ఒక్కరోజే 14 సినిమాలు..!

29 Mar, 2016 11:48 IST|Sakshi
ఒక్కరోజే 14 సినిమాలు..!

ఏప్రిల్ తొలి వారం నుంచి స్టార్ హీరోల సినిమాలు రిలీజ్కు రెడీ అవుతుండటంతో చిన్న నిర్మాతలు తమ సినిమాలను ఈ వారమే ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి రెడీ అవుతున్నారు. దీంతో ఈ శుక్రవారం ఏకంగా 14 సినిమాలు వెండితెర మీద దాడికి రెడీ అవుతున్నాయి. వీటిలో అంచనాలు ఉన్న సినిమాలు ఒకటి రెండే ఉన్నా... రిలీజ్ విషయంలో మాత్రం ఇది ఓ రికార్డే అంటున్నారు టాలీవుడ్ విశ్లేషకులు. మరి ఇన్ని సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే థియేటర్ల సమస్య ఎలా ఉంటుందో చూడాలి.

ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాల్లో అభిమానుల్లో అంచనాలున్న సినిమా రామ్ గోపాల్ వర్మ ఎటాక్. ఏడాది క్రితమే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా, అనుకోని పరిస్థితుల్లో వాయిదా పడుతూ చివరికి ఏప్రిల్ 1న ఆడియన్స్ ముందుకు వస్తోంది. మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, ప్రకాష్ రాజ్, వడ్డే నవీన్ లాంటి వారు ప్రధాన పాత్రల్లో కనిపిస్తుండటంతో సినిమా మీద మంచి అంచనాలు ఏర్పాడ్డాయి. దీంతో పాటు నారా రోహిత్ నందిత జంటగా తెరకెక్కుతున్న సావిత్రి సినిమా విషయంలో కూడా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాలతో పాటులో లోబడ్జెట్లో తెరకెక్కిన పిడుగు, 7 టు 4, అప్పుడలా ఇప్పుడిలా, ఆమె ఎవరు, భరతన్న, ఓ మల్లి. రహదారి, 24 అవర్స్, ధనాధన్ లాంటి తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటితో పాటు భారీ సంఖ్యలో డబ్బింగ్ సినిమాలు కూడా అదే రోజు రిలీజ్కు రెడీ అవుతున్నాయి. శర్వానంద్, నిత్యామీనన్లు జంటగా తెరకెక్కిన తమిళ డబ్బింగ్ సినిమా రాజాధిరాజా, సెల్వరాఘవన్ భార్య గీతాంజలి రూపొందించిన నన్ను వదిలి నీవు పోలేవులే, ధనుష్, కాజల్ హీరో హీరోయిన్లుగా నటించిన మాస్ సినిమాలు కూడా ఈ శుక్రవారమే ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి. మరి ఈ 14 సినిమాల్లో ఎన్ని సినిమాలను, రిలీజ్ అయినట్టుగా ఆడియన్స్ గుర్తిస్తారో చూడాలి.