నన్ను మోసం చేసి లాక్‌ చేశాడు

28 Aug, 2018 00:33 IST|Sakshi
చిరంజీవి, ఎస్‌.జానకి; శ్రియ, చిరంజీవి, సురేశ్‌

చిరంజీవి

‘‘నాకు అవార్డు ఇస్తానంటే వేడుకకు రాను..ఇవ్వనంటేనే వస్తానని సురేశ్‌కి ముందే చెప్పా. కానీ, నన్ను మోసం చేసి గానకోకిల ఎస్‌.జానకిగారి చేతులమీదుగా అవార్డు బహూకరించి నన్ను లాక్‌ చే సేశాడు. కాదనలేక ఈ అవార్డు తీసుకుంటున్నా’’ అని హీరో చిరంజీవి అన్నారు. 16వ ‘సంతోషం సౌత్‌ ఇండియా ఫిలిం అవార్డుల ప్రదానోత్సవం’ ఆదివారం రాత్రి  హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథి చిరంజీవి మాట్లాడుతూ– ‘‘సింగపూర్‌లో ఓ అవార్డుల కార్యక్రమంలో జానకిగారు, నేను కలిసాం. మళ్లీ ‘సంతోషం’ వేడుకల్లోనే కలిసాం. తొలిసారి ఆమె చేతుల మీదుగా  ‘సంతోషం’ అవార్డు తీసుకుంటున్నందుకు చాలా గర్వంగా ఉంది.

ఇందుకు సురేశ్‌కి థ్యాంక్స్‌. మరొకరి చేతుల మీదుగా అవార్డు ఇచ్చుంటే తిరస్కరించేవాణ్ని. ఎందుకంటే ఇలాంటి అవార్డులు కొత్త వారికి ఇచ్చి ప్రోత్సహిస్తే వాళ్లలో ఉత్సాహం నింపినట్లు ఉంటుంది’’ అన్నారు. మరో ముఖ్య అతిథి గాయని ఎస్‌. జానకి మాట్లాడుతూ– ‘‘సురేశ్‌ 5 ఏళ్ల నుంచి ఫంక్షన్‌కు రావాలని అడుగుతున్నా కుదరక రాలేకపోయా. ఈసారి కచ్చితంగా వెళ్లాలని నిర్ణయించుకుని వచ్చా. ఇక్కడ చిరంజీవిగార్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఆయన సినిమాల్లోని అప్పటి హిట్‌ సాంగ్స్‌ అన్నీ దాదాపు నావే. ఆయన 125 ఏళ్లు సంతోషంగా జీవించాలి. ‘ఖైదీ నంబర్‌ 150’ సినిమా చూసా. పాత చిరంజీవిని చూసినట్లే ఉంది’’ అన్నారు.

మంత్రి తలసాని  శ్రీనివాస యాదవ్‌ మాట్లాడుతూ– ‘‘16 ఏళ్లగా సురేశ్‌ ఒక్కడే అన్నీ తానై ఈ వేడుకలను నిర్వహించడం గొప్ప విషయం. సినీ పరిశ్రమను మద్రాసు నుంచి హైదరాబాద్‌కు తీసుకురావడంలో ఎందరో పెద్దల కృషి ఉంది. ఎన్టీఆర్, ఏఎన్నార్, రామానాయుడుగారులాంటి వల్ల సాధ్యమైంది’’ అన్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అవార్డులు అందించారు. డైరెక్టర్‌ కె. రాఘవేంద్రరావు, నిర్మాతలు అల్లు అరవింద్, సురేశ్‌బాబు, కె.ఎల్‌ నారాయణ, నటులు రాజేంద్ర పసాద్, జయప్రకాశ్‌ రెడ్డి, బ్రహ్మాజీ, ప్రసన్న, దర్శకుడు, నటుడు టి. రాజేందర్, రచయిత సాయిమాధవ్‌ బుర్రా, కథానాయికలు తమన్నా, మెహరీన్, ఈషా, స్నేహ, డైరెక్టర్‌ సంకల్ప్‌ రెడ్డి, నృత్యదర్శకుడు శేఖర్‌ మాస్టర్, ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్‌ అంబికా రాధాకృష్ణ, ‘మా’ జనరల్‌ సెక్రటరీ నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు