గోల్డెన్‌ రీల్‌ అవార్డుకు ‘2.ఓ’

20 Jan, 2019 10:10 IST|Sakshi

అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తెరకెక్కిన భారతీయ చిత్రం 2.ఓకు మరో అరుదైన గౌరవం దక్కింది. గోల్డెన్‌ రీల్‌ అవార్డుకు ఈ చిత్రం నామినేట్‌ అయ్యింది. అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన అవార్డుల్లో ప్రధానమైన వాటిలో గోల్డెన్‌ రీల్‌ ఒకటి. ఉత్తమ సౌండ్‌ ఎఫెక్ట్, ఎడిటింగ్‌ కళాకారులకు ఈ అవార్డులను ప్రతి ఏడాది అందిస్తుంటారు. ఈ ఏడాది 66వ గోల్డెన్‌ రీల్‌ అవార్డుల ప్రదానోత్సవ వేడుక ఫిబ్రవరి 17న అమెరికాలోని లాస్‌ ఏంజల్స్‌ నగరంలో బ్రహ్మాండంగా జరగనుంది.

మోషన్‌ పిక్చర్‌ సౌండ్, ఎడిటర్స్‌ సంస్థ నిర్వహించనున్న ఈ అవార్డులకు శంకర్‌ దర్శకత్వంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడుగా నటించిన 3డీ ఫార్మెట్‌లో 4డీ ఎస్‌ఎల్‌ఆర్‌ సౌండ్‌సిస్టంలో రూపొందిన 2.ఓ చిత్రం నామినేట్‌ అవడం విశేషం. గత ఏడాది నవంబర్‌లో తెరపైకి వచ్చిన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణను పొందింది. ఇప్పుడీ చిత్రం విదేశీ చిత్రాల కేటగిరీలో ఉత్తమ సౌండ్‌ ఎఫెక్ట్‌ విభాగంలో గోల్డెన్‌ రీల్‌ అవార్డుకు నామినేట్‌ అయ్యింది.

ఈ అవార్డు కోసం జనవరి 21 నుంచి ఫిబ్రవరి 11 వరకూ ఓటింగ్‌ పక్రియ జరుగుతుంది. అధిక శాతం ఓటింగ్‌ పొందిన చిత్రానికి ఫిబ్రవరి 17న జరిగే కార్యక్రమంలో గోల్డెన్‌ రీల్‌ అవార్డును అందిస్తారు. 2.ఓ చిత్రానికి ఆస్కార్‌ అవార్డు గ్రహీత రసూల్‌ పూకుట్టాన్‌ సౌండ్‌ డిజైనర్‌గా పని చేశారు.

మరిన్ని వార్తలు