ఆమిర్ మరోసారి మ్యాజిక్ చేశాడు

24 Dec, 2016 10:38 IST|Sakshi
ఆమిర్ మరోసారి మ్యాజిక్ చేశాడు

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ మరోసారి తన విలక్షణతను ప్రూవ్ చేసుకున్నాడు. సినిమా కోసం శారీరకంగా మానసికంగా ఎంత శ్రమకైనా రెడీ అయ్యే ఆమిర్.. క్వాలిటీ సినిమాను అందించటం కోసం ఎంత సమయాన్నైనా కేటాయిస్తాడు. తనకున్న స్టార్ డమ్ను క్యాష్ చేసుకోని ఏడాదికి రెండు మూడు సినిమాలు చేయటం ఆమిర్కు నచ్చదు. ఒక్క సినిమా చేసినా అది అభిమానులు గొప్పగా చెప్పుకునేది అయి ఉండాలి అన్నదే ఆమిర్ ఫిలాసఫీ.

ఆ బాటలో ఆమిర్ ఖాన్ నుంచి వచ్చిన మరో అద్భుత చిత్రం దంగల్. హీరోగా సూపర్ స్టార్ ఇమేజ్తో ఉన్న ఆమిర్. 50 ఏళ్ల వ్యక్తిగా నలుగురు అమ్మాయిలకు తండ్రిగా నటించటం అంటే సాహసం అనే చెప్పాలి. ప్రముఖ భారత రెజ్లర్ మహావీర్ సింగ్ ఫోగట్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన దంగల్ సినిమాతో ఆ సాహసం చేశాడు ఆమిర్. రెజ్లర్గా ఎంతో సాధించిన ఫోగట్ తన వారసులుగా కూతుళ్లనే బరిలో దించటం అందుకు వారిని ఎలా సిద్ధం చేశాడన్నదే దంగల్ కథ. నితీష్ తివారి దర్శకత్వంలో ఆమిర్ ఖాన్ స్వయంగా నిర్మించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

కథ విషయానికి వస్తే హరియాణాలోని భివానీ జిల్లాలో ఓ మారుమూల గ్రామానికి చెందిన కుస్తీ వీరుడు మహావీర్ సింగ్ ఫోగట్. రెజ్లింగ్లో భారత్ కు బంగారు పతకం అంధించాలన్నదే అతని కల. ఆ కలను తాను సాకారం చేసుకోలేకపోవటంతో తన వారాసుల ద్వారా అయినా అది సాధించాలనుకుంటాడు. కానీ తనకు నలుగురు కూతుళ్లే పుట్టడంతో నిరుత్సాహపడతాడు. అయితే ఒక రోజు స్కూల్లో జరిగిన గొడవలో తన కూతుళ్లు గీతా ఫోగట్, బబితా కుమారీలను చూసిన మహావీర్, తన కూతుళ్లు ఏ మగాడికన్నా తక్కువ కాదని భావిస్తాడు. తాను సాధించలేని బంగారు పతకాన్ని కూతుళ్ల ద్వారా భారత్కు అందించాలని నిశ్చయించుకుంటాడు. తానే శిక్షకుడిగా మారి కూతుళ్లను దేశకీర్తి పతాకాన్ని ఎగురవేసే రెజ్లర్లుగా తయారు చేస్తాడు.

చిల్లర్ పార్టీ, భూత్నాథ్ రిటర్న్స్ లాంటి కామెడీ చిత్రాలను తెరకెక్కించిన నితీష్ తివారీ, తొలిసారిగా ఓ ఎమోషనల్ డ్రామాను తెరకెక్కించాడు. సినిమా తొలి సీన్ నుంచే ప్రేక్షకున్ని కథలో లీనం చేసిన దర్శకుడు, పర్ఫెక్ట్ స్క్రీన్ప్లేతో ఆకట్టుకున్నాడు. ప్రీతమ్ అందించిన సంగీతం సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్. సినిమాలో భావోద్వేగాలను తన సంగీతంతో మరింత రక్తికట్టించాడు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అన్నింటికీ మించి ఆమిర్ నిర్మాణ విలువలు సినిమాను ఓ అంతర్జాతీయ స్థాయి సినిమాగా ప్రేక్షకులముందుంచాయి. అందుకే ఈ అద్భుత చిత్రానికి ప్రేక్షకులు భాషా బేదాలను మరిచి బ్రహ్మరథం పడుతున్నారు.