సినిమా చూస్తే పెళ్లి మండపంలో ఉన్నట్లే...

13 Feb, 2014 00:17 IST|Sakshi
సినిమా చూస్తే పెళ్లి మండపంలో ఉన్నట్లే...
‘‘ఓ సూపర్‌హిట్ సినిమాని రీమేక్ చేయాలంటే ఎవరికైనా కొంచెం టెన్షన్‌గానే ఉంటుంది. ఆ సినిమా వంద శాతం విజయం సాధిస్తే, రీమక్ 150 శాతం సక్సెస్ అయ్యేలా వర్క్ చేయాలి’’ అన్నారు నాని. హిందీలో ఘనవిజయం సాధించిన చిత్రం ‘బ్యాండ్ బాజా బరాత్’. ఈ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిలింస్ నాని, వాణికపూర్ జంటగా తెలుగులో ‘అహా కళ్యాణం’ పేరుతో తెలుగులో పునర్నిర్మించింది. ఎ. గోకుల్‌కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది.
 
  ధరన్‌కుమార్ స్వరపరచిన ఈ చిత్రం పాటలు విజయం సాధించిన నేపథ్యంలో బుధవారం ఆడియో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ -‘‘బ్యాండ్ బాజా ఢిల్లీ నేపథ్యంలో సాగుతుంది. ఈ రీమేక్ మన దక్షిణాదికి అనుగుణంగా చేయడం జరి గింది. ఇలాంటి కథలతో సినిమాలు వచ్చినప్పటికీ, ప్రేక్షకులను సరికొత్త అనుభూతికి గురి చేస్తుంది. మన ఇంట్లో పెళ్లి జరుగుతున్న ఫీల్‌ని కలగజేస్తుంది’’ అన్నారు. తొలి ప్రయత్నంగా తెలుగులో నిర్మించిన ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నానని యశ్‌రాజ్ సంస్థ ప్రతినిధి పదమ్‌కుమార్ చెప్పారు. ఈ సంస్థలో చేసిన రెండో సినిమా ఇదని వాణీకపూర్ తెలిపారు. ఇంకా ధరన్‌కుమార్‌తో పాటు పాటల రచయిత కృష్ణచైతన్య కూడా పాల్గొన్నారు.