క్షమాపణ చెప్పిన మమ్ముట్టి

12 Aug, 2019 10:40 IST|Sakshi

తమిళసినిమా : మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి క్షమాపణ చెప్పారు. ఇందుకు కారణం ఆయన వీరాభిమానులే. ఆ కథేంటో చూద్దాం. ఇటీవల 66వ జాతీయ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఉత్తరాది చిత్రపరిశ్రమతో పాటు దక్షిణాదిలో ఒక్క తమిళచిత్ర పరిశ్రమ మినహా అన్నీ సినీ పరిశ్రమలను ఈ అవార్డులు వరించాయి. తమిళంలోనే రెండు జాతీయ అవార్డులతో సరిపెట్టుకోవలసి వచ్చింది. కాగా మమ్ముట్టి అభిమానులు అవార్డుల కమిటీ చైర్మన్‌ రాహుల్‌ రవిపై దండయాత్ర చేస్తున్నారు. ఆయన ఫేస్‌బుక్‌లో ఇస్టానుసారంగా ఏకేస్తున్నారు. పరుష పదజాలంతో దూషిస్తున్నారు. అందుకు కారణం మమ్ముట్టి నటించిన చిత్రానికి ఒక్క జాతీయ అవార్డు కూడా రాకపోవడమే. మమ్ముట్టి మలయాళంలోనూ కాకుండా తమిళం, తెలుగు, హింది బాషల్లో నటించి బహుభాషా నటుడిగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

ఈయన తమిళంలో నటించిన చిత్రం పేరంబు. పలువురు సినీ ప్రముఖుల ప్రసంశలను అందుకున్న ఈ చిత్రం పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. అలాంటి పేరంబు చిత్రానికి ఒక్క జాతీయ అవార్డు రాకపోవడమే మమ్ముట్టి అభిమానుల ఆగ్రహానికి కారణం. అవార్డు కమిటీపై ఆరోపణలు రావడం సహజమేకానీ, ఇలా అభిమానులు మండిపడడం అరుదే. మమ్ముట్టి అభిమానులు జాతీయ అవార్డుల కమిటీ చైర్మన్‌ రాహుల్‌రవిపై ఫేస్‌బుక్‌లో విమర్శల దాడికి దిగారు. చాలా అసభ్య పదజాలంను వాడడంతో వేదన చెందిన రాహుల్‌రవి వెంటనే నటుడు మమ్ముట్టికి ఒక వివరణను ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు. అందులో మిస్టర్‌ మమ్ముట్టి మీ అభిమానులు పరుష పదజాలంతో నాపై దాడి చేస్తున్నారు. పేరంబు చిత్రానికి అవార్డును ప్రకటించలేదని దూషిస్తున్నారు.

అందుకు వివరణ ఇస్తున్నాను. ముఖ్యంగా ఒక్క విషయాన్ని గుర్తు చేస్తున్నాను. కమిటీ నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నంచరాదు. ఇకపోతే మీ పేరుంబు చిత్రాన్ని ప్రాంతీయ కమిటీనే తిరష్కరించడంతో కేంద్ర కమిటీ పరిశీలనకు రాలేదు. ఈ విషయం తెలియక మీ అభిమానులు గొడవ చేస్తున్నారు అని పేర్కొన్నారు. దీంతో కొద్ది సమయంలోనే మమ్ముట్టి రాహుల్‌ రవి ట్వీట్‌కు స్పందిస్తూ ‘క్షమించండి. ఈ విషయాలేమీ నాకు తెలియవు. అయినా జరిగిన దానికి నేను క్షమాపణ కోరుతున్నాను’అని ట్విట్టర్‌లో బదులిచ్చారు. చూశారా? ఒక్కోసారి మితివీురిన అభిమానం కూడా తలవంపులు తెచ్చిపెడుతుందన్నదానికి ఈ ఉదంతమే ఉదాహరణ.
 

మరిన్ని వార్తలు