47 రోజుల సస్పెన్స్‌

19 Apr, 2019 00:35 IST|Sakshi
శశిభూషణ్, శ్రీధర్, రఘుకుంచె, ప్రదీప్, సత్యదేవ్, విజయ్‌ శంకర్‌

పూరి జగన్నాథ్‌ శిష్యుడు ప్రదీప్‌ మద్దాలి దర్శకత్వం వహించిన చిత్రం ‘47 డేస్‌’. ‘ది మిస్టరీ అన్‌ ఫోల్డ్స్‌’ అనేది ఉపశీర్షిక. సత్యదేవ్‌ హీరోగా, పూజా ఝవేరీ, రోషిణి ప్రకాష్‌ హీరోయిన్లుగా నటించారు. టైటిల్‌ కార్డ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై దబ్బార శశిభూషణ్‌ నాయుడు, రఘు కుంచె, శ్రీధర్‌ మక్కువ, విజయ్‌ శంకర్‌ డొంకాడ నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా చూస్తుంటే బాలచందర్‌గారి ‘47 డేస్‌’ గుర్తుకు వచ్చింది. ఆ సినిమా కోసం చిరంజీవి ‘నాకు మొగుడు కావాలి’ సినిమా వాయిదా వేసి మరీ చేశాడు.

ఏది ఏమైనా ఈ సినిమా కూడా మా ‘నాకు మొగుడు కావాలి’ అంత హిట్‌ అవ్వాలి’’ అన్నారు. ప్రదీప్‌ మద్దాలి మాట్లాడుతూ– ‘‘సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉన్న నేను సినిమా రంగంలోకి వస్తానన్నప్పుడు నాకు అండగా నిలిచిన నా తల్లిదండ్రులకు థ్యాంక్స్‌. ఈ సినిమా ట్రైలర్‌ రఫ్‌ కట్‌ చూసిన రామ్‌గోపాల్‌ వర్మగారు.. ‘మీరు విజువల్స్‌తో స్టోరీ చెప్పారు’ అనడం పెద్ద ప్రశంసలా అనిపించింది’’ అన్నారు. ‘‘ఒక చిన్న ప్రయత్నంగా ఈ సినిమా మొదలు పెట్టాం. చాలా ఓర్పుతో ఈ చిత్రాన్ని ఇక్కడి వరకూ తీసుకొచ్చాం.

ఈ సినిమా చూసిన ప్రేక్షకులు థ్రిల్‌ ఫీల్‌ అవుతారు’’ అన్నారు రఘు కుంచె. ‘‘సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. సినిమా మొత్తం చాలా గ్రిప్పింగ్‌ ఉంటుంది’’ అన్నారు నిర్మాతలు శశి భూషణ్, శ్రీధర్, విజయ్‌. ‘‘ఈ సినిమా హిట్‌ విషయంలో చాలా నమ్మకంగా ఉన్నాను’’ అన్నారు సత్యదేవ్‌. ఈ కార్యక్రమంలో నిర్మాత రాజ్‌ కందుకూరి, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, దర్శకుడు బీవీయస్‌ రవి, దర్శకుడు వెంకటేష్‌ మహా, సతీష్‌ కాశెట్టి, కత్తి మహేష్, లక్ష్మీ భూపాల్, భాస్కరభట్ల పాల్గొన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: అనిల్‌ కుమార్‌ సొహాని, సంగీతం: రఘు కుంచే, కెమెరా: జీకే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా