తెలుగులోనూ ఈ సినిమా విజయం సాధించాలి : ఏ.ఎం.రత్నం

26 Nov, 2013 00:12 IST|Sakshi
తెలుగులోనూ ఈ సినిమా విజయం సాధించాలి : ఏ.ఎం.రత్నం
 ‘‘ఈ సినిమా తమిళనాట పెద్ద హిట్. అజిత్ పిలిచి మరీ నాకీ అవకాశం ఇచ్చారు. ఆయన రుణం తీర్చుకోలేనిది’’ అని ఏ.ఎం.రత్నం అన్నారు. అజిత్, ఆర్య, రానా, నయనతార, తాప్సీ ప్రధాన పాత్రధారులుగా తమిళంలో ఆయన నిర్మించిన చిత్రం ‘ఆరంభం’. విష్ణువర్దన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళనాట పెద్ద హిట్. ఈ సినిమాను ‘ఆట ఆరంభం’ పేరుతో తెలుగులోకి అనువదించారు డా. జి.శ్రీనుబాబు. యువన్‌శంకర్‌రాజా స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. 
 
 విష్ణువర్దన్ ఆడియో సీడీని ఆవిష్కరించి తొలి ప్రతిని శ్రీకాంత్ అడ్డాలకు అందించారు. రానా, ఆర్య ప్రచార చిత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏ.ఎం.రత్నం ఇంకా మాట్లాడుతూ -‘‘తెలుగులో మా సంస్థ నుంచి కర్తవ్యం, పెద్దరికం, స్నేహంకోసం, ఖుషి లాంటి విజయాలొచ్చాయి. తమిళంలో అయితే... మా సంస్థకు 90 శాతం విజయాలున్నాయి. నిర్మాతగా నాకు పునర్జన్మనిచ్చిందీ సినిమా. అజిత్, ఆర్య కాంబినేషన్‌ని ముందుగానే అనుకుని ఈ కథను నేను, విష్ణువర్దన్ కలిసి తయారు చేశాం. ఆర్య ఒప్పుకుంటాడో లేదో అని మీమాంసలో ఉండేవాణ్ణి. అడగ్గానే ఆనందంగా ఒప్పుకున్నాడు. తెలుగులో కూడా ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అని ఆకాంక్షించారు. 
 
 ‘‘రామాయణం లాంటి ఈ సినిమాలో ఆర్య లక్ష్మణుడైతే... నేను హనుమంతుణ్ణి. అజిత్‌గారైతే నిజంగా రాముడే. అంతటి మంచి వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదు. మంచి సినిమాలో నేనూ భాగం అయినందుకు ఆనందంగా ఉంది’’ అని రానా చెప్పారు. ‘‘తన సినిమాను మాకు ఇచ్చి.. మా సంస్థ మరింత ముందుకు వెళ్లడానికి సహకరించిన ఏ.ఎం.రత్నంగారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం’’ అని నిర్మాత అన్నారు. మంచి కథను తెరకెక్కించాలంటే... రత్నం లాంటి నిర్మాతలు దొరకాలని, తన రిక్వెస్ట్ మీద ఇందులో ప్రత్యేక పాత్ర పోషించిన రానాకు కృతజ్ఞతలని దర్శకుడు చెప్పారు. ఇంకా వి.సాగర్, బీవీఎస్‌ఎన్ ప్రసాద్, నల్లమలుపు శ్రీనివాస్, వి.సముద్ర, ఘంటసాల రత్నకుమార్, వీరభద్రమ్, శోభారాణి, రమేషయ్య తదితరులు పాల్గొన్నారు.