మోహన్‌బాబు సంచలన వ్యాఖ్యలు

19 Jan, 2018 15:09 IST|Sakshi
ఇండియాటుడే సౌత్‌ కాంక్లేవ్‌లో మాట్లాడుతున్న మోహన్‌బాబు

సాక్షి, హైదరాబాద్‌: సీనియర్‌ సినీ నటుడు ఎం. మోహన్‌బాబు.. రాజకీయ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 95 శాతం మంది రాజకీయ నాయకులు రాస్కెల్స్‌ అని వ్యాఖ్యానించారు. ఇండియాటుడే సౌత్‌ కాంక్లేవ్‌ 2018లో రెండో రోజు శుక్రవారం ‘ఫాదర్‌ టు డాటర్‌: ది డీఎన్‌ఏ ఆఫ్‌ యాక్టింగ్‌’ పేరుతో జరిగిన సెషన్‌లో తన కూతురు మంచు లక్ష్మీతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సినిమాలు, రాజకీయాలు వేర్వేరని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలకు హామీలిచ్చి మోసం చేయడం రాజకీయ నాయకులకు అలవాటుగా మారిందని విమర్శించారు.

‘నా స్నేహితుడు, నాకు అన్న అయిన ఎన్టీ రామారావు గారు మంచి వ్యక్తి. లంచం అంటే ఏమిటో కూడా ఆయనకు తెలియదు. ఆయన నన్ను రాజ్యసభకు పంపారు. ఎటువంటి మచ్చ లేకుండా నా పదవీ కాలాన్ని పూర్తిచేశాను. 95 శాతం మంది పొలిటీషియన్లు రాస్కెల్స్‌. ప్రజలకు ఎన్నో హామీలిస్తున్నారు. వీటిని నిలబెట్టుకునేవారెవరు? రాజకీయ నేతలు మాట నిలబెట్టుకునివుంటే ఇండియా ఇంకా మంచి స్థానంలో ఉండేద’ని మోహన్‌బాబు అన్నారు.

కింగ్‌ కాదు.. కింగ్‌మేకర్‌: మంచు లక్ష్మీ
తన తండ్రి కింగ్‌లా కాకుండా కింగ్‌మేకర్‌లా ఉండాలని కోరుకున్నారని మంచు లక్ష్మీ వెల్లడించారు. నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం ఆయన నైజమని చెప్పారు. ‘ఆయన కింగ్‌మేకర్‌. సినీరంగం నుంచి రాజకీయాల్లోకి వెళ్లినవారి తరపున ప్రచారం చేసి గెలిపించారు. ఈ సమావేశానికి హాజరైన వారిలో చాలా మంది ఆయనకు తెలియదు. అయినప్పటికీ భయపడకుండా తన మనసులో ఉన్నది వెల్లడించడానికి ఆయన సంకోచించలేద’ని లక్ష్మీ మంచు అన్నారు.

మరిన్ని వార్తలు