నా బయోపిక్‌కి తనే కరెక్ట్‌

29 Jan, 2019 03:29 IST|Sakshi
ఆమిర్‌ ఖాన్‌

ప్రస్తుతం సౌత్‌ నుంచి నార్త్‌ వరకూ అన్ని ఇండస్ట్రీల్లో బయోపిక్స్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు దర్శక–నిర్మాతలు. కొందరు ఆర్టిస్టులు కూడా తమ బయోపిక్‌ వెండితెరకు వస్తే బాగానే ఉంటుందనుకుంటున్నారు. ఆ లిస్ట్‌లో ఆమిర్‌ ఖాన్‌ ఉన్నారు. ప్రస్తుతం ఆయన ‘రుబారు రోషిని’ అనే డాక్యుమెంటరీ నిర్మించారు. ఈ చిత్రం ప్రమోషన్‌లో తన బయోపిక్‌ ప్రస్తావనను తీసుకొచ్చారు. ‘‘ఈ డాక్యుమెంటరీకు దర్శకత్వం వహించింది స్వాతి చక్రవర్తి బత్కల్‌. ఆమె నా చిన్ననాటి స్నేహితుడి భార్య. వీళ్లిద్దరే నా పెళ్లికి సాక్షులు. నా పెళ్లి చాలా తక్కువ బడ్జెట్‌లోనే ముగించాం. కేవలం 10 రూపాయలు కూడా అవ్వలేదు.

అది కూడా మా ఇంట్లో తెలియనివ్వకుండా చేసుకున్నాం’’ అని పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు ఆమిర్‌. ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకునే అంత ధైర్యం ఎలా వచ్చింది? ఆ సంఘటనలు వివరిస్తారా? అని బాలీవుడ్‌ మీడియా అడగ్గా– ‘నేను చెప్పదలచుకోలేదు. ఒకవేళ నా బయోపిక్‌ తీస్తే అప్పుడు ఈ సంఘటనలు ఆ దర్శక–నిర్మాతలతో పంచుకుంటాను’’ అన్నారాయన. వెంటనే మీ బయోపిక్‌లో నటించడానికి ఎవరైతే బావుంటారు? అని ప్రశ్నించగా ‘‘మా అబ్బాయి జునైద్‌ అయితే బావుంటాడు అనుకుంటున్నాను. జునైద్‌ బాలీవుడ్‌ ఎంట్రీ కోసం ప్రస్తుతం స్క్రిప్ట్స్‌ వింటున్నాం. యాక్టింగ్‌ స్కూల్‌లో శిక్షణ తీసుకున్నాడు. ప్రస్తుతం థియేటర్‌ ఆర్టిస్ట్‌గా చేస్తున్నాడు’’ అని పేర్కొన్నారు ఆమిర్‌.

మరిన్ని వార్తలు