పాఠం ఆడియో ఆవిష్కరణ

26 Sep, 2017 05:59 IST|Sakshi

తమిళసినిమా: అన్నీ ప్రైవేట్‌ సంస్థల ఆధీనంలోకి వెళ్లిపోతున్నాయి. ఇక ప్రభుత్వం పనేంటి అని ప్రశ్నించారు దర్శకుడు, నామ్‌ తమిళర్‌ పార్టీ అధ్యక్షుడు సీమాన్‌. మన దేశ విద్యా విధానాన్ని మార్చాలన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న చిత్రం పాఠం. రోలాన్‌ మూవీస్‌ పతాకంపై పీఎస్‌.జుపిన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా ఇ.రాజశేఖర్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు రాజేశ్‌ శిష్యుడు. నవ జంట కార్తీక్, మోనా హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి మనో ఛాయాగ్రహణం, గణేశ్‌ రాఘవేంద్ర సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ సోమవారం ఉదయం స్థానిక సత్యం థియేటర్‌లో జరిగింది. ఈ వేడుకలో అతిథిగా పాల్గొన్న సీమాన్‌ మాట్లాడుతూ... ఈ చిత్రం పలు అవార్డులను గెలుచుకుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. చదువుకోవడం విద్యార్థుల హక్కు అని, దాన్ని సక్రమంగా అందించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.  అయితే ఇప్పుడు విద్య, వైద్యం, అన్నీ వ్యాపారం అయిపోయాయని ఆరోపించారు.

మనం అన్నిటికీ పన్నులు చెల్లిస్తున్నా, ఏదీ అందుబాటులోకి రావడం లేదన్నారు. అలాంటప్పుడు ప్రభుత్వం పనేంటి? అని ప్రశ్నించారు. జయలలిత లాంటి వారే ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందారని, అంటే పాలకులకే ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యంపై నమ్మకం లేనట్టేగా అని నిలదీశారు. ఇక్కడ డబ్బున్నోళ్లే ప్రాణా లను కాపాడుకుంటారని, లేనోళ్లు ప్రాణాలు కోల్పోవాల్సిందేనని సీమా న్‌ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు