104 డిగ్రీల జ్వరంతో ధినక్‌ తా ధినక్‌ రో...

9 May, 2020 00:20 IST|Sakshi
రాఘవేంద్ర రావు, అశ్వినీదత్, చిరంజీవి

స్క్రీన్‌ మీద మాస్‌ హీరో చిరంజీవి, అందాల సుందరి శ్రీదేవి ‘ధినక్‌ తా ధినక్‌ రో..’ అంటూ డ్యాన్స్‌ చేస్తున్నారు. చూస్తున్న ప్రేక్షకులకు ఒకటే హుషారు. అభిమానులు కూడా థియేటర్లో స్టెప్పులేశారు. హీరోయిన్లు ఎలానూ పాటల్లో గ్లామరస్‌గా కనిపిస్తారు. హీరోలు కూడా హ్యాండ్‌సమ్‌గా కనిపిస్తారు. ఈ పాటలో చిరంజీవి అలానే కనిపించారు. అయితే ఈ పాట చిత్రీకరించినప్పుడు ఆయన 104 డిగ్రీల జ్వరంతో ఉన్నారు. నేటితో (మే 9) ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ విడుదలై 30 ఏళ్లయింది. చిరంజీవి, శ్రీదేవి జంటగా రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ నిర్మించారు. ఈ సినిమాలోని పాటల గురించి కొన్ని విశేషాలను వైజయంతీ సంస్థ పంచుకుంది.

‘దినక్‌ తా ధినక్‌ రో’.. పాటకు వాహినీ స్టూడియోలో భారీ సెట్‌ వేశాం. షూటింగ్‌ అయిపోగానే శ్రీదేవి హిందీ సినిమా షూటింగ్‌కు ఫారిన్‌ వెళ్లిపోవాలి. కానీ చిరంజీవికి 104 డిగ్రీల హై ఫీవర్‌. రిలీజ్‌ డేట్‌ మే 9 అని ప్రకటించాం. చిరంజీవి హై ఫీవర్‌తోనే షూటింగ్‌కు రెడీ అయ్యారు. ఒక డాక్టర్‌ సెట్‌లో ఉండేట్లు ప్లాన్‌ చేసుకున్నాం. అనకున్న తేదీకి విడుదల చేయగలిగామంటే చిరంజీవియే కారణం.

ఈ సినిమాకి ఇళయరాజా సంగీతదర్శకుడు. ట్యూన్స్‌ అన్నీ మెలోడీవే. కానీ చిరంజీవి, శ్రీదేవి అంటే మాస్‌ సాంగ్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు కదా? రాఘవేంద్రరావు  ఆలోచనలో పడ్డారు. అప్పుడు వేటూరి ‘ఇదే ట్యూన్‌ ని మాస్‌ సాంగ్‌ చేస్తాను చూడండి’ అంటూ ‘అబ్బ నీ తీయనీ దెబ్బ’ అని రాశారు. ఈ పాటని రాఘవేంద్రరావు మైసూర్, బెంగళూర్‌లలో జస్ట్‌ రెండే రోజుల్లో ఫినిష్‌ చేశారు. కానీ ‘అందాలలో మహోదయం’ పాటకు మాత్రం 11 రోజులు పట్టింది.

‘జగదేకవీరుడు అతిలోకసుందరి’.. వంటి సెల్యులాయిడ్‌ వండర్‌ వెనక  చాలామంది ఛాంపియన్స్‌ ఉన్నారు. సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌నీ మ్యాజికల్‌గా చూపించిన డీఓపీ విన్సెంట్‌ గారు, అద్భుతమైన సెట్స్‌తో మైమరపింపజేసిన ఆర్ట్‌ డైరెక్టర్‌ చలం, ఎడిటింగ్‌ స్కిల్‌తో  సినిమాకి సూపర్‌ టెంపోనిచ్చిన చంటి, పాటలు, మాటలతో మెస్మరైజ్‌ చేసిన వేటూరి గారు, జంధ్యాల గారు.. ఇలా ఎందరో. ఎన్నో రకాలుగా ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ తెలుగు సినిమా చరిత్రలోనే ఒక వండర్, ఒక మైల్‌ స్టోన్‌ . ఓ హిస్టారికల్‌ ల్యాండ్‌ మార్క్‌.

మరిన్ని వార్తలు