‘ఆటగదరా శివ’ మూవీ రివ్యూ

20 Jul, 2018 08:07 IST|Sakshi

టైటిల్ : ఆటగదరా శివ
జానర్ : ఎమోషనల్‌ డ్రామా
తారాగణం : దొడ్డన్న, ఉదయ్‌ శంకర్‌, హైపర్‌ ఆది
సంగీతం : వాసుకి వైభవ్‌
దర్శకత్వం : చంద్ర సిద్ధార్థ
నిర్మాత : రాక్‌లైన్‌ వెంకటేష్‌

ఆ నలుగురు, అందరి బంధువయా లాంటి హార్ట్‌ టచింగ్‌ సినిమాలను తెరకెక్కించిన చంద్ర సిద్ధార్థ దర్శకత్వంలో తెరకెక్కిన  తాజా చిత్రం ఆటగదరా శివ. కన్నడలో ఘనవిజయం సాదించిన రామ రామరే సినిమాకు రీమేక్‌ తెరకెక్కిన ఈ సినిమాలో కన్నడ నటుడు దొడ్డన్న, ఉదయ్‌ శంకర్‌, జబర్దస్త్‌ ఫేం హైపర్‌ ఆదిలు కీలక పాత్రల్లో నటించారు. దాదాపు మూడేళ్ల విరామం తరువాత చంద్ర సిద్ధార్థ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావటంతో ఆటగదరా శివపై ఆసక్తి నెలకొంది. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా..?

కథ;
జంగయ్య (దొడ్డన్న) తలారీ. ఊళ్లో పశువులకు వైద్యం చేస్తూ ఉండే జంగయ్య, ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చినప్పుడు వెళ్లి తలారీ బాధ్యతలు నిర్వహిస్తుంటాడు. అలా ఉరిశిక్ష పడ్డ ఖైదీ గాజులమర్రి బాబ్జీ(ఉదయ్ శంకర్‌)ని ఉరితీసేందుకు రావాల్సిందిగా జంగయ్యకు కబురందుతుంది. జంగయ్య బయలుదేరే సమయానికి బాబ్జీ.. జైల్లో సెంట్రీని గాయపరిచి పారిపోతాడు. బయటకు వచ్చి బాబ్జీ చాలా దూరం పరిగెత్తి పరిగెత్తి చివరకు జీపులో వెళ్తున్న జంగయ్యనే లిఫ్ట్ అడుగుతాడు. కొద్ది దూరం ప్రయాణం తరువాత పేపర్‌లో ఉరిశిక్ష పడ్డ ఖైదీ పరార్‌ అంటూ  వచ్చిన ప్రకటన చూసిన జంగయ్య బాబ్జీని గుర్తుపడతాడు. అయినా ఏం తెలియనట్టే ప్రయాణం కొనసాగిస్తారు. వారి ప్రయాణం చివరకు ఎలా ముగిసింది..? ఈ ప్రయాణంలో వాళ్లకు ఎదురైన అనుభవాలేంటి..? కలిసిన వ్యక్తులు ఎవరు..? అన్నదే మిగతా కథ.

విశ్లేషణ ;
కన్నడలో ఘనవిజయం సాధించిన రామ రామరే సినిమాను దాదాపు అదే ఫీల్‌ను క్యారీ చేస్తూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించారు చంద్రసిద్ధర్థ. కథగా చిన్నపాయింటే అయినా.. కథనంతో ప్రేక్షకులను మెప్పించారు. సినిమాకు కీలకమైన జంగయ్య పాత్రను మలిచిన తీరు చాలా బాగుంది. ఆ పాత్రకు కన్నడ నటుడు దొడ్డన్న ప్రాణం పోశారు. లుక్స్‌ పరంగానే కాదు నటనతోనూ మెప్పించారు. ముఖ్యంగా ఎమోషనల్‌ సీన్స్‌లో దొడ్డన్న నటన సూపర్బ్‌. బాబ్జీ పాత్రలో కనిపించిన ఉదయ్‌ శంకర్‌ ఆకట్టుకున్నాడు. పెద్దగా వేరియేషన్స్‌ చూపించే అవకాశం దక్కకపోయినా.. సెటిల్డ్‌ పర్ఫామెన్స్‌ తో ఆకట్టుకున్నాడు. జబర్దస్త్‌ ఫేం హైపర్‌ ఆదికి లెంగ్తీ రోల్‌ దక్కింది. తన మార్క్‌ పంచ్‌ డైలాగ్స్‌తో కామెడీ పండించే ప్రయత్నం చేశాడు ఆది.ఇతర పాత్రలకు పెద్దగా ఇంపార్టెన్స్‌ లేకపోవటంతో పాటు ఆపాత్రలో పరిచయం ఉన్న నటులెవరూ కనిపించలేదు.

దర్శకుడు చంద్ర సిద్దార్థ తన గత చిత్రాల మాదిరిగానే మరోసారి మనసుకు హత్తుకునే ఎమోషనల్‌ సీన్స్‌తో సినిమాను రూపొందించారు. ముఖ్యంగా ఆటగదరా శివ సినిమాకు ప్రధాన బలం మాటలు. ‘ముందు క్షమాపణ అడిగిన వాడే ధైర్యవంతుడు.. క్షమించిన వాడే బలవంతుడు’, ‘మనం ఉన్నప్పుడు లేనోళ్లు, పోయాక ఉంటే ఎంత పోతే ఎంత’, ‘చావు విముక్తి, బతుకు తృప్తి’ లాంటి డైలాగ్స్‌ ఆలోచింప చేస్తాయి. అయితే కమర్షియల్ సినిమాలు ఇష్టపడే వారని ఈ సినిమా మెప్పించటం కాస్త కష్టమే. సినిమాకు మరో మేజర్‌ ప్లస్ పాయింట్‌ లవిత్‌ సినిమాటోగ్రఫి. నిర్జన ప్రదేశంలో పెద్దగా సెట్‌ ప్రాపర్టీస్‌ను వాడకుండా ఆసక్తికర విజువల్స్‌ను క్యాప్చర్‌ చేశారు. కన్నడ వర్షన్‌కు సంగీతమందించిన వాసుకీ వైభవ్‌ తెలుగు వర్షన్‌ కు కూడా మంచి సంగీతాన్నందించారు. ముఖ్యంగా టైటిల్‌ సాంగ్‌తో పాటు, ఎట్టాగయ్య శివ పాటలకు మంచి రెస్సాన్స్‌ వస్తోంది. చాలా కాలం తరువాత తెలుగు సినిమాను నిర్మించిన రాక్‌లైన్‌ లైన్‌ వెంకటేష్‌ తమ బ్యానర్‌ స్థాయికి తగ్గ సినిమాతో ఆకట్టుకున్నారు.

ప్లస్‌ పాయింట్స్‌ ;
కథా కథనం
ప్రధాన పాత్రధారుల నటన
ఎమోషనల్‌ సీన్స్‌

మైనస్‌ పాయింట్స్‌ ;
రొటీన్ కమర్షియల్‌ ఎలిమెంట్స్ లేకపోవటం

సతీష్‌ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్‌ డెస్క్‌.

                                                                      

Poll
Loading...
మరిన్ని వార్తలు