84 వసంతాల వినోదం

3 Mar, 2018 10:23 IST|Sakshi
కన్నడ నటులు విష్ణువర్ధన్‌, రాజ్‌కుమార్‌, అంబరీష్‌ (పాత చిత్రం)

తొలి వాక్‌చిత్రం సతీ సులోచన

1934 మార్చి 3న విడుదల

నేటి వరకు అలుపెరుగని వెండితెర 

కన్నడ సినిమాలు అనగానే అందమైన కుటుంబ కథలు, సంగీతం, పాటలు, హృద్యమైన లొకేషన్లు, మానవీయత జోడించిన నటీనటుల నటన గుర్తుకువస్తాయి. శాండల్‌వుడ్‌కు నేడు  ఒక మరపురాని మధుర దినం. మార్చి 3 కన్నడ సినిమా రంగానికి ఓ సువర్ణదినంగా పేర్కొనవచ్చు. నేటికి సరిగ్గా కన్నడ వెండితెరకు 84 ఏళ్లు. కన్నడ సినిమాలు ఊపిరి పోసుకున్న అద్భుతమైన రోజు. వై.వి.రావు డైరెక్షన్‌లో విడుదలైన చిత్రం ‘సతీ సులోచన’ 1934 మార్చి 3న విడుదలైన కన్నడ మొదటి మాటల సినిమా. ఈ చిత్రం విడుదలై నేటీకి 84 ఏళ్లు. దీంతో ఈ రోజును శాండల్‌వుడ్‌ పండుగా భావిస్తుంది.

కన్నడంలో ఓ సినిమా తీయాలనే యోచన నాగేంద్ర రాయరకు రావటంతో బెంగళూరులో వంటపాత్రల సామగ్రి వ్యాపారం చేస్తున్న డంగోజి కుటుంబం దృష్టికి తెచ్చారు. వారు రూ.40 వేలు పెట్టుబడితో ‘సతీ సులోచనా‘ అనే కన్నడ సినిమాను తీయాలని పునాది వేశారు. అన్నీ సిద్ధమైన తరువాత ఈ చిత్రం షూటింగ్‌ మహరాష్ట్ర కొల్మాపురలో తీయాలని నిర్ణయించారు. ఈ చిత్రానికి నటీమణులుగా అక్కచెల్లెలైయిన కమలా బాయి, లక్ష్మీబాయిలను ఎంపిక చేశారు. వీరు బెంగళూరు నుంచి షూటింగ్‌ కోసం కొల్హాపురకు రైలులో ప్రయాణం చేసేవారు. ఇలా పరిచయాలు పెరిగి హీరో నాగేంద్ర రాయరు కమలాబాయిని, విలన్‌ ఎం.వీ సుబ్బయ్య నాయుడు లక్ష్మీబాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

ఇప్పటికి 3986 సినిమాలు 
మొదట్లో నాటకాల్లో ఆదరణ పొందిన కథలనే సినిమాలుగా మార్చేవారు. నాటక పాత్రధారులే నటులుగా చేసేవారు. 1956 నుండి సినిమాలకు ప్రత్యేకంగా కథలను రాయటంను ప్రారంభించారు. డాక్టర్‌ రాజ్‌కుమార్‌ నటించిన ‘రాయర  సోసె’ కల్యాణ కుమార్‌ నటించిన ‘నటశేఖర’లు సినిమా కథలు ఇలాంటివే. మైసూర్‌ సౌండ్‌ స్టూడియో కర్ణాటకకు మొదటి స్టూడియో. ఇదీ కన్నడ చిత్రరంగానికే కాకూండ ఇతర రాష్ట్రాల సినీరంగాని అకర్షించిన మొదటి స్టూడియోగా చెప్పవచ్చు. కన్నడంలో మొదటి కలర్‌ సినిమా బీఎస్‌ రంగ డైరక్షన్‌లో అమర శిల్పి జక్కణాచారి. కన్నడ చిత్రరంగం ఇప్పటివరకు 3986 సినిమాలకు ప్రేక్షకులకు సమర్పించింది. 

సింహాన్ని చూసి ప్రేక్షకుల పరుగు
సతీసులోచన 1934 మార్చి 3 విడుదలైంది. ఆరువారాల పాటు ప్రదర్శన జరిగింది. బెంగళూరులో మొట్టమొదటి టాకీస్‌ దొడ్డణ్ణ హాల్‌ (ప్యారా మౌంట్‌)లో ప్రదర్శితమైంది. మూడు నెలల వ్యవధిలో షూటింగ్‌ను పూర్తి చేసుకొన్న ఈ చిత్రం నిడివి 170 నిమిషాలు. ఈ చిత్రంలో ఓ తమాషా చోటుచేసుకుంది. సినిమాలో ఒకచోట సింహం కనిపిస్తుంది. అది చూసి సినిమాహాల్‌లోకి నిజంగానే సింహం వచ్చిందనే భయంతో చాలామంది ప్రేక్షకులు భయంతో మూర్ఛపడిపోగా, మరికొందరు బయటకు పరుగులు పెట్టారు. ఏ సినిమా అయినా హీరోకు జేజేలు పలుకుతారు, కానీ ఇక్కడ విలన్‌ పాత్రధారుడైన సుబ్బయ్య నాయుడుకు మంచి పేరు వచ్చింది. కన్నడంలో మొదట విడుదల కావాలసిన చిత్రం ‘భక్త ధృవ’, కానీ చిత్రీకరణ అర్ధాంతరంగా ఆగిపోయింది.

మరిన్ని వార్తలు