అత్యాచారం కేసులో‌ హాలీవుడ్ న‌టుడి అరెస్ట్‌

18 Jun, 2020 09:14 IST|Sakshi

లాస్ఏంజెల్స్‌: ‘ద‌ట్ సెవంటీస్ షో’ న‌టుడు డానీ మాస్ట‌ర్‌స‌న్ క‌టక‌టాల వెన‌క్కి వెళ్లాడు. అత్యాచార కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఆయ‌న‌ను బుధ‌వారం లాస్ ఏంజెల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. కాగా డానీ మాస్ట‌ర్‌స‌న్‌పై ముగ్గురు యువతులపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2001లో 23 ఏళ్ల యువ‌తిని, 2003లో 28 ఏళ్ల యువ‌తిపై అత్యాచారానికి పాల్పడ‌గా, 2003 చివ‌ర్లో 23 ఏళ్ల యువ‌తిని ఇంటికి పిలిచి మ‌రీ అత్యాచారం చేసిన‌ట్లు కేసులు నమోదు అయ్యాయి. వీటిపై పోలీసులు మూడేళ్లుగా ద‌ర్యాప్తు చేప‌ట్టారు.  తాజాగా విచార‌ణ చేప‌ట్టిన న్యాయ‌స్థానం ఆయనకు జైలు శిక్ష విధించింది. అయితే కొద్ది గంట‌ల్లోనే డానీ మాస్ట‌ర్‌స‌న్ కోర్టుకు 3.3 మిలియ‌న్ డాల‌ర్లు చెల్లించి జైలు నుంచి విడుద‌ల‌య్యాడు. (డేంజర్‌లో హలీవుడ్‌)

కాగా సెప్టెంబ‌ర్ 18న మ‌రోసారి విచార‌ణ చేప‌ట్టనున్న‌ న్యాయ‌స్థానం డానీ మాస్ట‌ర్‌స‌న్‌కు 45 ఏళ్లు జైలు శిక్ష విధించే అవ‌కాశం ఉంది. లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌ల కార‌ణంగా నెట్‌ప్లిక్స్ 2017లో ‘ద రాంచ్’ షో నుంచి ఆయనను తొల‌గించింది. మ‌రోవైపు నిందితుడి త‌ర‌పు న్యాయ‌వాది థామ‌స్ మెసెరో మాట్లాడుతూ.. మాస్ట‌ర్‌స‌న్ అమాయ‌కుడుని తెలిపారు. నిజం ఏంటో ఎప్ప‌టికైనా తెలుస్తుంద‌ని, అప్పుడు ఆయన నిర్దోషి అని నిరూపిత‌మ‌వుతుంద‌న్నారు. కాగా థామ‌స్ మెసెరో.. లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న మైఖేల్ జాక్స‌న్‌, బిల్ కాస్బేల‌ త‌ర‌పు న్యాయ‌వాదిగా కోర్టులో వాదించాడు. (ప్రజలు అసహనానికి లోనవుతారు: ప్రముఖ దర్శకుడు)

>
మరిన్ని వార్తలు