గెలవమని రిటర్న్ టికెట్‌ కూడా బుక్‌ చేసుకున్నారు

9 May, 2020 17:58 IST|Sakshi

న్యూఢిల్లీ: దర్శకుడు కబీర్ ఖాన్ క్రీడా నేపథ్యంలో తెరకెక్కిస్తున్న చిత్రం 83. ఇది 1983లో టీమిండియా మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ సారథ్యంలో భారత క్రికెట్‌ జట్టు‌ ప్రపంచ కప్ సాధించిన నిజమైన కథ చుట్టూ తిరుగుతుంది. ఇక చిత్రంలో కపిల్‌దేవ్‌ పాత్రలో బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అప్పటి భారత జట్టు ఎలాంటి మలుపుల మధ్య ప్రపంచ కప్ సాధించిందో.. ఆ సమయంలో చోటు చేసుకున్న అనుకోని సంఘటనలు వంటి ఆసక్తికర అంశాలను, వాస్తవాలను ఈ సినిమా ద్వారా దర్శకుడు తెరపై చూపించనున్నారు. ఈ క్రమంలో తాజాగా 1983 క్రికెట్ జట్టు గురించి ఓ ఆసక్తికర సంఘటన వెలుగులోకి వచ్చింది.

జూన్ 20, 1983.. ఆరోజు జరిగిన గ్రూప్ మ్యాచ్‌లను దాటి టీమిండియా ముందుకు వెళ్తుందని జట్టు సభ్యులేవరికీ ఆశలు లేవు. గ్రూప్ దశలోనే భారత్‌ ఇంటి దారి పడుతుందేమోనని టోర్నీ మధ్యలోనే జట్టు తిరిగి వెళ్లేందుకు టిక్కెట్లను బుక్ చేసుకుంది. ఇంకా చెప్పాలంటే జట్టులోని కొందరు ఆటగాళ్లు ఆ మధ్యే వివాహం చేసుకున్నారు. గ్రూప్ మ్యాచ్‌లు ముగిసిన వెంటనే వారి భార్యలతో సెలవులు ప్లాన్ చేసుకుని.. జూన్ 20 రాత్రి న్యూయార్క్ చుట్టేయడానికి టిక్కెట్లను కూడా బుక్ చేసుకున్నారు. మరో ఆసక్తికర విషయం ఏటంటే అప్పటికే జూన్ 22 నుంచి సెమీ ఫైనల్స్ షెడ్యూల్‌ కూడా ఖరారవడం గమనార్హం. (కపిల్‌దేవ్‌కు నిజమైన అభినందన దక్కలేదు)

ఇక ఈ టోర్నమెంట్‌లో భారత్ అంచనాలకు మించి ప్రదర్శన ఇస్తుందని.. సెమీ ఫైనల్స్‌  చేరుకుంటారని ఎవరూ ఊహించలేదు. కనీసం జట్టు సభ్యులు కూడా. ఇక ఆ రోజు అందరి ఊహలను తలకిందులు చేస్తూ టీమిండియా అద్భుత ప్రదర్శన కనబరచడమే కాకుండా మొత్తం టోర్నమెంట్‌ను గెలుచుకుని క్రికెట్ చరిత్రలో తమకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుని భారత క్రికెట్‌ చరిత్రలో చీరస్మరనీయమైన రోజును సంపాదించింది. అయితే 1983కి ముందేప్పుడూ కూడా క్రికెట్‌ ప్రపంచ కప్‌ విజయాల పట్టికలో భారతదేశ పటం లేదు. ఇక భారత్‌ సెమీ ఫైనల్స్‌ చేరి కప్‌ సాధింస్తుందని ఎవరూ ఊహించలేదు.

కాగా కపిల్ దేవ్‌ సారథ్యంలో భారత్‌ జట్టు అద్భుత ప్రదర్శన కనబరచి విజయం వైపు పరుగులు తీస్తుంటే స్టేడియంలో నెలకొన్న ఉత్కంఠ.. కప్‌ గెలవడంతో జట్టు సభ్యుల్లో మొదలైన భావోద్యేగం, అభిమానుల ఆనంద కేకలను దర్శకుడు తెరపై చూపించబోతున్నాడు. ఇక రిలయన్స్ ఎంటర్‌టైనమెంట్, ఫాంటమ్ ఫిల్మ్స్ ప్రొడక్షన్‌లో దర్శకుడు కబీర్‌ ఖాన్‌ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొనె కపిల్‌ భార్య పాత్ర నటిస్తున్నారు. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.

మరిన్ని వార్తలు