విడుదలకు సిద్ధంగా ముప్ఫై సినిమాలు

19 Apr, 2018 09:01 IST|Sakshi

చెన్నై:  సినీ పరిశ్రమ సమ్మెతో ముప్పైకి పైగా చిత్రాలు 48 రోజులుగా ఎదురు చూపులతో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో రజనీకాంత్‌ కాలా, కమలహాసన్‌ విశ్వరూపం–2 చిత్రాలు చోటు చేసుకున్నాయి. ఇవి తెరపైకి వచ్చేది ఎప్పుడన్న ఆసక్తి కోలీవుడ్‌లో నెలకొంది. డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు, థియేటర్ల సంఘాలతో నెలకొన్న సమస్యల పరిష్కారానికి నిర్మాతల సంఘం జరిపిన చర్చలు ఫలించకపోవడంతో గత మార్చి 1 నుంచి కొత్త చిత్రాల విడుదలను, 16వ తేదీ నుంచి షూటింగ్‌లను నిలిపివేసి సమ్మెకు దిగారు. 48 రోజుల సమ్మె అనంతరం రాష్ట్ర సమచార, ప్రసారాల శాఖ మంత్రి కడంబూర్‌ రాజు నేతృత్వంలో మంగళవారం సినీ సంఘాల నేతలు నిర్వహించిన ద్వైపాక్షిక చర్చలు ఫలించాయి.

డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌ తమ రేట్లను 50శాతం తగ్గించుకోవడానికి అంగీకరించారు. అదేవిధంగా టిక్కెట్‌ బుక్కింగ్‌ విధానం కంప్యూటర్‌లో పొందుపరచడం లాంటి డిమాండ్లకు థియేటర్ల యాజమాన్యం అంగీకరించింది. దీంతో చిత్ర షూటింగ్‌లు ప్రారంభోత్సవం, కొత్త చిత్రాల విడుదల విషయంలో నిర్మాతల మండలి బుధవారం సమావేశమై నిర్ణయం వెల్లడించనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే చిత్రా విడుదల సెన్సార్‌ అయిన తేదీల ప్రకారం ఉంటుందని నిర్మాతల మండలి ప్రకటించింది.

విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాల్లో కాలా, విశ్వరూపం– 2, మెర్క్యూరీ, మిస్టర్‌ చంద్రమౌళి, మోహిని, కరు, టిక్‌ టిక్‌ టిక్, నరకాసురన్, ఇరుట్టు అరైయిల్‌ మొరట్టు కుత్తు, గజినీకాంత్, ఇరుంబుతిరై, అసురవధం, పరియేరుమ్‌ పెరుమాళ్, ఆణ్‌దేవదై, అభియుమ్‌ అనువుమ్, భాస్కర్‌ ఒరు రాస్కెల్, సర్వర్‌సుందరమ్, కుప్పత్తురాజా, ఆర్‌కే.నగర్, పార్టీ, కడైకుట్టిసింగం, ఇమైకా నోడిగళ్‌ అంటూ 30 చిత్రాలకు పైగా రెడీగా ఉన్నాయి. సెన్సార్‌ అయిన తేదీ ప్రకారం చూస్తే కాలా చిత్రం ఈ నెల 27న విడుదలయ్యే అవకాశం లేదనిపిస్తోంది. కాలా కంటే ముందే విశ్వరూపం–2 సెన్సార్‌ను పూర్తి చేసుకుని ఉండడంతో ఆ చిత్రమే ముందుగా తెరపైకి రావాల్సి ఉంది. ఈ విషయంలో నిర్మాతల మండలి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నిర్ణయం ఎలా ఉంటుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

మరిన్ని వార్తలు