థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌ పరాజయంపై ఆమిర్‌ స్పందన

29 Jan, 2019 11:42 IST|Sakshi

చాలా కాలం తర్వాత ప్రేక్షకులకు తన మీద పగ తీర్చుకునే అవకాశం దొరికింది అంటున్నారు బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌ ఆమిర్‌ ఖాన్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన  ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌’చిత్రం బాక్సాఫీస్‌ వద్ద పరాజయం పాలైయిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో పూర్తి బాధ్యత తనదేనని ఆమిర్‌ గతంలో వెల్లడించారు. తాను రూపొందించిన షార్ట్‌ ఫిల్మ్‌ రూబురూ రోషిణి షార్ట్‌ ఫిల్మ్‌ ప్రమోషన్‌ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు ఆమిర్‌.

ఈ సందర్భంగా  ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌’  పరాజయం గురించి మాట్లాడుతూ.. ‘సినిమా విడుదలైన తర్వాత చాలా మంది సినిమా తమకు చాలా బాగా నచ్చిందన్నారు. ప్రేక్షకులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. వారి అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. అయినా సినిమాల పరంగా ఫెయిల్‌ అయ్యి చాలా కాలమయ్యింది. నా మీద పగ తీర్చుకోవడానికి ప్రజలకు ఇప్పుడొక అవకాశం దొరికింది. వారి కోపాన్నంతా ఇలా చూపించార’ని చమత‍్కరించారు ఆమిర్‌.

అంతేకాక ‘ప్రతి దర్శ‍కుడు మంచి చిత్రం తీయాలనే భావిస్తాడు. కానీ సినిమా తీయడం చాలా కష్టమైన పని. ఈ ప్రయత్నంలో కొన్ని సార్లు విజయం సాధిస్తాం.. కొన్ని సార్లు ఓడిపోతాం. దర్శకులు తప్పు చేస్తే.. నేను కూడా తప్పు​ చేసినట్లే. ఆ తప్పులనుంచి మేం ఎంతో నేర్చుకుంటాం. ప్రేక్షకులు నా పేరు చూసి సినిమా చూడ్డానికి వస్తారు. కాబట్టి ఒక సినిమా ఫెయిలైతే అది పూర్తిగా నా బాధ్యతే’ అన్నారు ఆమిర్‌ ఖాన్‌.

మరిన్ని వార్తలు