ఆదిమానవులు ఇతివృత్తంగా అరమ్‌వేట్రుమై

27 Jul, 2017 02:40 IST|Sakshi
ఆదిమానవులు ఇతివృత్తంగా అరమ్‌వేట్రుమై

తమిళసినిమా: హాలీవుడ్‌ చిత్రం అపోకలిప్టో చిత్రం తరహాలో అరమ్‌ మేట్రుమై చిత్రం ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు హరికృష్ణ అంటున్నారు. ఈయన తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సెవెన్త్‌ సెన్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై శక్తివేల్‌ నిర్మిస్తున్నారు. నూతన జంట అజయ్, గోపిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఇందులో యోగిబాబు, ఉమశ్రీ, అళగు, సూర్యకాంత్, చరణ్‌రాజ్, పరదేశీ భాస్కర్‌ ముఖ్యపాత్రలు పోషించారు.

గణేశ్‌రాఘవేందర్‌ సంగీతాన్ని, అరివళగన్‌ ఛాయాగ్రహణం అందించారు. చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ, ఇది ఈ తరానికి చెందిన కథతో రూపొందించిన చిత్రం కాదన్నారు. సుమారు 900 ఏళ్ల క్రితానికి చెందిన ఆదిమానవుల జీవన విధానాన్ని ఆవిష్కరించే చిత్రంగా ఉంటుందని తెలిపారు. వారికి భాషే లేదని చెప్పారు. భాష, జాతి అంటే తెలియకుండా జీవించిన ఆదిమానవుల ఇతివృత్తంగా అరమ్‌ వేట్రుమై చిత్రం ఉంటుందని చెప్పారు. అలా మూడు కొండల్లో మూడు రకాల ఆదివాసుల జీవన విధానాన్ని ఎంతో వ్యయ ప్రాయాసాలకోర్చి రూపొందించామని తెలిపారు.

కథపై నమ్మకంతో చిత్ర యూనిట్‌ అంతా కష్టపడి తమ ప్రయత్నానికి సహకరించారని అన్నారు. చిత్ర షూటింగ్‌ను నాగరికత చెందని అటవీ ప్రాంతాలను అన్వేషించి నిర్వహించామని చెప్పారు. ఇది హాలీవుడ్‌ చిత్రం అపోకలిప్టో చిత్రం తరహాలో చాలా వైవిధ్యంగా ఉంటుందని అన్నారు. చిత్ర నిర్మాణం పూర్తి అయ్యిందని, చిత్రాన్ని చూసిన శ్రీముత్తమిళ్‌ లక్ష్మీ మూవీమేకర్స్‌ అధినేత ఆర్‌.బాలచందర్‌ చాలా బాగుందని విడుదల హక్కులను పొందారని దర్శకుడు వెల్లడించారు.