల్లలను విక్రయిస్తే గొల్ల కురుమలు ఆర్థికంగా ఎదుగుతారని ప్రభుత్వ ఆశయం. కానీ ఇది నెరవేరేటట్టు కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలో పూర్తి విరుద్ధంగా జరుగుతోంది.  
పంపిణీ చేస్తున్న గొర్రెలు కొన్నిచోట్ల ఇళ్లకు వచ్చిన వారంలోపు చెవులకు కట్టిన ట్యాగ్‌లు కత్తిరించి విక్రయిస్తున్నారు.
మరికొన్ని చోట్ల ఇళ్లకు చేరకుండానే అక్కడికక్కడే విక్రయించి వస్తున్నారు.  
కొందరు కర్ణాటకకు చెందిన బ్రోకర్లు ఈ తతంగం నిర్వహిస్తున్నారని సమాచారం. వీరికి పశు వైద్యులు వాటాలు తీసుకుని సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  
ఒక్కో యూనిట్‌కు రూ.1.10 లక్షలు ఖర్చు చేసి లబ్ధిదారులకు ప్రభుత్వం పంపిణీ చేస్తుండగా బ్రోకర్ల అవతారమెత్తిన కొందరు ఆ గొర్రెలు ఆ వెంటనే రూ.70 వేలు చెల్లించి తీసుకెళ్తున్నారు.  
కొన్న పది నిమిషాలకే ఆ యూనిట్‌ గొర్రెల ధర రూ.30 వేలు తగ్గించి బ్రోకర్ల తమ మాయాజాలం ప్రదర్శిస్తున్నారు.
మళ్లీ అవే గొర్రెలకు ట్యాగ్‌లు తగిలించి లబ్ధిదారులకు విక్రయిస్తున్నారు. ఇలా గొర్రెల పంపిణీ అంతా రీ సైక్లింగ్‌గా జరుగుతోంది.  
బీమా డబ్బులు సైతం యూనిట్‌ కాస్టు నుంచి పట్టుకుంటున్నారు. బీమా చేయకుండానే గొర్రెల్ని విక్రయిస్తుండడంతో ఆ డబ్బులు ఏమవుతున్నాయో అర్థం కావడం లేదు.

పరిగిలో మచ్చుకు కొన్ని..
నస్కల్‌ గ్రామంలో 21 యూనిట్లు గొర్రెలు ప్రభుత్వం గొల్ల కురుమలకు పంపిణీ చేసింది. వీటిలో 19 యూనిట్లు వారం గడవకముందే విక్రయించుకున్నారు.
సయ్యద్‌పల్లిలో మొత్తం 38 యూనిట్లు పంపిణీ చేశారు. వీటిలో 12 యూనిట్ల గొర్రెలు గ్రామానికి కూడా చేరకుండానే అక్కడికక్కడే విక్రయించి వచ్చేశారు.  
రుక్కంపల్లిలో 16 యూనిట్ల గొర్రెలు పంపిణీ చేయగా ఇప్పటికే 12 యూనిట్లు విక్రయించారు.
బర్కత్‌పల్లిలో 58 యూనిట్ల గొర్రెలు పంపిణీ చేయగా 15 యూనిట్ల వరకు విక్రయించినట్లు సమాచారం.
లక్ష్మీదేవిపల్లి, రూప్‌కాన్‌పేట్, గోవిందాపూర్‌ తదితర గ్రామాల్లోనూ ఇలాగే రెండు నుంచి ఐదు యూనిట్ల వరకు విక్రయించారు.

విక్రయాలు వాస్తవమే!
గొర్రెల యూనిట్లు పంపిణీ చేశాక ఏడాది వరకు విక్రయించుకోవద్దు. కానీ కొన్ని గ్రామాల్లో లబ్ధిదారులు తెచ్చిన వెంటనే విక్రయిస్తున్నారు. ఇలాంటి వారి సమాచారం సేకరిస్తున్నాం. ఇలాంటి సంఘటనలను దృష్టిలో ఉంచుకుని యూనిట్లు అందించిన వెంటనే బీమా చేయడం లేదు. పోషించే వారికే బీమా వర్తించేలా చేస్తున్నాం. – డాక్టర్‌ చంద్రశేఖర్, పశుసంవర్ధక శాఖ అధికారి

Read latest Medchal News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా