అదిగో రాహుల్.. ఇదిగో ప్రియాంక..

28 Jun, 2018 16:41 IST|Sakshi

న్యూఢిల్లీ : మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’  అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మన్మోహన్‌ సింగ్‌ పాత్రలో ప్రముఖ నటుడు అనుపమ్‌ ఖేర్‌, సోనియా గాంధీగా జర్మన్‌ నటి సుజేన్‌ బెర్నెర్ట్‌, మన్మోహన్‌ భార్య గుర్షరన్‌ కౌర్‌ పాత్రలో దివ్య సేథ్‌ నటిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాలో రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ పాత్రల్లో ఎవరో కూడా తెలిసిపోయింది. కాంగ్రెస్‌ పార్టీ అధినేత రాహుల్‌ గాంధీగా అర్జున్‌ మాథూర్‌, ప్రియాంక గాంధీగా ఆహానా కుమ్రా నటిస్తున్నారు. మన్మోహన్‌ సింగ్‌తో రాహుల్‌ గాంధీ, అతని సోదరి ప్రియాంక గాంధీ మాట్లాడుతున్నా ఫోటోను అనుపమ్ ఖేర్ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఈ ఫోటోలో అర్జున్‌, ఆహానా కుమ్రా అచ్చం రాహుల్‌, ప్రియాంకలానే ఉన్నారు.

ఆహానా కుమ్రా మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో ప్రియాంక గాంధీగా నటించడం సంతోషంగా ఉంది. అది చాలా ప్రాధాన్యత ఉన్న పాత్ర. ఈ సినిమాలో అన్ని పాత్రలో నిజజీవితంలో ఉన్నవారే కాబట్టి వారిలా మారడం, నటించడం చాలా అవసరం’  అని అన్నారు. మన్మోహన్ సింగ్ కు మీడియా సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు రాసిన పుస్తకం 'ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ : ది మేకింగ్‌ అండ్‌ అన్‌మేకింగ్‌ ఆఫ్‌ మన్మోహన్‌సింగ్‌' ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

విజయ్‌ రత్నాకర్‌ గట్టీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను బొహ్రా బ్రదర్స్‌ నిర్మిస్తున్నారు. సలీమ్‌-సలైమన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 2019 ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్‌ 21న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు